Home News Stories

టీడీపీని లేపేందుకు జంబోకమిటీ! లేస్తుందా?

ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నీరసపడకుండా ఏదో ఒక యాక్టివిటీ ఉండేలా చూసుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. కరోనా సమయంలోనూ ఆన్‌లైన్‌ మీటింగ్‌లతో లీడర్లలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఏపీకి టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు చంద్రబాబు. ఏకంగా 219 మందికి ఈ జంబో కమిటీలో చోటుకల్పించారు.
18 మంది ఉపాధ్యక్షులు ,16 మంది ప్రధాన కార్యదర్శులు
,
18 మంది అధికార ప్రతినిధులు ,58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులతో కమిటీ ప్రకటించారు. ఇక టీడీపీ కమిటీలో రాష్ట్ర కార్యదర్శుల సంఖ్య సెంచరీ కొట్టింది. ఏకంగా 108 మందికి రాష్ట్ర కార్యదర్శుల హోదా దక్కింది.

TDP Chief Chandrababu Naidu

మహిళలకు, 50 ఉపకులాలకు రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రకటించారు.
బీసీలకు 41శాతం, ఎస్సీలకు 11శాతం, ఎస్టీలకు 3శాతం, మైనార్టీలకు 6శాతం మందికి టీడీపీ రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్‌కు కీలక పదవి అప్పగించారు చంద్రబాబు. నల్లారి కిషోర్‌కుమార్‌ని పార్టీ సెంట్రల్ కమిటీకి జనరల్ సెక్రటరీగా నియమించారు.
వారసత్వం కంటే పనితీరుకే ప్రాధాన్యమిచ్చామంటున్నారు టీడీపీ అధినేత. ప్రతిపక్షంలో ఉన్నా యాక్టివ్‌గా పనిచేస్తూ గట్టిగా గళం వినిపిస్తున్న వారికి పదవులు కట్టబెట్టామని చెబుతున్నారు. ఇప్పటి వరకూ పార్టీలో ఎటువంటి పదవులు లేని ఎంతోమంది కొత్తవారికి రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించి.. టీడీపీ జోష్‌ తగ్గకుండా జాగ్రత్తపడాలనుకుంటున్నారు. అన్ని ప్రాంతాలు,అన్ని కులాల సమతుల్యత ఉండేలా ఈసారి టీడీపీ అధినేత జాగ్రత్తపడ్డట్లు కనిపిస్తోంది. పార్లమెంట్ పార్టీ ప్రాతిపదికగా కమిటీ ఏర్పాటు చెయ్యడంతో పదవులు కూడా పెరిగాయి.. మళ్లీ అధికారంలోకి రావడానికి కొత్త కమిటీ ఎంతో ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఉన్నారు టీడీపీ అధినేత. మరి చంద్రబాబు నమ్మకాన్ని నాయకులు నిలబెడతారో, మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనన్నట్టు వర్గపోరుతో పార్టీని రచ్చకీడుస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here