Home News Politics

జ‌నాన్ని ఏమార్చారా? ఈవీఎంలు మార్చేశారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగింది? ఈవీఎంల‌పై చ‌ర్చ‌తో నిజాలు బ‌య‌టికొస్తాయా?

తెలుగురాష్ట్రాల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ముగిశాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు అద‌నం. ఏప్రిల్ 11న ఎన్నిక‌లు జ‌రిగితే మే 23దాకా గెలిచేదెవ‌రో స‌స్పెన్స్‌. నెల‌రోజుల పార్టీల‌కు టెన్ష‌నే టెన్ష‌న్‌. మొన్న‌టిదాకా ఎల‌క్ష‌న్ క్యాంపెయిన్‌లో గంట‌ల‌త‌ర‌బ‌డి స్పీచులు దంచేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు…ఎన్నిక‌లు అయిపోయాక కూడా బిజీబిజీగా ఉన్నారు. ఎన్నిక‌లైపోయాక ఈసీమీద పోరాటం ఎందుక‌న్న ప్ర‌శ్న‌కు…ఆయ‌న ద‌గ్గ‌ర జ‌వాబు ఉండ‌నే ఉంది. ఆయ‌న రాష్ట్రానికి ప‌రిమిత‌మైన నేత‌కాదు. అన్ని పార్టీల‌ను కూడ‌గ‌ట్టి, అన్ని రాష్ట్రాల్లో చైత‌న్యం నింపాల్సిన గురుత‌ర బాధ్య‌త‌ను భుజ‌స్కంధాల‌కెత్తుకున్న సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్‌. ఏపీలో ఫ‌లితం ఎలా ఉంటుందో పైవాడికే ఎరుక‌. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రివ‌ర్యులంటూ జ‌గ‌న్ నేమ్‌ప్లేట్ కూడా రెడీ చేసుకుని వైసీపీ నేత‌లు ముందే పండ‌గ చేసుకుంటున్నారు. 23నే ప్ర‌మాణం చేస్తాన‌ని చంద్ర‌బాబు అంటున్నారు. రాజెవ‌రో రెడ్డెవ‌రో తేలాలంటే నెల‌రోజులు ఓపిక‌ప‌ట్టాల్సిందే.

జాతీయ‌స్థాయిలో ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ని దోషిగా నిల‌బెట్టి…మిగిలిన ద‌శ‌ల్లోనైనా మోడీ అండ్‌కోని క‌ట్ట‌డిచేయాల‌న్న‌ది చంద్ర‌బాబు ప్లాన్‌. అందుకే వీవీ ప్యాట్‌లు స‌గ‌మైనా లెక్కించాల‌న్న డిమాండ్ బ‌లంగా వినిపిస్తున్నారు. మిగిలిన విప‌క్షాల నేత‌లు కూడా ఆయ‌న‌తో గొంతు క‌లుపుతున్నారు. ఈసారి ఏపీలో జ‌రిగినంత ఎన్నిక‌ల హింస మునుపెన్న‌డూ జ‌ర‌గ‌లేదు. దానికి కూడా ఈసీనే కార‌ణ‌మ‌ని వేలెత్తిచూపుతున్నారు చంద్ర‌బాబు. రాష్ట్రాధినేత‌గా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యార‌ని, తెలంగాణ‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్ని ప్ర‌శాంతంగా నిర్వ‌హించామ‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్నారు భావి ముఖ్య‌మంత్రిగా ప్రొజెక్ట్ అవుతున్న క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు వార‌సుడు కేటీఆర్. అయితే ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిన‌ట్లు దేశ‌వ్యాప్తంగా ఈసీమీద వెల్లువెత్తుతున్న ఆరోప‌ణ‌లు తెలంగాణ పాల‌కుల‌వైపు మ‌ళ్లుతున్నాయి. అదికూడా అసెంబ్లీకి జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల‌మీద‌.

టీఆర్ఎస్‌కి ఓట‌మి త‌ప్ప‌ద‌ని త‌ల‌పండిన నేత‌లు వేసుకున్న లెక్క‌లు బెడిసికొట్టాయి. 88 సీట్ల‌తో టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చింది. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీల్లో హేమాహేమీల‌నుకున్న నేత‌లు అత్యంత ఆశ్చ‌ర్యంగా ఓట‌మి మూట‌గ‌ట్టుకున్నారు. ఈ సైలెంట్‌వేవ్ ఎలా సాధ్య‌మైంద‌నే ప్ర‌శ్న ఇప్ప‌టికీ ఎంతోమంది బుర్ర‌ల్ని తొలిచేస్తూనే ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈవీఎంల మీద ర‌చ్చ మొద‌ల‌వ్వ‌గానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగి ఉంటుంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా అంచ‌నావేసిన పోలింగ్‌కి, ఈసీ ప్ర‌క‌టించిన పోలింగ్‌కి ప‌దిశాతానికి పైగా తేడా ఉంది. మ‌రోవైపు ఎక్క‌డ ఎంత పోలింగ్ జ‌రిగిందో చెప్పేందుకు ఎన్నిక‌ల సంఘం ఏకంగా 28 గంట‌లు తీసుకుంది. అప్ప‌ట్లోనే తెర‌వెనుక ఏదో జ‌రిగింద‌న్న అనుమానాలు వ‌చ్చినా, నాయ‌కులు ఆరోపించినా ఎక్క‌డి దొంగ‌లు అక్క‌డే గ‌ప్‌చుప్‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈసీ సాయంతో హైటెక్ రిగ్గింగ్ జ‌రిగింద‌నీ…టీఆర్ఎస్‌ని మ‌ళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కేంద్ర‌పెద్ద‌ల మ‌ద్ద‌తుతో ఈవీఎంల‌ను మ్యానుపులేట్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. డిసెంబ‌రు 7 అసెంబ్లీ పోలింగ్ త‌ర్వాత‌…విప‌క్ష‌పార్టీలు అప్ర‌మ‌త్త‌మ‌య్యే అవ‌కాశం కూడా ఇవ్వ‌కుండా అర్ధ‌రాత్రి దాటాక ఏదో జ‌రిగింద‌న్న అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నా…అదేంట‌న్న‌దే ఎవ‌రికీ క్లారిటీ రావ‌డం లేదు. ఈవీఎంల సీలింగ్ తీసి జాగ్ర‌త్త‌గా మేనేజ్ చేశార‌ని, దాదాపు 60 నుంచి 65 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ వ్య‌వ‌హార‌మంతా చ‌డీచ‌ప్పుడు కాకుండా పూర్తిచేశార‌నే అనుమానాల‌కు నేత‌లు ఆధారాలు వెతుకుతున్నారు. రిజ‌ల్ట్ రాక‌ముందే ముఖ్య‌మైన విప‌క్ష‌నేత‌ల్లో ఎవ‌రెవ‌రు ఓడిపోతారో ముందే చెప్పేశారు టీఆర్ఎస్ నేత‌లు. త‌మ గెలుపుమీద ధీమా ఉండొచ్చుగానీ…అవ‌త‌ల ఎవ‌రు ఓడ‌తారో ముందే ఓట్ల లెక్క తెలిసిన‌ట్లు మాట్లాడారు. అదెలా సాధ్య‌మైంద‌న్న‌ది కొంద‌రి ప్ర‌శ్న‌.

పోలైన ఓట్ల‌కు, లెక్కించిన ఓట్ల‌కు చాలా చోట్ల తేడా ఉంద‌న్న దానిపై ఈసీ నోరుమెద‌ప‌లేదు. ఈసీనే దోషిగా నిల‌బెడుతున్న విప‌క్షాలు…కోర్టుమెట్లు ఎక్క‌బోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు జ‌రిగాయో లేదో నిగ్గు తేల్చేందుకు 17ఏ రిజిస్ట‌ర్లు కీల‌కం కాబోతున్నాయి. ఖ‌మ్మానికి చెందిన ఓ లాయ‌ర్ కూడా ఈవీఎంల రిగ్గింగ్‌మీద కోర్టుకెక్కారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ మూడ్నెల్ల‌లోపే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయింది. ప్ర‌జ‌ల్లో నిజంగా బ‌ల‌ముంటే ఇంత త‌క్కువ స‌మ‌యంలో ఇంత వ్య‌తిరేక‌త ఎందుకుంటుంద‌న్న ప్ర‌శ్న‌కు జ‌వాబులేదు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల గెలుపుపై అక్క‌డి ప్ర‌జ‌ల్లోనే ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది.ఇదెలా సాధ్య‌మైందో చాలామందికి ఇప్ప‌టికీ అంతుప‌ట్ట‌ని విష‌య‌మే. నిజంగా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో గెలిస్తే ఓకే. ప్ర‌జాతీర్పుకు విరుద్ధంగా తెర‌వెనుక కుట్ర జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు నిజ‌మైతే మాత్రం…అది ప్ర‌జాస్వామ్యానికే పెను ప్ర‌మాదం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here