Home News

థర్డ్ ఫ్రంట్ చర్చలు..చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..!

దేశంలో ప్రధాని మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి, కాంగ్రెస్ లేకుండా అంటూ రకరాకల చర్చలు నడుస్తున్నాయి. కారణం ఏదైనా మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం జరుగుతుంది. 2019 ఎన్నికల ముందు మోడీకి వ్యతిరేకంగా టీడీపీ చీఫ్‌ పెద్ద ఉద్యమమే చేశారు. దేశవ్యాప్తంగా నేతల కూడగట్టారు. మోడీ ఓడితేనే దేశం బతుకుతుంది అని గళం ఎత్తారు. ఇతర ప్రాంతీయ పార్టీలను కలిపి మీటింగ్‌లు పెట్టారు. దీనిలో భాగంగా కాంగ్రెస్‌తోను జత కట్టారు చంద్రబాబు.ఎన్నికల్లో ఓటమితో ఆ తర్వాత సైలెంట్ అయ్యారు చంద్రబాబు. మళ్లీ దేశంలో కొత్త ఫ్రంట్ పై చర్చలు మొదలయ్యాయి. ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు ఫ్రంట్ పై అడుగులు వేస్తున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతుంది.

2019 ఎన్నికల తరువాత అంతా తారుమారైంది. ప్రధానిగా మోడీ మరింత బలమైన నేతగా ఆవిర్భవించారు. దీంతో జాతీయ రాజకీయలపై సైలెంట్‌ అయింది టీడీపీ. ఇప్పుడు బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో కొత్త రాజకీయ సమీకరణలు మొదలయ్యాయి. 2019లో పెద్దఎత్తున బీజేపీ వ్యతిరేక పోరాటం చేసిన చంద్రబాబు.. ఆ చర్చల్లోకి వెళ్లడానికే ఇష్టపడటం లేదు. 2019 ఎన్నికల తరువాత మోడీకి దగ్గరగా ఉండేందుకు టీడీపీ చీఫ్‌ ప్రయత్నించారు. ఈ విషయంలో బీజేపీ నేతల నుంచి విమర్శలు వచ్చినా.. పెద్దగా లెక్క పెట్టలేదు. రాష్ట్రంలో అధికారంలేని సమయంలో ఇటు సీఎం జగన్‌తో పోరాడుతూ.. అటు ప్రధానితోనూ వైరం మంచిది కాదని భావిస్తూ వచ్చారు. దేశంలో మోడీ వ్యతిరేకంగా కొందరు జట్టు కడుతున్నా.. చంద్రబాబు మాత్రం అటుగా చూసేందుకు కూడా సిద్ధంగా లేరు.

2019 ఎన్నికల తరవాత చంద్రబాబు కేంద్రంపట్ల అనుసరించిన వైఖరి వల్ల ఇతర జాతీయ నేతల్లో పలుచన అయ్యారని టాక్‌. తరుచూ ఆలోచనలు మార్చుకునే చంద్రబాబుతో కష్టమని ఇతర ప్రాంతీయ పార్టీ నేతలు కూడా నిర్ణయానికి వచ్చేశారట. అందుకే దేశంలో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు పేరు ఎక్కడా వినిపించడం లేదని కొందరి వాదన. టీడీపీ చీఫ్ కూడా ఏ ఫ్రంట్ చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా లేరట. రాష్ట్రంలోని వ్యవహారాలతోనే ఆయన తీవ్రంగా సతమతం అవుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీకి పార్లమెంట్‌లోనూ పెద్దగా బలం లేదు. ముగ్గురు లోక్‌సభ సభ్యులు, ఒకే ఒక రాజ్యసభ స్థానం ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులపట్ల పూర్తి అవగాహనతో ఉన్న చంద్రబాబు.. ఈ చర్చలకు దూరంగా ఉండడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here