తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి రాబోతోంది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని ఓడించటంలో స్టాలిన్ సక్సెస్ అయ్యారు. ఇక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు స్టాలిన్. డీఎంకేలో కరుణానిధి తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టబోయే మొదటి వ్యక్తిగా స్టాలిన్ తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సుస్థిరం చేసుకోబోతున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే దూసుకుపోయింది. మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కలత్తూరులో విజయం సాధించారు. ఇక పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేకు షాకిస్తూ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. తదుపరి ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొలువుదీరనున్నారు.
తండ్రి మరణం తర్వాత పూర్తిస్థాయిలో డీఎంకే పగ్గాలు చేపట్టారు స్టాలిన్. అధికార అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని ఎలా ఢీకొడతారనే అంశం ప్రజల్లో ఆసక్తిని పెంచింది. సోదరుడు అళగిరితో విభేదాల నేపథ్యంలో ఆయన ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, ఒకవేళ సోదరుడు సొంతపార్టీ పెడితే దానిని ఎలా ఢీకొంటారనే విషయాలపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఐతే, ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయిన స్టాలిన్, తండ్రిని గుర్తుచేస్తూనే తమకు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామన్న అంశాలపై ప్రసంగాలు చేశారు.
మరోవైపు..అన్నాడీఎంకే సైతం మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించింది. ఉచిత హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక…పోటీ చేసింది 20 సీట్లలోనేనైనా బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు ఆడపడుచు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, స్థానిక బీజేపీ నేత, నటి గౌతమి తదితర 30 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించి ఆర్భాటంగా ప్రచారం నిర్వహించింది. ఐతే, ఓటర్లు మాత్రం వార్ వన్‌సైడ్ చేశారు.