Home Entertainment Cinema

పవన్ కళ్యాణ్ జనసేన.. సునీల్, శ్రీకాంత్ జై సేన..

అదేంటి సునీల్, శ్రీకాంత్ కూడా రాజకీయాల్లోకి గానీ వస్తున్నారా ఏంటి అనుకుంటున్నారా..? అలాంటిదేం జరగడం లేదు కానీ పవన్ కళ్యాన్ జనసేనను సపోర్ట్ చేయడానికి మాత్రం వీళ్లు ఓ సినిమా చేస్తున్నారు. సీనియర్ దర్శకుడు సముద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జై సేన అనే టైటిల్ పెట్టారు. ఇందులో శ్రీకాంత్, సునీల్ హీరోలుగా నటించారు. అసలు ఎప్పుడు ఈ సినిమా మొదలైంది.. షూటింగ్ ఎప్పుడు జరిగింది.. ఎప్పుడు పూర్తయింది అనే ప్రశ్నలు మాత్రం అడగొద్దు. ఎందుకంటే చాలా రోజులుగా ఈ చిత్రం సెట్స్ పైనే ఉంది. అప్పుడు కాస్తా.. ఇప్పుడు కాస్తా అంటూ ఈ మధ్యే సినిమాను పూర్తి చేసారు. ఇందులో సునీల్ కూడా చాలా లావుగా కనిపిస్తున్నాడు. ఈయన రెండు మూడేళ్ల కిందే ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు అనిపిస్తుంది.

ఇక శ్రీకాంత్ కూడా అప్పుడెప్పుడో డేట్స్ ఇచ్చాడు. సముద్ర ఒకప్పుడు సినిమాలు చేసాడు కాబట్టి అలా లాక్కొచ్చేసాడు. అయితే ఈ సినిమా వస్తున్నట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇప్పుడు ఉన్నట్లుండి ట్రైలర్ విడుదల చేసారు. జై సేన అంటూ సునీల్, శ్రీకాంత్ లాంటి వాళ్ల పేర్లు చెప్పి నిర్మాతలు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నట్లు ఇందులో మంచు మనోజ్ కూడా ఉన్నాడు. అయితే ఈయన ట్రైలర్ లో కనిపించలేదు. ఇందులో ప్రత్యేక పాత్రలో నటించాడు మనోజ్. ఒకే సినిమాలో చాలా మందిని తీసుకొచ్చాడు సముద్ర. తమిళ హీరో శ్రీరామ్ కూడా ఈ చిత్రంలో నటించాడు. ట్రైలర్ చివర్లో జై సేన అంటూ పవన్ కళ్యాణ్ వాయిస్ వాడుకున్నారు.. శ్రీరామ్ కూడా మెడపై చేతులు వేసి పవన్ ను ఇమిటేట్ చేసాడు. ఇదంతా చూస్తుంటే జనసేన కోసమే జై సేన రెడీ అవుతున్నట్లు అనిపిస్తుంది. రాజకీయాల చుట్టూనే ఈ కథ కూడా తిరుగుతుంది. మరి ఈ చిత్రంతో సీనియర్ హీరోలు ఏం చేస్తారో చూడాలిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here