కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీకి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఇప్పటికే పోలింగ్ జరగాల్సి ఉండా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో చనిపోయారు. దాంతో బద్వేలు ఉపఎన్నిక జరగనుంది. ఈ సమయంలో నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉండాల్సిన టీడీపీ శ్రేణులు డల్‌గా ఉండటం చర్చగా మారుతోంది. బద్వేలులో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కనుసన్నల్లోనే టీడీపీ వ్యవహారాలు నడుస్తాయి. రెండేళ్లుగా ఆమె మౌనంగా ఉంటున్నారు. ఆ ఎఫెక్ట్ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లోనూ కనిపిస్తోందట. కేడర్ సైతం పక్క చూపులు చేసే పరిస్థితి ఉండటంతో టీడీపీలో టెన్షన్ మొదలైంది.

గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన బిజివేముల వీరారెడ్డి..టీడీపీ ఆవిర్భావం తర్వాత బద్వేలులో ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ వచ్చారు. వీరారెడ్డి మరణం తర్వాత ఆయన కుమార్తె విజయమ్మ లీడ్ రోల్ తీసుకున్నారు. నాటి ఉపఎన్నికలో విజయమ్మ ఎమ్మెల్యేగా గెలిచారు. జనరల్ కేటగిరిలో ఉన్న బద్వేలు 2009లో ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో తెరవెనక రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఆమె చెప్పిన వారే టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆమె చెప్పినట్టే జరుగుతాయి. 2014లో టీడీపీ అభ్యర్థి ఓడినా.. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటంతో విజయమ్మ హవా సాగింది.
2019 ఎన్నికల్లోనూ విజయమ్మ చక్రం తిప్పాలని చూశారు కానీ.. నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు బద్వేలులో టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతూ వచ్చిన విజయమ్మ ఒక్కసారిగా కామైపోయారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదట. ఒకానొక సమయంలో పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగినా.. దాన్ని కొట్టి పారేశారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు టీడీపీ అధికారంలో లేకపోయినా పార్టీ కేడర్ చెదిరిపోకుండా కాపాడుకుంటూ వచ్చారు విజయమ్మ. 2014లో వైసీపీ నుంచి గెలిచిన జయరాములు నాటి ఆపరేషన్ ఆకర్ష్‌కు చిక్కి టీడీపీ కండువా కప్పేసుకున్నారు. ఆ స్థాయిలో చక్రం తిప్పిన విజయమ్మ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేశారు.
ఉప ఎన్నికవేళ విజయమ్మ సైలెంట్ అవ్వడంతో టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైంది. సీఎంజగన్ సొంతజిల్లా కావడం అసలే పార్టీ పరిస్థితి జిల్లాలో అంతంత మాత్రంగా ఉండటంతో అభ్యర్ది పై టీడీపీ డిఫెన్సులో పడింది. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్యని సీఎం జగన్ వైసీపీ అభ్యర్దిగా ప్రకటించడంతో రాజశేఖర్ నే బరిలో దించాలా అని లెక్కలేస్తుంది. బిజివేముల కుటుంబం అండలేకపోతే అక్కడ పోటి చేసిన పెద్ద ఉపయోగం ఉండదు. దీంతో విజయమ్మని చంద్రబాబువద్దకు తీసుకొచ్చేపనిలో పడ్డారు కడపజిల్లా టీడీపీ నేతలు.