Home News

తెలంగాణ బీజేపీలో అంతర్గతపోరు రచ్చకెక్కుతుందా ?

తెలంగాణ బీజేపీలో బయటకు అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా..అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. సీనియర్ల మధ్య గ్యాప్ అంతకు అంతకు పెరుగుతుంది. ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారట. దీనికి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిక అంశం మరింత ఆజ్యం పోసినట్లు తెలుస్తుంది. ఈటల కాషాయ కండువా కప్పుకోవడానికి ముందు తర్వాత జరిగిన పరిణామాలతో కొందరు నాయకుల మధ్య దూరం పెరిగిందట. ఈటల తనవల్లే పార్టీలో చేరారు అనే క్రెడిట్‌ ఫైట్‌ కోసం నాయకులు పాకులాడటం బీజేపీలో కొందరికి నచ్చలేదని చెబుతున్నారు. ప్రధానంగా ఓ నాయకుడు చాలా ఎక్కువ హడావిడి చేశారని.. అంత అవసరం లేదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

ఈటల బీజేపీలో చేరిపోవడం ఆ పై ఆయన హుజురాబాద్‌ ఉపఎన్నికపై ఫోకస్‌పెట్టి క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నా.. నాయకులు వ్యవహరించిన తీరుపై చర్చ మాత్రం ఆగడం లేదట. తెర వెనక జరిగిన పరిణామాలపై తెగ చెవులు కొరుక్కుంటున్నారు. కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. బయటకు ఎవరూ కామెంట్‌ చేయకపోయినా.. పార్టీ అంతర్గత చర్చల్లో మాత్రం హాట్‌హాట్‌గానే చర్చ నడుస్తుంది.తెలంగాణ బీజేపీలో గ్రూప్‌ల గోల ఇప్పటిది కాదు. పేరున్న నాయకులకు ఎప్పుడూ ప్రత్యేకంగా ఒక వర్గం ఉంటూ వస్తోంది. ఎవరు కీలక పదవుల్లో ఉంటే వారి వర్గాలకు.. అనుయాయులకు పదవులు దక్కుతుంటాయని చెబుతారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అది కొందరికి నచ్చడం లేదట. ఆయనకు చెక్‌ పెట్టేందుకే హుజురాబాద్‌ ఉపఎన్నికలో వివేక్‌కు నచ్చని వారికి ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది.

మాజీ మంత్రి చంద్రశేఖర్‌ పేరును హుజురాబాద్ ఎన్నికల బాధ్యుల్లో చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివేక్‌, చంద్రశేఖర్‌లకు పడదని.. అది దృష్టిలో పెట్టుకునే పార్టీలో కొందరు పావులు కదిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ సర్కిళ్లలోని సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వివేక్‌, చంద్రశేఖర్‌ అంశాలపైనే పోస్టులు ట్రోల్‌ అవుతున్నాయి. ఈ ఎత్తుగడ వెనక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉన్నారా అన్న చర్చ నడుస్తుంది. ఈ పరిణామాల మధ్య హుజురాబాద్‌ ఉపఎన్నికలో మాజీ ఎంపీ వివేక్‌ ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే అక్కడ పెద్దిరెడ్డి రూపంలో మరో గ్రూప్ గుబులు పుట్టిస్తుంది. ఉపఎన్నిక నాటికి బీజేపీ పెద్దలు ఈ గ్రూపులను ఎలా సెట్ రైట్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here