Home News Politics

టీడీపీలో ఎన్నికల సందడి.. వైసీపీ, జనసేన ష్…గప్ చుప్…!

గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పట్టభద్రుల ఓటర్లను చేర్పిస్తూ అధికార టీడీపీ దూకుడు ప్రదర్శిస్తుండగా ఈ ఎన్నికలకు తమకు సంభందం లేదన్నట్లు గమ్మునున్నాయి వైసీపీ,జనసేన. సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న ఎన్నికలు కావడం, అందున రాజధాని ప్రాంతం కావడంతో తో ఎక్కడ చాన్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతుంది సైకిల్ పార్టీ.

చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న చందంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావించడంతో తెలుగు తమ్ముళ్లు ఓటర్ల చేర్చే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. టికెట్లు అశిస్తున్న పార్టీ నేతలు అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా చేరాలంటూ ప్రధాన కూడల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఒక్క గుంటూరు జిల్లాకు సంబంధించి లక్ష మంది పట్టభద్రుల ఓటర్లను చేర్చడమే లక్ష్యంగా పెట్టుకుని టీడీపీ ముందుకు సాగుతుంది. దానికి తగ్గట్టుగానే టీడీపీలోని ఆశావహులు, పార్టీ శ్రేణులు, అనుబంద సంఘాలు చురుకుగా వ్యవహరిస్తున్నాయి.

పీడీఎఫ్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు తిరిగి ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా వామ పక్ష కార్యకర్తలు, యూటీఎఫ్‌కు చెందిన ఉపాధ్యాయులు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిపక్ష పార్టీలు అయిన వైసీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌లు పట్టభద్రుల ఓటర్ల చేర్పుల్లో ఇంతవరకు కార్యా చరణకు దిగలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పట్టభ ద్రుల ఓటర్ల చేర్చే విషయంలో కాంగ్రెస్‌ మౌనపాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

కోస్తాలో మూడు ఎమ్మెల్సీ పదవులకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీలు వచ్చే మార్చి నెలలో రిటైరవుతున్నారు. వీరి పదవీ విరమణ లోపే కొత్త వారి ఎన్నిక జరుగుతుంది. ఇందులో రెండు పట్టభద్ర నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థిత్వానికి గట్టి పోటీ నెలకొంది. వీరిలో గుంటూరు జడ్పీ మాజీ ఛైర్మన్‌ రాయపాటి శ్రీనివాస్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ ప్రముఖంగా ఉన్నారు.

గతంలో ఎమ్మెల్సీగా చేసిన విద్యా సంస్థల అధినేత చిగురుపాటి వరప్రసాద్‌ కూడా తాజాగా పెద్ద ప్రచారంతో రంగంలోకి దిగారు. వీరు కాక గుంటూరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, పార్టీ డాక్టర్స్‌ సెల్‌ నేత దోనేపూడి పవన్‌ కూడా ఆసక్తి వ్యక్తం చేస్తూ పార్టీ అధినేతను కలిసారు. ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న రవి కిరణ్‌ వర్మ పోయిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో గెలిచారు. ఈసారి అదే జిల్లాలోని మరో ప్రముఖ విద్యా సంస్థ యాజమాన్య కుటుంబం నుంచి ఆయనకు పోటీ ఎదురవుతోంది.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో పోటీ చేయాలా వద్దా అన్నదానిపై టీడీపీ ఇంకా నిర్ణయానికి రాలేదు. సాధారణంగా ఉపాధ్యాయ సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతుంటాయి. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తమకు మద్దతివ్వాలని టీడీపీ నాయకత్వాన్ని సంప్రదిస్తున్నాయి. అక్కడ రిటైరవుతున్న గాదె శ్రీనివాసులనాయుడు గతంలో ఒక ఉపాధ్యాయ సంఘం తరపున గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. ఆయన ఇప్పటివరకూ రెండు సార్లు ఎమ్మెల్సీగా చేశారు. ఈసారి పోటీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here