Home News Stories

కోస్తా టీడీపీలో సీట్ల సిగపట్లు…!

అధికార పార్టీలో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండటం సహజమే అయినా.. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత.. అసంతృప్త నేతల్ని దారికి తెచ్చుకుని .. ప్రచారంలో అందర్నీ కలుపుకుపోవడం ఇప్పటి వరకూ చూస్తున్న రాజకీయం. అయితే ఏపీలో ఈసారి పరిస్థితులు వేరేగా ఉన్నాయి. రాష్ట్రంలో టీడీపీ కాకుండా మరో ఐదు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. పార్టీలో అంతర్గత పోరుతో టిక్కెట్ల ఎంపికే టీడీపీకి పెద్ద టాస్క్ గా మారింది….


సీమ జిల్లాలతో పాటు కోస్తాలోనూ టీడీపీకి ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడలో దేవినేని అవినాష్ టీడీపీ యువతకు అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. రాధాకృష్ణ టీడీపీలో చేరితే.. దశాబ్ధాల పాటు వైరం ఉన్న ఈ రెండు కుటుంబాలు ఒకే పార్టీలోకి వస్తే.. ఇద్దరి అనుచరులు కలిసి పని చేస్తారా అన్నది ఇక్కడ సమస్యగా మారింది.

టీడీపీలో లేటెస్ట్ పంచాయితీ చీరాల వ్యవహారం. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత టీడీపీలో చేరారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పోతుల సునీత.. ఆమంచి రాకను వ్యతిరేకించారు. ఇద్దరికీ సర్థి చెప్పిన చంద్రబాబు.. ఆమంచికి పచ్చ జండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమంచిని చీరాల టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టాలని భావించిన చంద్రబాబు.. పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, తెలుగు మహిళావిభాగానికి అధ్యక్షురాలిని చేశారు. ఇద్దరూ కలిసి పని చేసి పార్టీని బలోపేతం చేస్తారని భావిస్తే.. ఎవరికి వారే చీరాల సెగ్మెంట్ మీద పట్టు కోసం వర్గాల్ని ప్రోత్సహించడం చంద్రబాబుకి తలనొప్పిగా మారింది..

ప్రకాశం జిల్లాలోనే అద్దంకి నియోజకవర్గం పంచాయితీ అధినేతకు తలకు మించిన భారంగా మారింది. ఇక్కడ గొట్టిపాటి రవికుమార్- కరణం బలరాం వర్గాల మధ్య గొడవలతో పార్టీ కార్యకర్తలు ఇబ్పంది పడుతున్నారు. గొట్టిపాటి వైసీపీలో గెలిచి.. టీడీపీలో చేరడంతో అద్దంకి నుంచి పార్టీ తరపున ఆయనకే టికెట్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో వివాదం కొలిక్కి వస్తుందని భావించినా.. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలో రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. రెండు వర్గాల కార్యకర్తల్లో ఐక్యత లేకపోవడంతో .. ప్రత్యర్థి పార్టీలో జోష్ నింపుతోంది. నేతల మధ్య వివాదాల్ని పరిష్కరించాలని.. చంద్రబాబు జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌కి చెప్పినా… ఆయన ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సీటు వ్యవహారంలో ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ సీటు కోసం తాతా మనవళ్లు.. నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. తాత ఎమ్మెల్యే కాగా.. మనవడు ఓ బ్యాంక్‌కి ఛైర్మన్. ఇద్దరిలో ఏ ఒక్కరికి సీటిచ్చినా.. మరొకరు పార్టీని వదిలేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సీటు కోసం ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, టీడీపీ పాత నేత పర్వత రాజబాబు వర్గీయుల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఈ ఇద్దరి మధ్యలోకి వరుపుల సుబ్బారావు మనవడు వరుపుల రాజా రావడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

విజయనగరం జిల్లాలో పార్టీ ఏ నియోజకవర్గంలోనూ నేతల మధ్య సయోధ్య కనిపించడం లేదు. గజపతినగరం సీటు కోసం వర్గపోరు నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కేఏ నాయుడు- పార్టీ సీనియర్ నేత కరణం శివరామకృష్ణ .. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. చీపురుపల్లిలో మాజీ మంత్రి మృణాళిని- కె. త్రిమూర్తి రాజు వర్గాలుగా నడుస్తోంది అధికార పార్టీ వ్యవహారం. సాలూరులో మూడు గ్రూపులు నడుస్తున్నాయి. బొబ్బిలిలో మంత్రి సుజయకృష్ణ రంగారావు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీ నాయుడు ఒకే సీటు కోసం పోటీ పడుతున్నారు. ఎస్ కోట సీటు కోసం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి పోటీగా మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజకీయం నడుపుతున్నారు. పార్వతీపురంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది.

శ్రీకాకుళం జిల్లా టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ రెండు వర్గాలకు జిల్లా మంత్రులిద్దరూ నాయకత్వం వహిస్తున్నారు. తమ వర్గీయులకే సీట్లు దక్కేలా పావులు కదుపుతున్నారు. జిల్లాలోని పాలకొండ , రాజాం, పాతపట్నం , ఎచ్చెర్ల సీట్ల కోసం రెండు వర్గాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్ టీడీపీలో చేరిన తర్వాత రాజాంలో రాజకీయం వేడెక్కింది. ఇక్కడ సీటు కోసం మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, కొండ్రు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కొండ్రు పార్టీలో చేరాక ఆయనే నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు. పాతపట్నంలో శత్రుచర్ల- కలమట వర్గాల మధ్య విబేధాలు పీక్ లెవల్లో నడుస్తున్నాయి. మాజీ మంత్రి శత్రుచర్ల ఏ గ్రూపుతోనూ సంబంధం లేకుండా సొంతగ్రూపును నడుపుకుంటున్నారు. కలమట రాకను మొదట్నుంచి పాతపట్నం తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో పార్టీ బలంగా ఉన్నా.. నేతల మధ్య ఐక్యత లేకపోవడం ఇబ్బందికలిగించే అంశం.

టీడీపీలో సీటు రాదని భావిస్తున్న వాళ్లు, అసంతృప్తితో ఉన్న నేతలకు వైసీపీ, జనసేన నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. అధికార పార్టీలో ఉన్న నేతలకు సహజంగా అంతో ఇంతో బలం ఉంటుంది. టీడీపీలో సీటు దక్కని నేతలు ఇతర పార్టీల్లో చేరితే.. ఆ మేరకు తెలుగుదేశం ఓటు బ్యాంక్‌ కు గండి పడినట్లే. ఇలాంటి పరిస్థితుల మధ్య అభ్యర్థుల ఎంపిక చంద్రబాబు చాణక్యానికి కఠిన పరీక్షగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here