Home News Politics

శ్రీశైల మల్లిఖార్జునిడి చెంత విజయం ఎవరి దరి చేరేనో…?

ఏపీలోని నల్లమల అటవీప్రాంతాన్ని ఆనుకొనివున్న శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు దగ్గరపడే కొద్ది రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇక్కడ పోటీలో ఉన్న పార్టీలు సేమ్ టూ సేమ్ కాని పార్టీల అభ్యర్ధులు తారుమారు అయ్యారు. ఇక జనసేనాని ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది. వచ్చే ఎన్నికల్లో శ్రీశైల మల్లిఖార్జునుడి చెంత గెలుపు జెండా ఎగరేసేది ఎవరు…శ్రీశైలం నియోజకవర్గం పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్.


2009 వరకు ఆత్మకూరు సెగ్మెంట్ లో ఉన్న శ్రీశైలం 2009 డీలిమిటేషన్‌ అనంతరం శ్రీశైలం నియోజకవర్గంగా ఏర్పడింది. కాగా శ్రీశైలం, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు, బండిఆత్మకూరు మండలాలు కలగలిపిన ఈ నియోజకవర్గంలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ కూలిపోయిన ప్రాంతమైన పావురాలగుట్ట కూడా శ్రీశైలం నియోజకవర్గంలోనే ఉంది. శ్రీశైలం నియోజకవర్గం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్‌, ప్రజారాజ్యం పార్టీలు పోటీకి దిగాయి. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా బుడ్డా శైలజ, కాంగ్రెస్‌ నుంచి ఏరాసు ప్రతాపరెడ్డి, ప్రజారాజ్యం నుంచి బుడ్డా శేషిరెడ్డి బరిలోకి దిగారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాపరెడ్డి విజయం దక్కించుకున్నారు.

రాష్ట్ర విభజన నేపధ్యంలో ప్రతాపరెడ్డి కాంగ్రెస్‌ను విడిచిపెట్టి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల బరిలో దిగగా, బుడ్డా విజయం దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్థుతం పార్టీల అభ్యర్ధులు తారుమారు అయ్యారు. మారిన రాజకీయ పరిణామాలు బుడ్డా టీడీపీ తీర్ధం పుచ్చుకోవడం,శిల్పా ఫ్యామిలీ వైసీపీలో చేరడంతో నియోజకవర్గంలోనూ పాలిటిక్స్ వేగంగా మారాయి.

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి టీడీపీలో చేరిన తరువాత వైసీపీ ఇన్‌చార్జిగా బుడ్డా శేషిరెడ్డిని జగన్‌ నియమించారు. అనంతరం శేషిరెడ్డి ని తొలగించి ఇన్‌చార్జిగా శిల్పా చక్రపాణిరెడ్డిని జగన్‌ పార్టీ నియమించింది. ఈ పరిణామాలతో శిల్పా, శేషిరెడ్డిల మధ్య విబేధాలు చోటుచేసుకున్నట్లు ప్రచారం జరగుతోంది. ఇది 2019 ఎన్నికలపై ఈ ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా వైసీపీ, టీడీపీ నేతలు నియోజక వర్గంలో పోటాపోటీగా ప్రచారాలు సాగిస్తున్నారు. అసెంభ్లీ ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని తేల్చుకునేందుకు పలువురు నేతలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మోమిన్‌ షబ్నాం ఇప్పటికే ప్రచారయాత్రలకు శ్రీకారం చుట్టారు.

ఇక జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇక జనసేన అధినేత పవన్ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించితే ఇక్కడి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయనడంలో సందేహం లేదు. శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి శ్రీశైలం నియోజకవర్గం నిరంతరం పర్యటనలు చేస్తున్నారు. ఈసారైనా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలన్న గట్టిపట్టుదలతో ఆయన దూసుకుపోతున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఈసారి పొలిటికల్ ఫైట్ మామూలుగా ఉండేలా లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే ఈసారి పార్టీలు మారి పోటీ చేస్తుండటం ఇక్కడ విశేషం.

నియోజకవర్గంలో వైసీపీ ఓటు బ్యాంకు అధికం. బుడ్డా కుటుంబంలోనూ విభేదాలు తలెత్తాయి. సోదరులు బుడ్డా శేషిరెడ్డి, రాజశేఖర్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పాటు పార్టీ మారడం రాజశేఖర్ రెడ్డి పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేస్తూ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే పైనా, ప్రభుత్వంపైన ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందన్న విశ్వాసంతో శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు. ఇప్పటి వరకూ జనసేన ఇక్కడ ఇన్ ఛార్జిని నియమించలేదు. శ్రీశైలంలో మాత్రం ద్విముఖ పోరే ఉంటుందన్నది రాజకియ పండితుల అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here