Home News Politics

టీడీపీలో వరుస చేరికలకు యాక్షన్ ప్లాన్….!

త్వరలోనే టీడీపీలో వరుస చేరికల సందడి మొదలు కాబోతోందా..? ప్రస్తుతం టీడీపీ అధినాయకత్వం ఇదే అంశంపై ఫోకస్ పెట్టింది. టీడీపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు అటకెక్కడంతో చేరికల విషయంలో మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తోంది టీడీపీ అధిష్టానం. దీంతో ఎవరెవరు పార్టీలోకి రాబోతున్నారు..? వాళ్లు పార్టీలో చేరితే ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఆసక్తికర చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందిన కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు టీడీపీలో చేరే అవకాశం కన్పిస్తోంది.

టీడీపీ అధినాయకత్వం మళ్లీ వలసలపై ఫోకస్ పెట్టింది… ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఏయే నియోజకవర్గాల్లో చేరికలు అవసరమో చూసుకుని.. పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్న కీలక నేతలతో టచ్‌లో ఉంటూ జాగ్రత్తగా రాజకీయం నడిపించాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది … ప్రధానంగా ఆయా నియోజకవర్గల్లో ప్రభావితం చూపగల మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలపై కన్నేసినట్టు కన్పిస్తోంది… పైగా టీడీపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉండదని క్లారిటీ రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలను టీడీపీలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం…

ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడం దాదాపు ఖాయం అయింది… మరోవైపు రాయలసీమ ప్రాంతం అనంత జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. సీనియర్ కాంగ్రెస్ నేత శైలజానాధ్ టీడీపీలో చేరడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది… సింగనమల నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించి.. మంత్రి అయిన శైలజానాధ్.. పార్టీలో చేరతారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది… అయితే కాంగ్రెస్-టీడీపీల పొత్తుపై రకరకాల చర్చలు జరిగిన క్రమంలో ఆయన టీడీపీలో చేరే అంశం కొద్దిగా స్లో అయిందంటున్నారు.. అయితే ఆ తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదనే విషయం క్లారిటీ వచ్చాక.. తిరిగి టీడీపీ శ్రేణులు శైలజానాథ్‌తో టచ్లోకి వెళ్తోన్నట్టు తెలుస్తోంది…

ప్రస్తుతం సింగనమల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న పార్టీ ఎమ్మెల్యే పనితీరు మీద టీడీపీ హైకమాండ్ సంతృప్తిగా లేదు… శైలజానాథ్‌కు ఇమేజ్ పరంగా మంచి పేరే ఉండడంతో శైలజానాధ్ పార్టీలోకి వస్తే కచ్చితంగా సింగనమల నియోజకవర్గాన్ని గెలుపు ఖాతాలో వేసుకోవచ్చనేది టీడీపీ వ్యూహంగా కన్పిస్తోంది… మరోవైపు శైలజానాధ్ కూడా టీడీపీలో చేరేందుకు కొంత సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్లడమే సరైన మార్గమని శైలజానాధ్ కూడా భావిస్తున్నారంట. అలాగే విశాఖ జిల్లాకే చెందిన సబ్బం హరి కూడా పార్టీలోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. విశాఖ సీటీ నుంచి అసెంబ్లీ కి బరిలో దిగే ఆలోచనలో ఉన్న సబ్బం విశాఖ నార్త్ పై దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది.

మరోవైపు విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రి కొణతాల కూడా పార్టీలో చేరేందుకు రంగం సిద్దం అవుతోంది… దాదాపు ఏడాది కాలం నుంచి కొణతాల పార్టీలో చేరే అంశం నలుగుతూనే ఉంది. అయితే ఎప్పటికప్పుడు కొణతాల చేరిక వాయిదా పడుతూనే వస్తోంది… కొణతాల కొంత కాలంగా విభజన సమస్యలు.. ప్రత్యేక హోదా.. విశాఖ రైల్వై జోన్ వంటి అంశాలను భుజాన వేసుకుని కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసేసుకోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిల్ దాఖలు చేశారు.. కొణతాల కేంద్రానికి వ్యతిరేకంగా.. తన వ్యక్తిగత హోదాలో పోరాటం చేస్తుండటంతో .. అటువంటి నేతను పార్టీలో చేర్చుకోవడం ద్వారా స్థానికంగా అడ్వాంటేజ్ వస్తుందని అంచనా వేస్తోంది టీడీపీ.

ఇదే సందర్భంలో వైసీపీలో అసంతృప్తితో ఉన్న ఆయా జిల్లాల్లోని కీలక నేతలతోనూ టచ్‌లోకి వెళ్తున్నారు టిడిపి నేతలు …ఈ క్రమంలో విజయనగరం జిల్లా వైసీపీకి చెందిన కురు వృద్ధ నేత పెన్మత్స సాంబశివరాజు ను పార్టీలోకి తీసుకునేందుకు పార్టీ పెద్దలు కొందరు సంప్రదింపులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది… సదరు వైసీపీ సీనియర్ పార్టీలోకి వస్తే.. నియోజకవర్గం మేరకే కాకుండా.. జిల్లాలోనూ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ సీనియర్ నేత పార్టీలోకి వచ్చేందుకు సుముఖత చూపితే గతంలో ఆయన ఎమ్మెల్యేగా పని చేసిన నియోజకవర్గం అసెంబ్లీ టిక్కెట్ కానీ.. లేదా ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టే ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పార్టీలోకి చేరేందుకు సిద్దమైనట్టు సమాచారం.

AMARA9912199808

మొత్తంగా చూస్తే.. ఇవే కాకుండా.. ఇంకొన్ని నియోజకవర్గాల్లో కూడా కొందరి కీలక నేతలకు టీడీపీ అధినాయకత్వం టచ్లోకి వెళ్తోన్నట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికపై ఓవైపు కసరత్తు చేస్తూనే.. మరోవైపు అదే వేగంతో చేరికలపైన ఫోకస్ పెట్టి ఎన్నికలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు టీడీపీ అధినేత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here