Home News Politics

జాతీయ నేతల రాక టీడీపీకి అడ్వాంటేజా…!

జాతీయ నేతలు వరుస పెట్టి ఏపీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా ఉన్న ఇద్దరు జాతీయ నేతలు రాష్ట్రానికి రాగా.. ఇంకొందరు నేతలు రాబోతున్నారు. ఈ క్రమంలో వీరి ప్రభావం ఏమైనా ఏపీ రాజకీయాలపై ఉంటుందా ? వీరిని ఏపీకి రప్పించడం వల్ల టీడీపీ ఆశిస్తున్న ప్రయోజనమేమిటీ..?

జాతీయస్థాయిలో మోడీకి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ సహా వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలను జత కట్టే ప్రయత్నం చేశారు. సుమారు 18 పార్టీల వరకు మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టేందుకు అంగీకరించాయి.మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో భారీ ఎత్తున సభలు..ర్యాలీలు నిర్వహించాలని మోడీ వ్యతిరేక కూటమి అనుకున్నా.. దానికి అనుగుణంగా పరిస్థితులు కలిసి రాలేదు. పైగా ఎన్నికలు వచ్చేయడంతో అమరావతిలో నిర్వహిద్దామనుకున్న జాతీయ పార్టీల నేతల సమావేశం కూడా జరగలేదు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వివిధ పార్టీలకు చెందిన జాతీయ నేతలను రంగంలోకి దింపుతున్నారు చంద్రబాబు.

జాతీయ నేతల ప్రచారంతో ఇక్కడ ఏం ప్రయోజనం ఉంటుందని కొందరు నేతలు వాదిస్తున్నా..టీడీపీ అధిష్ఠానం ఆలోచన మాత్రం వేరే విధంగా ఉంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు. రాయలసీమ ప్రాంతంలో ఫరూక్ అబ్దుల్లా ప్రచారం చేస్తే.. రాజధాని ప్రాంతంలో కేజ్రీవాల్ ప్రచారం చేశారు. రాయలసీమలో అందులోనూ కర్నూలు, కడప జిల్లాలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. మరో వైపు జగనుకు అనుకూలంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారానికి వస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ముస్లిం మైనార్టీల ఓట్లను కాస్తైనా ఆకట్టుకోవాలంటే ఫరూక్ అబ్దుల్లాలాంటి జాతీయ నేతలైతేనే కరెక్టనే ఉద్దేశ్యంతో ఆ ప్రాంతంలో ప్రచారానికి తీసుకువచ్చినట్టు కన్పిస్తోంది. ఇదే సందర్భంలో ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనమే సృష్టించాయి.

ఇక అరవింద్ కేజ్రీవాల్ కూడా రాజధాని ప్రాంతంలో సెటిల్ అయిన ఉత్తరాది ఓటర్లతో భేటీ అయ్యారు. అలాగే అర్బన్ ఫ్లేవర్ ఉన్న విజయవాడలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇది కచ్చితంగా టీడీపీకి కాస్తో కూస్తో ఉపయోగపడే అంశమే అంటున్నారు టీడీపీ నేతలు. ఇక ఈనెల 31వ తేదీన విశాఖలో బెంగాల్ సీఎం మమత బెనర్జీతోపాటు..తిరిగి అరవింద్ కేజ్రీవాల్ కూడా రాబోతున్నారు. విశాఖలో ఒరిస్సా, పశ్చిమ బంగ్లాకు చెందిన ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటారు. అలాగే ఉత్తరాది నుంచి వచ్చి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారూ గెలుపొటములను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉంటారు. ఈ క్రమంలో వారిద్దరిని విశాఖలో ప్రచారానికి దింపనున్నట్టు సమాచారం. ఇక నెల్లూరు జిల్లాలో ప్రచారానికి అఖిలేష్ యాదవ్ రానున్నారు. ఈ జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. పైగా నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీదా మస్తాన్ రావు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత.నెల్లూరులో అఖిలేష్ ప్రచారం చేస్తే.. ఆ ప్రభావం కాస్తో కూస్తో ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ పైనా ఉంటుందనేది టీడీపీ అంచనా.

ఇదే తరహాలో దేవెగౌడ, స్టాలిన్‌వంటి నేతలను కూడా ప్రచారానికి రప్పిస్తున్నారు. వీరిని ఆ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ప్రచారం చేసే సూచనలు కన్పిస్తున్నాయి. దీంట్లో భాగంగా దేవెగౌడను అనంత జిల్లాలోనూ.. స్టాలిన్‌ను చిత్తూరువంటి జిల్లాలోనూ ప్రచారానికి రప్పించే సూచనలు కన్పిస్తున్నాయి. వీరే కాకుండా..శరద్ పవార్, శరద్ యాదవ్, తేజస్వీ యాదవ్ వంటి వారిని కూడా ఆయా ప్రాంతాల్లో ప్రచారానికి దింపే సూచనలు కన్పిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఏపీ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందనే విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ప్రస్తావనకూ వస్తూనే ఉంది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో టీడీపీకే ఇమేజ్ ఉందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నా..రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ స్థాయిలో పనులను చక్కబెట్టే సత్తా చంద్రబాబుకు ఉందనే విషయం ఏపీ ప్రజలకు మరింత క్లారిటీ రావాలన్నా జాతీయ నేతలను ఈ స్థాయిలో ప్రచారానికి తేవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here