Home News

ఆ నియోజకవర్గం అంటే హడలిపోతున్న అధికారులు…!

ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో పోస్టింగ్ అంటే ప్రభుత్వ యంత్రాంగం ఎగిరి గంతేసేవారు.. అధికారపార్టీ నాయకుల అండదండలు ..ఆదాయం మెండుగా ఉండే ఆ ప్రాంతానికి బదిలీల కోసం గతంలో పైరవీలు చేయించుకుని మరీ పోస్టింగ్ వేయించుకునేవారు … అయితే ఇప్పుడు అంత సీన్‌ కనిపించడం లేదు … వామ్మో అక్కడ పోస్టింగా?… నేనెళ్లను బాబోయ్ అని బెదిరిపోతున్నారట … ఇంతకీ ఉద్యోగులను అంతలా భయపెడుతున్న నియోజకవర్గమేది?


ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీలు .. పోస్టింగ్‌ల జాతర కొనసాగుతోంది . దీంతో జిల్లాల వారీగా నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతలు తమకు కావాల్సిన … అనుకూలంగా ఉండే వారికి వివిధ శాఖల్లో పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారు … అటు అధికారులు , వివిధ శాఖల సిబ్బంది సైతం తమకు అనుకూలమైన ప్రాంతంలో పోస్టింగ్ ల కోసం నేతల చూట్టూ తిరుగుతూ పైరవీలు చేసుకుంటున్నారు … అయితే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి వేరేలా ఉందట … ఈ నియోజకవర్గంలో పనిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం బెంబేలెత్తిపోతున్నారట … అక్కడ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం.. విడమంటే పాముకు కోపమన్నట్లు .. తయారవ్వడమే అందుకు కారణమంట..


రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి బలంగా వీచినా …సిక్కోలు జిల్లాలో ఇచ్ఛాపురం , టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గాలను మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది … దీంతో జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎనిమిది వైసీపీ , రెండు టీడీపీ ఖాతాలో జమ అయ్యాయి … అసలు సమస్య ఇక్కడే మొదలైంది … వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ టెక్కలిలో ఎమ్మెల్యేగా గెలిచింది మాత్రం మాజీ మంత్రి టీడీపీ సీనియర్‌ కింజరాపు అచ్చెన్నాయుడు … దీంతో బదిలీల వ్యవహారంలో , విధుల నిర్వహణలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది రెండు పార్టీల మధ్య నలిగిపోవాల్సి వస్తోందంట … ఫలితంగా అక్కడ ఉద్యోగం అంటే బెంబేలెత్తిపోతున్నారట…


లోకల్ ఎమ్మెల్యే చెప్పింది వినకపోతే ఆయన ఊరుకోరు … వైసీపీ నేతలు చెప్పింది చేయకపోతే ప్రభుత్వ పెద్దల ఆగ్రహం చవిచూడాలి … దాంతో కొత్తవారు టెక్కలికి ట్రాన్స్‌ఫర్‌ అంటే భయపడుతున్నారంట.. ఇక అక్కడ ఉన్నవారు ఎలా వ్యవహరించాలన్న దానిపై తలలు పట్టుకుంటున్నారట .. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా టెక్కలిలో గెలిచింది తానే కాబట్టి తాను చెప్పిందే జరగాలన్న రీతిలో అచ్చెన్నాయుడు ఉన్నారట .. అయితే అధికారపక్షం కాబట్టి అన్ని స్థాయిల ఉద్యోగుల బదిలీలు తమకు తెలిసే జరగాలంటూ వైసీపీ నాయకులు అధికారుల పై ఒత్తిడి తెస్తున్నారట …


మరోవైపు గతంలో టీడీపీ ప్రభుత్వానికి ఫేవర్‌గా పనిచేసారంటూ.. కొందరు ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసిన వైసీపీ నాయకులు … వారి బదిలీలకు సిఫార్సు చేశారట … ఈ పరిణామాలు చూస్తూ మండలస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించే అధికారులైతే టెక్కలికి రావాలంటేనే భయపడి చస్తున్నారట … అసలే అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరుతో అధికారుల బుర్ర బొప్పికడుతుంటే… ప్రస్తుతం టెక్కలి వైసీపీలో రెండు వర్గాలు నడుస్తుండటంతో ఎవరిమాట వినాలో తెలియక అధికారులు , సిబ్బంది తలలు పట్టుకుంటున్నారట …


రెండు వర్గాల వైసీపీ నేతలు తమకు అనుకూలమైన అధికారులు , సిబ్బందిని నియమించుకునేందుకు సిఫార్సు లేఖలు అందిస్తుండటంతో వివిధ శాఖల అధికారులు ఏంచేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట … తాము చెప్పిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రెండు వర్గాల నేతలు వార్నింగ్ లు ఇస్తున్నారట .. దీంతో టెక్కలి డివిజన్ అంటేనే వామ్మో …అక్కడ పనిచేయలేం … అని సిబ్బంది బెదిరిపోతున్నారట…


అదలా ఉంటే ఇప్పటికే అధికారపార్టీ నాయకులు జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే టెక్కలిలో డీలర్లు , సీపీఎఫ్ లను తొలగించడంపై దృష్టి సారించినట్లు సమాచారం … అలాగే మధ్యాహ్న భోజన పథకం కార్మికులు , అంగన్ వాడీ సిబ్బంది , పంచాయతీ కార్యదర్శులు , వీఆర్వోలు , ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర ఉద్యోగులపై సైతం అధికార పార్టీ నేతలు ఓ కన్నేశారట . మొన్నామధ్య పోలీసు , ఎక్సైజ్ శాఖల్లో సీఐలు , ఎస్సైలు బదిలీలు చేసిన సందర్భంలో తమను అసలు ఖాతరు చేయలేదని ఇప్పటికే ఫ్యాన్ పార్టీకి చెందిన టెక్కలి నేత ఒకరు గుర్రుగా ఉన్నారట


తాజాగా రెవెన్యూ శాఖలో బదిలీలు జాతర జరుగుతుండటంతో .. నేరుగా ఫలానా వాళ్లను అక్కడి వేయండి … ఇక్కడ వద్దు … అంటూ నేరుగా ఉన్నతాధికారులనే ఆదేశించే స్థాయిలో ఆ నాయకుడు రెచ్చిపోతున్నారట … మొత్తమ్మీద టెక్కలిలో ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందంటిప్పుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here