Home News Stories

మాజీ కేంద్రమంత్రి ఎంట్రీతో సిక్కోలు వైసీపీ నేతల్లో టెన్షన్…!

కేంద్రమంత్రిగా పనిచేసిన ఆమె ఎప్పట్నుంచో పార్టీ మారుతారనే పుకార్లు షికారు చేస్తున్నాయి … దానికి తగ్గట్లే ఆమె ఫ్యాన్ పార్టీ అధినేతను కలిసి ఆ పార్టీలో చేరునున్నట్లు ప్రకటించారు … కట్ చేస్తే ఇప్పుడు ఈ ఎక్స్ ఎంపీ పై ఆ జిల్లాలోని వైసీపీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారట … ఆమె ఎంట్రీతో ఇప్పటి వరకు జెండాలు మోసిన నేతలు .. ఎవరి టిక్కెట్ కు ఎసరు వస్తుందోనని టెన్షన్‌ పడుతున్నారంట … ముఖ్యంగా ఇద్దరు ఆశావహులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారట… జిల్లా వైసీపీలో కిల్లి కృపారాణి ఎంట్రీతో అంత కలవరం మొదలవ్వడానికి కారణమేంటి…?

ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ని అంటిపెట్టుకుని ఉన్నవారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి ఒకరు … అలాంటామె తాజా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు … కృపారాణి నిర్ణయం అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు వైసీపీ వర్గాల్లోనూ తీవ్రచర్చనీయాంశంగా మారింది .. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వైసిపి నేతలు ఎవరూ ఈ పరిణామాన్ని ఊహించకపోవడంతో షాక్ లో ఉన్నారట … అదే సమయంలో ఆమె పై గుర్రుగా కూడా ఉన్నారట . 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి టీడీపీ దిగ్గజం ఎర్రంనాయుడు పై ఆమె విజయం సాధించారు … ఈ ఎన్నికల్లో తన సామాజికవర్గమైన కాళింగులు కొమ్ముకాయడంతో కృపారాణి గెలుపు గుర్రమెక్కగలిగారు … గెలిచిన మూడేళ్ల తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా ఆమెను వరించింది… రాష్ట్ర విభజన తర్వాత కృపారాణి 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు …

అదలా ఉంటే కేంద్రమంత్రిగా పనిచేసిన ఆమె వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి దిగాలని భావించారు … అందుకోసం ఏపార్టీ అయినా తాను సిద్ధం అంటూ సంకేతాలు పంపారు … దీంతో మూడేళ్ల క్రితం కృపారాణిని పార్టీలోకి తీసుకునేందుకు వైసీపీ ముఖ్యనాయకులు సుముఖత వ్యక్తం చేశారు… టెక్కలి సీటుపై ఆశలు పెట్టుకున్న ఆమెకు అప్పట్లో ధర్మాన ప్రసాదరావు చెక్‌ పెట్టారంటారు. కొద్ది నెలల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ , టీడీపీల మధ్య పొత్తుతో రాజకీయ భవితవ్వంపై కృపారాణి ఆశలు చిగురించినప్పటికీ …ఏపీలో ఎవరిదారి వారిదే అని తేలేసరికి ఆమె కామ్ గా ఉండిపోయారు … అయితే గత కొద్ది నెలలుగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పొలిటికల్ సిచ్యుయేషన్ ను బేరీజు వేసిన వైసీపీ అధిష్టానం మాత్రం కృపారాణితో టచ్ లోనే ఉన్నట్లు తెలిసింది.. .

పీకే టీమ్ తో చేయించిన సర్వేలో కూడా కృపారాణికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో శ్రీకాకుళం జిల్లా జగన్ ప్రజాసంకల్పయాత్రలో కృపారాణిని పార్టీలోకి తీసుకోవాలని భావించారట . ఐతే కొంతమంది జిల్లా పెద్దలు కొర్రీలు పెట్టడంతో అసలుకే మోసం వస్తుందని మళ్లీ పెండింగ్‌లో పెట్టారంట. అయితే ఎలాగైనా సిక్కోలులో ఎక్కువ సీట్లు గెలవాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అధినాయకత్వం జిల్లాలోని ఏ ఒక్క నాయకుడికి తెలియకుండా కృపారాణితో టచ్ లోనే ఉన్నట్లు సమాచారం.. . ఆ క్రమంలోనే జిల్లాలో ఉన్న కాళింగ సామాజిక ఓట్లను ఆకట్టుకునేందుకు కృపారాణి వంటి నాయకురాలైతే కరెక్ట్ అనుకుని వ్యవహారం చక్కబెట్టేశారట . దీంతో ఎవరికీ చెప్పాపెట్టకుండా సైలెంట్ గా వెళ్లి జగన్ ను కలిసిన కృపారాణి …ఈనెల 28న వైసీపీ కండువా కప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఈ ఊహించని పరిణామంతో సిక్కోలు వైసీపీ సీనియర్ నేతలు షాక్ తిన్నారట . తమపార్టీలో చేరుతూ..కనీసం తమకు చెప్పకుండా..తమను సంప్రదించకుండా ఇలా ఎలా చేస్తారంటూ కస్సుబుస్సులాడుతున్నారట … అదే సమయంలో తనను వ్యతిరేకించేవారు ఉన్నప్పటికీ ఎలాంటి కమిట్ మెంట్ లు లేకుండా … పార్టీ గెలుపుకోసమే వైసీపీలో చేరుతున్నానంటూ కృపారాణి మీడియా ముందు వెల్లడించడం … జిల్లాలోని ముఖ్యనాయకులుగా ఉన్న ధర్మాన సోదరులు , తమ్మినేని సీతారాంలకు ఇబ్బందిగా మారిందట . జిల్లా పెద్దలకు ఈ వ్యవహారం రుచించకపోవడం ఓ ఎత్తైతే…కృపారాణి ఎవరి సీటుకు టెండర్ పెడతారో అనే భయంతో మరికొందరు నేతలు జుట్టుపీక్కుంటున్నారట .

కృపారాణి రేపు విజయవాడ నూతన పార్టీ కార్యాలయంలో మందీమార్భలంతో వెళ్లి జగన్‌ ముందు బలనిరూపణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది… అయితే ఆ సమయంలో జగన్ ఆమెకు ఏమని హామీ ఇస్తారో అంతుపట్టక జిల్లా వైసీపీ శ్రేణులు బుర్రలు బాదుకుంటున్నాయి … మంత్రి అచ్చెన్నాయుడిని టార్గెట్ గా చేసుకుని టెక్కలి నియోజకవర్గంలో ఉన్న 80 వేల కాళింగ సామాజికవర్గ ఓట్లకు గాలం వేసేందుకు కృపారాణిని టెక్కలి అసెంబ్లీ బరిలో దింపితే … ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న పేరాడ తిలక్ పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది… గత మూడేళ్లుగా తిలక్‌ టెక్కలిలో తానే అభ్యర్ధిని అన్న ధీమాతో గ్రౌండ్‌వర్క్‌ చేసుకుంటున్నారు.. ఇప్పటికే పెద్దమొత్తంలో ఖర్చుపెట్టిన ఆయన .. కృపారాణి ఎక్కడ తన సీటుకు టెండర్ పెడుతుందోననే భయంతో పార్టీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారంట..

మరోవైపు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి గట్టిపోటీ ఇవ్వాలన్న ఆలోచనతో కృపారాణిని ఎంపీగా పోటీలోకి దింపుతారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది… అదే జరిగితే ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గా వ్యవహరిస్తున్న దువ్వాడ శ్రీను పరిస్థితి ఏంటన్న చర్చ సిక్కోలు వైసిపిలో చర్చనీయాంశంగా మారింది.. జిల్లాలో పాదయాత్ర జరిగినంత కాలం దువ్వాడ పార్టీ అధినేత జగన్‌ వెంటే తిరిగారు … దాంతో ఆయనే ఎంపి క్యాండెట్‌ అన్న అభిప్రాయం వ్యక్తం అయింది… అయితే ఇప్పుడు సామాజికవర్గ లెక్కలతో దువ్వాడకు చెక్ పెట్టి కృపారాణికి అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తోంది.. కృపారాణిని ఎంపీగా బరిలోకి దించితే… దువ్వాడను మరోమారు టెక్కలి నుంచి మంత్రి అచ్చెన్న పై పోటీకి దించి…పేరాడ తిలక్ కు ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తారనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.. మొత్తమ్మీద కృపారాణి ఎంట్రీతో సిక్కోలు వైసిపిలో పెద్ద రచ్చే నడుస్తోందిప్పుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here