Home News Politics

సీమ టీడీపీలో సీట్ల సిగపట్లు…!

పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు.. ప్రత్యర్థి పార్టీని ఖాళీ చేయాలనే ఆలోచన కావచ్చు.. విభజన చట్టంలో చెప్పినట్లు సీట్లు పెరుగుతాయనే ముందస్తు అంచనాలు కావచ్చు.. అప్పట్లో జోరుగా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌.. ఇప్పుడు అధికార టీడీపీలో ప్రతాపం చూపుతోంది. సీట్ల కోసం ఉండే సహజమైన పోటీతో పాటు.. కొత్తగా వచ్చిన నాయకుల నుంచి వస్తున్న డిమాండ్లతో అధినేత తల పట్టుకుంటున్నారు. పరిపాలన కంటే పార్టీలో పంచాయితీలు సెటిల్ చేయడంలోనే చంద్రబాబుకి సమయం సరిపోతోంది.


టీడీపీ గత ఎన్నికల్లో కోస్తా జిల్లాల్లో సత్తా చాటినా.. రాయలసీమలో చతికిల పడింది. సీమ జిల్లాల్లో కర్నూలు, కడప జిల్లాల్లో వైసీపీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. ఈ రెండు జిల్లాల్లోనూ పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఆయనకిప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి. కర్నూలు, కడప నేతల మధ్య పంచాయితీల పరిష్కారం చంద్రబాబుకి సవాల్‌గా మారింది. ఎవరినీ వదులుకోలేక, ఎవరికీ సర్ది చెప్పలేక.. అధినేత అష్టకష్టాలు పడుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ మీద పట్టు కోసం.. తమకు అసెంబ్లీ సీటు కోసం పార్టీలో నేతలు పదే పదే రోడ్డెక్కుతున్నారు. ఈ పోరాటాలు అటు ఇటు తిరిగి.. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుతున్నాయి. ఇన్నాళ్లూ.. సైలంట్‌గా సాగుతున్న వార్… ఎన్నికలు దగ్గరకు రావడంతో ఇప్పుడు వయోలెంట్‌గా మారింది.


కడప జిల్లాలో జమ్మల మడుగు సీటు పంచాయితీ టీడీపీలో కాక రేపుతోంది. ఈ సీటు కోసం మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి పోటీ పడుతున్నారు. ఆది నారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోచేరి మంత్రయ్యారు. సీటు కోసం ఇద్దరూ పోటీ పడటంతో.. చంద్రబాబు ఒక పరిష్కారాన్ని చూపించారు. వీరిలో ఒకరు కడప ఎంపీగా పోటీ చేస్తారు. ఎంపీగా పోటి చేసే నేతకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తారు. ఎంపీగా ఓడిపోయినా.. ఎమ్మెల్సీ స్థానం ఉంటుంది కాబట్టి. ఎంపీగా ఎవరు పోటీ చేస్తారో తెల్చుకోవాలని చంద్రబాబు నేతలిద్దరికీ చెప్పడంతో.. వారిద్దరూ నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలేశారు. దీనిపై చంద్రబాబు ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలకు గడువు దగ్గర పడుతూ ఉండటంతో.. పార్టీ కార్యకర్తల్లో తమ నాయకుడు ఎవరవనేది ఇంకా క్లారిటీ రాలేదు.

కడపలో జమ్మలముడుగు మాదిరే.. కర్నూలులోనూ సీట్ల పంచాయితీలు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అధినేతను కలిశాక.. కేఈ కృష్ణమూర్తి కుటుంబం సీట్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని అధినేతను కలిసింది. తాను టీడీపీలో చేరితే.. కర్నూల్ ఎంపీ సీటుతో పాటు డోన్, కోడుమూరు అసెంబ్లీ స్థానాల్లో తాము సూచించిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలనే కండీషన్ పెట్టినట్లు సమాచారం. కోట్ల రాకపై అభ్యంతరం లేకున్నా.. డోన్, పత్తి కొండ సీటు తమకే ఇవ్వాలని కేఈ గట్టిగా పట్టుబడుతున్నారు. డోన్ లో కేఈ సోదరుడు ప్రతాప్, పత్తికొండలో కేఈ కుమారుడు శ్యాంబాబుకు అవకాశం ఇవ్వాలని కృష్ణమూర్తి అధినేత వద్ద డిమాండ్ పెట్టారు.

మరోవైపు కర్నూలు అసెంబ్లీ సీటు కోసం టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్- సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కర్నూల్ పర్యటనకు వెళ్లిన లోకేష్.. కర్నూల్ ఎమ్మెల్యే సీటు ఎస్వీ మోహన్ రెడ్డికే అని ప్రకటించడంతో.. టీజీ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు వర్గాల నేతలు.. అధినేత వద్దకు చేరారు. ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు కర్నూల్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. కర్నూల్ సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. కర్నూల్ ఎంపీ సీటు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇస్తే… ఆమె ఆయనకు సహకరిస్తారా అనేది మరో ప్రశ్న.

అనంతపురం జిల్లా కదిరిలో వైసీపీ నుంచి గెలిచి టిడిపిలోకి వచ్చిన చాంద్ బాషా , మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ల మధ్య వర్గపోరు నడుస్తోంది. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తున్నా… వీరి వైఖరిలో మార్పు రాలేదు. నియోజక వర్గంలో రెండు గ్రూపులు గా విడిపోయాయి పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి సీటు వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చినా… పార్టీలో అయోమయం రాజ్యమేలుతోంది. నగరి సీటు కోసం గాలి ముద్దు కృష్ణమనాయుడి కుమారులిద్దరూ పోటీ పడటంతో… చంద్రబాబుకి తలనొప్పి మొదలైంది. దీంతో ఇద్దరిలో ఒకరికే టికెట్ ఇస్తామని.. అది ఎవరికో తెల్చుకోవాలని గాలి కుటుంబానికే వదిలేశారు. ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం రాకపోవడంతో.. ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది టీడీపీ నాయకత్వం. నగరి అభ్యర్థి ఎవరనే దాని కంటే.. ఎవరికిచ్చినా ఇద్దరూ కలిసి పని చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి ఆసక్తికరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here