టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడంతో పాతకాపులు భగ్గుమంటున్నారు. పార్టీని నమ్ముకుని ఎవరి మీద పోరాడామో వారినే ఆహ్వానించడంతో కాంగ్రెస్ నుంచి వలసలు టీడీపీలో చిచ్చు రేపుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత,మాజీ మంత్రి కొండ్రు మురళి రేపు టీడీపీ తీర్దం పుచ్చుకోనున్నారు. ఇంతవరకు ఓకే కాని నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి మాత్రం కొండ్రు మురళి పార్టీలోకి రావడం పై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఏపీ అద్యక్షుడు మంత్రి కళావెంకటరావు గ్రూప్ రాజకీయాలతో ఇబ్బంది పడుతున్న ప్రతిభా భారతికి మురళి చేరిక మరింత చిరాకుగా మారింది. రాజాం టీడీపీ టిక్కెట్ కొండ్రు మురళి కి అన్న ప్రచారంతో ఆగ్రహంతో ఉన్న ప్రతిభా భారతి నేడు పార్టీ అధినేత సీఎం చంద్రబాబును కలవనున్నారు. తనకు టిక్కెట్ దక్కకున్న తన కూతూర్ని వచ్చే ఎన్నికల్లో బరిలో దించాలనుకున్న ప్రతిభా భారతి మురళి చేరిక పై ఎలా స్పందిస్తారో అన్న ఉత్కంఠ ఉంది.
మరో వైపు ప్రకాశం జిల్లాలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి కూడా సైకిలెక్కే ప్రయత్నాల్లో ఉండటంతో అక్కడ కూడా పాత కాపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సన్నిహితుడు కదిరి బాబురావు ఈ చేరికల పై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో టీడీపీ అధినాయకత్వం స్థానిక నేతలను బుజ్జగించే పనిలో బిజీగా ఉంది.