Home News Stories

ప్రక్షాళనలో పదవీగండం తప్పదా?

దుబ్బాక ఫలితం టీఆర్‌ఎస్‌ ధీమాను దెబ్బకొట్టింది. ప్రత్యర్థులకు డిపాజిట్లు రావనుకున్నచోట కారు బోల్తాకొట్టింది. తేడా ఎంతన్నదికాదు…బీజేపీ బుల్లెట్‌ దిగింది. స్వయానా సీఎం సొంత జిల్లాలో, అది కూడా ఆయన మేనల్లుడు, సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి హరీష్‌ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన చోట ఓడిపోవడం…టీఆరెస్‌కి రాజకీయంగా పెద్ద షాక్‌. ఇప్పటిదాకా తెలంగాణలో తమకు తిరుగులేదన్న నమ్మకంతో ఉన్న గులాబీపార్టీ దుబ్బాక రిజల్ట్‌ తో ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. లోతుగా సమీక్షించుకునేందుకు రెడీ అవుతూనే…ప్రక్షాళన చర్యలకు పూనుకుంటున్నారు టీఆరెస్‌ అధినేత కేసీఆర్.

CM KCR

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపట్టాలనుకుంటున్నారు కేసీఆర్‌. కొన్నాళ్లుగా ఆయన మదిలో ఈ ఆలోచన ఉన్నా…దుబ్బాక ఫలితం తర్వాత తక్షణ కార్యాచరణకు ఉపక్రమించబోతున్నారు. వారం పదిరోజుల్లోపే తెలంగాణ కేబినెట్‌ లో మార్పులు చేర్పులు తథ్యమనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కేబినెట్‌ విస్తరణ ఉంటుందని కొందరంటుంటే….దుబ్బాక ఎఫెక్ట్‌ కూడా తోడవ్వటంతో విస్తరణ కాదు..జరిగేది ప్రక్షాళనేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్‌ బలహీనపడిందనుకుంటే…బీజేపీ పుంజుకుంటూ ఉండటం, మరో పక్క గ్రేటర్‌ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేబినెట్‌ ప్రక్షాళన అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి దీనిపై తుది కసరత్తు చేశారని చెబుతున్నారు. కొత్తగా కొందరికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పటికే మంత్రులుగా ఉన్నకొందరిపై వారి పనితీరు, ఫీడ్‌ బ్యాక్‌ ని బట్టి వేటు పడబోతోంది. ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదనేది పార్టీ శ్రేణుల్లో తీవ్రస్థాయిలో జరుగుతున్న ప్రచారం.

పదవీగండం ఉన్న ఆ ముగ్గురు మంత్రులు ఎవరనేదానిపై ఎవరి వాదన ఎలా ఉన్నా…రాసలీలల మంత్రిగా బద్నాం అయిన ఓ మంత్రి మెడపై మొదటగా వేటు పడటమైతే ఖాయమంటున్నారు. ఎందుకంటే ఆ రాసలీలల మంత్రిపై కేవలం గాలివాటంగా ఆరోపణలు రాలేదు. దానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న ఆ మంత్రిపై తీవ్ర ఆగ్రహంతో సీఎం కేసీఆర్. అటు ఇంటలిజెన్స్‌ వర్గాలు కూడా ఆ సమాచారాన్ని ధ్రువీకరిస్తూ సీఎంకు నివేదిక సమర్పించినట్లు సమాచారం. విషయం తెలిసి ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చుకునేందుకు ఆ మంత్రి ప్రయత్నించినా, అధినేత అప్పాయింట్‌ మెంట్‌ దొరకలేదంటున్నారు. ఆరోపణల్లో వాస్తవం ఉందని తేలటంతో కేబినెట్‌ ప్రక్షాళనలో ఆ మంత్రి పదవి ఊస్టింగ్‌ కాబోతున్నారనేది కన్పం.

కీలకమైన నియోజకవర్గం నుంచి గెలుపొంది..మంత్రి కూడా అయిన ఆ నాయకుడు ఖర్మకాలి రాసలీలల వివాదంలో పీకల్లోతు కూరుకుపోయాడు. ప్రజలను కలవడానికే తీరిక దొరకని సమయంలో ఆ మంత్రి సోషల్ మీడియాలో అమ్మాయిలతో చాటింగుల్లో కాలం గడిపేశాడు. ఓ యువతితో ఆ అమాత్యుడి వాట్సాప్‌ చాటింగ్‌ చివరికి ఆయన కుటుంబంలో కూడా చిచ్చుపెట్టింది. యువతితో ఆ మంత్రి చాటింగ్‌ వివాదం సొంత జిల్లాతో పాటు పక్కనున్న జిల్లాలకూ పాకింది. నిప్పులేనిదే పొగ రాదన్న్లు ఆ యువతితో మంత్రి పర్సనల్ చాటింగ్ స్క్రీన్‌ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చివరికి ఆ రచ్చ ఫేస్‌బుక్ ప్లాట్‌ ఫాం పైకి కూడా ఎక్కింది. రకరకాల ప్రలోభాలతో ఎక్కువ రచ్చకాకుండా ఆ మంత్రి కొంత జాగ్రత్తపడినా…అప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. ఆ యువతి ఫొటోలను తీసి తనకు పంపాలని మంత్రి ఒకరికి బాధ్యతలు అప్పగించడం, వాటిని ఆయనకు వాట్సాప్‌ లో చేరవేస్తున్న క్రమంలో అవి కాస్తా లీక్‌ కావటంతో కొంప కొల్లేరయ్యింది.

అసలే ఇది సోషల్‌ మీడియా కాలం. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు కాలు గడపదాటే లోపే ప్రచారం ప్రపంచమంతా చుట్టేస్తుంది. ఇలాంటి టైంలో మంత్రి తన వయసు, హోదా మరిచిపోవటంతో వ్యవహారం గబ్బుపట్టింది. ఒక్క రోజులోనే ఆయనకు సంబంధించిన పోస్టింగ్‌లు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో షేరింగ్ జరిగినట్టు అంచనా. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికే ఈ ప్రచారం పరిమితం కాలేదు. ఒకటి రెండు రోజుల్లోనే మిగిలిన జిల్లాలు కూడా దాటేసి పెద్దలదాకా వచ్చేసింది. ఏమిటీ న్యూసెన్స్‌ అని…కొందరు పెద్దలు ఆ మంత్రికి క్లాస్‌ తీసుకునేదాకా వెళ్లింది వ్యవహారం. ఈ వ్యవహరంతో మంత్రిగారికి ఎలాంటి సంబంధం లేదని, స్క్రీన్‌ షాట్ల తంతుతో ఆయనపై అపనిందలు వేస్తున్నారని అనుచరులు ఎంత వేనకేసుకొచ్చినా పక్కా ఆధారాలు కనిపిస్తుండటంతో… మంత్రి సీటుకిందికి నీళ్లు వచ్చేశాయి.

పదవి ఊడే రాసలీలల మంత్రి ఎవరనేది ఇప్పటికే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. పదవులు పోయే మిగిలిన మంత్రులు ఎవరు, కొత్తగా అవకాశాలు దక్కించుకునేది ఎవరనే చర్చ మొదలైంది. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు.. దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రికి ఉద్వాసన పలకబోతున్నారట సీఎం కేసీఆర్‌. మంత్రిగా అవకాశం ఇచ్చి రెండేళ్లు అయినా కేటాయించిన శాఖలపై పట్టు సాధించలేకపోవడం.. పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, ప్రజల్లో తమదైన ముద్ర వేయలేకపోవడం లాంటి అంశాలు మంత్రుల భవిష్యత్తుని నిర్దేశించబోతున్నాయి. అదే సమయంలో కొందరు మంత్రుల అనుచరులు, వారి బంధువులు వారి పదవులను అడ్డుపెట్టుకుని రెచ్చిపోతున్నారు. మంత్రుల అనుచరగణం దందాలు, సెటిల్మెంట్ల మీద కూడా గులాబీ బాస్‌ కి సమాచారం ఉండటంతో వారిని తప్పించాలనే నిర్ణయానికి వచ్చారంటున్నారు.

కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో కొందరు మంత్రులను తప్పిస్తే…మంత్రివర్గంలో కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. పదవులు ఊడతాయనే భయం ఉన్న మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే… పదవులపై నమ్మకం పెట్టుకున్నవారు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ నాయకుడికి మంత్రివర్గంలో స్థానం దక్కడం ఖాయం అంటున్నారు. గ్రేటర్ పరిధి నుంచి ప‌ద్మారావు, దానం నాగేంద‌ర్‌ లలో ఒకరికి మంత్రి పదవి దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్‌ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని…కీలకమైన నగరంలో మరొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు దక్కవచ్చంటున్నారు. కేబినెట్ విస్తరనలో సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను కూడా దృష్టిలో పెట్టుకోబోతోంది టీఆరెస్‌. ఆ లెక్కన వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్ జిల్లాల‌ నుంచి విన‌య్ భాస్కర్ లేదంటే జోగు రామన్నలో ఒక‌రికి మంత్రిగా అవకాశం దొరకొచ్చు. మామూలుగా అయితే ముహూర్తాలు చూసుకున్నాకే ఏ పనైనా మొదలుపెట్టే టీఆరెస్‌ అధినేత…దుబ్బాక ఫలితం ప్రతికూలంగా రావటంతో కేబినెట్‌ ప్రక్షాళనకు వెంటనే పూనుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here