Home News Stories

బీహార్‌లో లాలూ వారసుడి హవా! అసలు కారణాలు ఇవే!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరో ముందస్తుగానే తేలిపోయింది. బీజేపీ మద్దతుతో మరోసారి అధికారంలోకి రావాలనుకున్న నితీష్‌కుమార్‌ ఆశలను అడియాసలు చేశారు బీహార్‌ ఓటర్లు. ఇవే తన చివరి ఎన్నికలని ప్రచారం చివర్లో నితీష్‌ సంధించిన సెంటిమెంట్‌ అస్త్రం కూడా పనిచేయకుండా పోయింది. లాలూ వారసుడొస్తే మళ్లీ జంగిల్‌రాజ్‌ వస్తుందనే ప్రధాని మోదీ హెచ్చరికలను బీహార్‌ ప్రజలు పట్టించుకోలేదు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, యువనేతగా తేజస్వియాదవ్‌ చేసిన ప్రచారానికి ఓట్లు పడ్డాయి. బీహార్‌లో గెలిచేది మహాఘట్‌బంధనేనని ఎగ్జిట్‌పోల్స్‌ కుండబద్దలు కొట్టాయి. కాంగ్రెస్‌తో కలిసి బీహార్‌లో గెలుపు గుర్రం ఎక్కబోతున్నారు ఆర్జేడీ నేత, లాలూప్రసాద్‌ యాదవ్‌ కొడుకు తేజస్వియాదవ్‌.ఒకటీ రెండు కాదు…దాదాపుగా అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ విజయం తేజస్విదేనని తేల్చేశాయి. కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ పది సీట్లదాకా ఆధిక్యం ఉండొచ్చని అంచనావేస్తే…మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం తిరుగులేని మెజారిటీతో బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి రాబోతోందని అంచనావేశాయి.

మూడో దశ పోలింగ్‌ ముగియగానే పలు సంస్థలు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేశాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల మహాకూటమికే విజయావకాశాలు ఉంటాయనేదే అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ క్లియర్‌ కట్‌గా చెప్పేశాయి. సీఎం అభ్యర్థిగా 44శాతం మంది తేజస్వీ యాదవ్‌ వైపు మొగ్గుచూపినట్లు ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా సర్వేలో తేలింది. ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్‌కుమార్‌ వైపు కేవలం 35 శాతం మంది మొగ్గుచూపారు. ఆర్జేడీకి 120 సీట్లు, ఎన్డీయేకి 116 సీట్లొస్తాయని.. టైమ్స్ నౌ-సీ ఓటర్‌ సర్వే వెల్లడించింది. ఆర్జేడీకి 131దాకా సీట్లొస్తాయని అంచనావేసింది ఏబీపీ న్యూస్‌ సర్వే. ఎన్డీయేకి 104నుంచి 128 సీట్లదాకా వస్తాయనేది ఆ సంస్థ అంచనా. ఇక బీజేపీకి అనుకూలమనే ముద్రపడ్డ రిపబ్లిక్‌ టీవీ కూడా బీహార్‌ ఎన్డీయే చేజారబోతోందని స్పష్టంచేసింది. రిపబ్లిక్‌ టీవీ ఎగ్జిట్‌పోల్స్‌లో ఆర్జేడీ కూటమికి 128 సీట్లొస్తే…ఎన్డీయే 104 సీట్లకే పరిమితమైంది. పీపుల్స్ పల్స్‌ సర్వేలో కూడా ఆర్జేడీ కూటమికి తిరుగులేని ఆధిక్యం లభించింది.

మహాఘట్‌ బంధన్‌ వంద నుంచి 115 సీట్లు సాధిస్తుందనే పీపుల్స్‌ పల్స్ అంచనా. ఎన్డీయే సీట్లు 90నుంచి 110 మధ్యే ఉంటాయంటోంది పీపుల్స్‌ పల్స్‌. సర్వేల్లో ఎంతోకొంత విశ్వసనీయత ఉండే టుడేస్‌ చాణక్య సర్వే.. ఎన్డీయేకి బీహార్‌లో దారుణ పరాభవం తప్పదంటోంది . టుడేస్‌ చాణక్య సర్వే ప్రకారం తేజస్వి నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌కి ఏకంగా 180 సీట్లు రాబోతున్నాయి. ఎన్డీఏ సీట్లు 55కే పరిమితం కాబోతున్నాయి. సీట్లు ఎన్ననే విషయం పక్కనపెడితే దాదాపుగా అన్ని సర్వేలు ఆర్జేడీ కూటమికే అధికారం దక్కబోతోందని చెప్పేశాయి.

మూడుపర్యాయాలు బీహార్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నితీష్‌కుమార్‌కి చివరి ఎన్నికల్లో చేదు అనుభవం తప్పేలాలేదు. వరసగా నాలుగోసారి సీఎం కావాలని తహతహలాడారు నితీష్‌. మిత్రపక్షం అయినంత మాత్రాన బీజేపీ నిర్ణయాలన్నింటినీ తాను ఆమోదించడం లేదని చెప్పేందుకు…అప్పుడప్పుడూ విమర్శలు గుప్పించినా ఫలితం లేకపోయింది. మరో వైపు యువనేతగా తేజస్వియాదవ్‌ ప్రచారంలో దూసుకుపోయారు. తండ్రి లాలూ ప్రచారం చేయకపోయినా ఆర్జేడీని మళ్లీ బలోపేతం చేయడంలో నూటికి నూరుమార్కులు కొట్టేశారు తేజస్వి యాదవ్‌. తన ప్రచారశైలితో తేజస్వియాదవ్‌ యువతరాన్ని ఆకర్షించారని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి.

Bihar Exit Polls 2020

ప్రజా సమస్యలపై నితీష్‌కుమార్‌ నిర్లక్ష్యం వహించారని, నిరుద్యోగసమస్యని తీర్చలేకపోయారని తేజస్వి పదునైన విమర్శలు చేశారు. ఆర్థిక అంశాలు, నిరుద్యోగాన్ని ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకోవడంలో తేజస్వి సఫలమయ్యాడని ఎగ్జిట్‌ పోల్స్‌ విశ్లేషించాయి. ఇక ఇటీవలే కన్నుమూసిన రాంవిలాస్‌ పాశ్వాన్‌ వారసుడు, ఎల్జేపీ నేత చిరాగ్‌పాశ్వాన్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బీహార్‌ ఎన్నికల్లో చిరాగ్‌ కి కేవలం 7శాతం మంది మాత్రమే మద్దతు ప్రకటించారు. ఎన్నికలకు ముందే బీజేపీకి దూరమైన చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జన్‌శక్తి పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఎన్డీయేకి తేజస్వి షాక్‌ ఇవ్వబోతున్నారని చిరాగ్‌ ముందే చెప్పేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ట్రెండ్‌చూస్తుంటే అదే జరగబోతోందని తేలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here