Home News

పార్టీ మార్పు పై ఆ సీనియర్ నేత స్కెచ్ ఏంటీ…?

ఆయనో సీనియర్ నేత … 5 ఏళ్లు మంత్రిగా పని చేశారు… పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ విపరీతమైన ప్రయార్టీ పొందారు.. ఎన్నిక ఎన్నికకు నియోజకవర్గం మార్చే ఆ నేత ఈజీగానే గెలిచారు… గెలిచీ గెలవగానే పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. మరి ఆ ఎఫెక్టో… ఇంకేంటో కానీ ఆయన మౌనం దాల్చారు… అసెంబ్లీలో ఎంత సీరియస్ డిస్కషన్ జరిగినా నోరు మెదపడం లేదు … ఎందుకలా? ఆ మౌనానికి అర్ధమేంటి? ఆయన ఎందుకు సౌండ్ చెయ్యడం లేదు?

గంటా శ్రీనివాసరావు… టీడీపీ సీనియర్ నేత. .. టీడీపీలో పుట్టి ప్రజారాజ్యంలో చేరి.. కాంగ్రెస్ లోకి వెళ్లి తిరిగి పుట్టింటికి వచ్చిన గంటాకు ఉన్నంత లక్కు రాజకీయాల్లో మరే నేతకు ఉండదేమో… ఏ పార్టీలో చేరితే ఆ పార్టీలో గెలిచే గంటా… మంత్రిగా కూడా పనిచేశారు .. అలాంటి గంటా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ సునామీని తట్టుకుని సైతం గెలిచారు. గెలిచీ గెలవగానే ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ నుంచి 10-12 మంది ఎమ్మెల్యేలతో గంటా బిజేపీలోకి జంప్ అవుతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. దీన్ని పెద్దగా ఖండించనైనా ఖండించలేదు గంటా…

ఇప్పుడు గంటా ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే…. ఏపీ అసెంబ్లీలో రోజూ ఏదో ఒక అంశంపై అధికార వైసీపీ, టీడీపీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో చంద్రబాబే స్వయంగా అధికారపక్షాన్ని ఎదుర్కొడానికి రంగంలోకి దిగుతున్నారు. ఆయనకు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడు వంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తోడుగా ఉంటున్నారు… అయితే గంటా మాత్రం నోరు మెదపడం లేదు. అదే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీపైనా… టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా వైసీపీ దుమ్మెత్తిపోస్తోంది. సీఎం వైఎస్‌ జగన్ అయితే.. టీడీపీని ఆకు లెక్క తీసిపారేస్తున్నారు.

ఇలాంటి సమయంలో సభలో ఉన్న సీనియర్ల జోక్యం, అండ పార్టీకి అవసరం… కానీ గంటా మాత్రం ఇవేమీ తనకు పట్టనట్టు… తనకు సంబంధంలేనివన్నట్టు వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు మొదలై ఏడు రోజులు అవుతుంటే గంటా ఒక్క పూటే అసెంబ్లీకి మొహం చూపించారు. అంతా కలసి కట్టుగా ఉండాల్సిన సమయంలో గంటా అసెంబ్లీని లైట్ తీసుకుంటున్నారు. ఇది చూసిన వాళ్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది. గంటా మౌనం వెనుక అర్ధం ఏంటీ? ఆయన ఎందుకలా? ఉంటున్నారనే సందేహాలు కలుగుతున్నాయి. ఉందే 23 మంది ఎమ్మెల్యేలు. అటుపక్క 150 ఎమ్మెల్యేలు. వారిని ఎదుర్కొవాలంటే… అంతా కలసికట్టుగా పోరాడాల్సి ఉంటుంది. కానీ గంటా మాత్రం సౌండ్ చేయ్యడం లేదు.

పాపం 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబే చిన్న దానికీ పెద్ద దానికీ లేచి నిలబడి మాట్లాడాల్సి వస్తోంది. వైసీపీ వైపు నుంచి చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదంతా చిరు నవ్వుతో చూస్తూ ఉన్నారు కానీ…. గంటా నోరు విప్పడం లేదు. పార్టీలు మారే గంటా మనసులో మళ్లీ ఏదైనా స్కీమ్ ఉందా? లేక మనకెందుకొచ్చిన గొడవ.. సైలెంట్ గా ఉండే పోలా అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here