Home News Stories

టీడీపీకి హ్యాండిచ్చిన సునీల్.. ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం..!

కోనసీమ రాజకీయాల్లో త్రిముఖపోరు నెలకొన్న దృష్ట్యా చెప్పుకోదగ్గ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీలలో టికెట్ల కోసం ప్రయత్నించి టికెట్‌ హామీ దక్కని బ్యాచ్‌లో కొందరు జనసేనలో చేరిపోయారు. సరికొత్త రాజకీయం అంటూ చెబుతున్న.. ఆ పార్టీలో చేరేవారంతా గతంలో వైసీపీ, టీడీపీల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఈ కోవలో ముత్తా గోపాలకృష్ణ, శశిధర్‌, పితాని బాలకృష్ణ, కందుల దుర్గేష్‌ తదితరులున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానానికి టీడీపీ టిక్కెట్టు ఆశించి పార్టీలో చేరడానికి నిన్నమొన్నటి వరకు ఉత్సాహం చూపిన వైసీపీ మాజీ నేత చలమలశెట్టి సునీల్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరుసగా రెండు దఫాలు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలసి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. టీడీపీలో చేరడంలేదని, జనసేనలో చేరిక ఖాయమన్న సంకేతాలు ఇచ్చారు.

సునీల్‌ టీడీపీలో చేరకపోతే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి రాజప్ప పేరు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సునీల్‌ పార్టీలో చేరితే కాకినాడ పార్లమెంటు టిక్కెట్టు ఇద్దామని చూసిన టీడీపీ.. ఇప్పుడు రాజప్పను బరిలోకి దింపాలని యోచిస్తోంది. డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా జిల్లాలో పార్టీ కేడర్‌ని కలుపుకునిపోవడంలో చంద్రబాబు మన్ననలు పొందారు. రాజప్ప అయితే కాకినాడ పార్లమెంటు స్థానాన్ని గెలుపొందడం సునాయాసం అవుతున్నది పార్టీ అధిష్ఠానం యోచనగా కనిపిస్తోంది. స్థానికేతరుడైన రాజప్ప పెద్దాపురం అసెంబ్లీ నుంచి 2014లో పోటీచేసి హోంమంత్రి అయ్యారు.

ఈ సారి పెద్దాపురం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన స్థానికులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండు వస్తోంది. రాజప్ప కూడా దీనిని సమర్థిస్తున్నారు. ’నేను ఎంపీగా వెళ్తే… పార్టీ మారకుండా ముందు నుంచీ నమ్మకంగా ఉన్నవారికే టిక్కెట్టు ఇప్పిస్తాను’ అని ఇప్పటికే రాజప్ప కొందరికి భరోసా కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓటమిపాలైన సునీల్‌ ఈ దఫా కాకినాడ పార్లమెంటు నుంచి జనసేన టిక్కెట్టుపై పోటీచేస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇదే జరిగితే సునీల్‌కి ధీటైన అభ్యర్థిగా రాజప్ప అన్నివిధాలా సమర్థుడన్న ప్రచారం ఉంది.

2014 ఎన్నికల ముందుతో పోలిస్తే రాజప్ప అన్ని విధాలుగా బలపడ్డారు. సునీల్‌ జనసేన అభ్యర్థి అయితే.. వైసీపీ కొత్తవారిని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పటికిప్పుడు సునీల్‌, రాజప్పలకు ధీటైన అభ్యర్థిని వెతకడం వైసీపీకి బాగా కష్టమైన విషయమని రాజకీయ విశ్లేషకుల అంచనా. పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలుపొందినా రాజప్పకి కాకినాడ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పెద్దాపురం ఏరియా మిల్లర్లతో సత్సంబంధాలు బలంగా ఉన్నాయి. ఇవన్నీ పార్లమెంటు ఎన్నికలలో రాజప్పకు కలసి వచ్చే అంశాలేనని భావిస్తున్నారు.


సునీల్‌ జనసేనలో చేరికపై కొంత సందిగ్దత నెలకొంది. తనకు కాకినాడ పార్లమెంటు టిక్కెట్టుతోపాటు.. తన బంధువు ఒకరికి జగ్గంపేట జనసేన టిక్కెట్టు ఇవ్వాలని సునీల్‌ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. సునీల్‌ షరతుపై జనసేన నుంచి ఏ విధమైన హామీ రాకపోవడంతో చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు చెప్తున్నారు. పవన్‌ జిల్లా పర్యటన సందర్భంగా సునీల్‌ పార్టీలో చేరతారని జనసేన నేతలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here