అసలే ఐపీఎస్ బ్యాక్ గ్రౌండ్. హోంశాఖ ఎక్స్పీరియన్స్. ఆవలించకుండానే అన్నీ లెక్కపెట్టగలిగేంత ఇంటలిజెన్స్. సోనియాని ఒప్పించారు. మోడీని మెప్పించారు. అందుకే ఇన్నేళ్లుగా గవర్నర్‌గా ఎటూ కదలకుండా సెటిలైపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్‌గా వచ్చిన వ్యక్తి రాష్ట్ర విభజన తర్వాత కూడా నాలుగేళ్లుగా రెండు రాష్ట్రాల గవర్నర్‌గా కొనసాగుతున్నారంటే ఎంత విషయం ఉందనుకోవాలి. ఆయన మీద కేంద్రపెద్దలకు ఎంత నమ్మకం ఉందనుకోవాలి. ఏ రకంగా చెప్పాలంటే చూసి రమ్మంటే కాల్చివచ్చే టైప్. లేడీ జర్నేలిస్ట్లని చెంపలు నిమిరేవాళ్లే తప్ప.. ఇప్పటికప్పుడు బీజేపీ నాయకత్వానికి ఇలాంటి జేమ్స్‌బాండ్ గవర్నర్ ఎక్కడదొరకాలి. అందుకే టీడీపీతో అంటకాగినప్పుడూ ఆయనే. ఆ పార్టీతో విడిపోయాక కూడా ఆయనే. గవర్నర్ నరసింహన్.
చంద్రబాబు పన్నెండు గంటల సూపర్‌డూపర్(తమ్ముళ్లంటున్నారు) ధర్మపోరాట దీక్ష తర్వాత ఉన్నట్లుండి ఏపీ రాజధాని అమరావతిలో వాలిపోయారు గవర్నర్ నరసింహన్. వైజాగ్‌నుంచి డైరెక్ట్‌గా హైదరాబాద్ వెళ్లాల్సిన ఆయన సడెన్‌గా రైలెక్కి విజయవాడ చేరుకుని ఏపీ సీఎంతో మీటింగేశారు. ఇంకేముందీ..బాబు దీక్షతో కేంద్రం షేకయిపోయిందనీ…అందుకే గవర్నర్‌ని రాయబారానికి పంపి కాళ్లబేరానికి దిగిందని తమ్ముళ్లంతా టముకేసుకున్నారు. కానీ ఆ మీటింగ్ మ్యాటర్వేరేనని ఇప్పుడు తెలిసొస్తోంది. బాబు దీక్షలో మోడీపై బాలకృష్ణ నోరుపారేసుకోవడం, తిరుపతి మీటింగ్‌తో పోరాటాన్ని ఉధృతంచేస్తామని టీడీపీ ప్రకటించటంతో అంతొద్దని చెప్పడానికే నరసింహన్ వెళ్లినట్లు కనిపిస్తోంది. దూకుడు తగ్గించాలని గవర్నర్ కోరారనీ…చంద్రబాబు ససేమిరా అన్నారనీ అనుకూలమీడియాలో కథనాలొచ్చాయి. అయితే కేంద్రంతో పెట్టుకుంటే మడతడిపోద్దని చెప్పడానికే గవర్నర్ వెళ్లుంటారనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన.
ఆ మీటింగ్‌లో నరసింహన్ ఏం చెప్పారో, బాబు ఏం బదులిచ్చారోగానీ ఇప్పుడేకంగా గవర్నర్ల వ్యవస్థే దండగంటున్నారు ఏపీ సీఎం. అధినేత ఆగ్రహించాక మంత్రులు ఊరుకుంటారా? అందరికీ ఇప్పుడు నరసింహనే టార్గెట్. కేంద్రం కుట్రలకు గవర్నర్ వారధిగా వ్యవహరిస్తున్నారని, అసలు పదేళ్లపాటు ఒకే గవర్నర్‌ని ఎలా కొనసాగిస్తారని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు గవర్నర్ మార్చాలని ఇంత గట్టిగా ఎందుకు గొంతెత్తలేదో?!
పవన్‌కళ్యాణ్ గవర్నర్‌ని కలవడం వెనుక కూడా ఇప్పుడు తమ్ముళ్లకు పెద్ద కుట్రే కనిపిస్తోంది. బీజేపీ-టీడీపీ సంబంధాలు బాగున్నప్పుడు గవర్నర్ వ్యవహారశైలిపై ఏపీ బీజేపీ కూడా అసంతృప్తి వ్యక్తంచేసింది. కానీ ఇప్పుడు చంద్రబాబుకి పక్కలోబల్లెంలాఆ ఆయనే ఉండాలనుకుంటోంది. జరుగుతున్నదంతా చూస్తుంటే మొన్నీమధ్య నరసింహన్ బుజ్జగించడానికి రాలేదన్నమాట. ఓవర్చేస్తే బుక్కైపోతారని కేంద్రం మాటగా చెప్పుండాలి.