Home News Updates

సిక్కోలులో ఇక్కడ సీన్ రివర్స్ అయిందే…!

రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి బలంగా వీచినా సిక్కోలు జిల్లాలోని టెక్కలిని మాత్రం సైకిల్ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది … దీంతో ఇప్పుడు అధికారపార్టీ నేతల్లో అక్కడ పోటీ మొదలైందట … ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ అసెంబ్లీ సెగ్మెంట్ పై పట్టుకోసం వేగంగా పావులు కదుపుతున్నారట … నియోజకవర్గంలో పార్టీతో పాటు అధికారులు , బదిలీలు , పోస్టింగులు తమ కనుసన్నల్లో నడవాలంటే ఇన్‌ఛార్జ్‌ పదవి ఒక్కటే సరైందని భావిస్తున్నారట … టెక్కలిలో వైసీపీ పార్టీ నేతల ఇన్‌ఛార్జ్‌ పాలిటిక్స్ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి….

వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా పూర్తవ్వకుండానే సిక్కోలు అధికారపార్టీలో రాజకీయం రాజుకుంటోంది … ముఖ్యంగా టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఆధిపత్యం సాధించేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట … తెలుగుదేశం పార్టీకి కంచుకోట శ్రీకాకుళం జిల్లా … అలాంటిది ఈ సారి ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఎనిమిది సెగ్మెంట్లను తన ఖాతాలో వేసుకుంది … అయితే టెక్కలి , ఇచ్ఛాపురం సెగ్మెంట్లలో మాత్రం సైకిల్ పార్టీ హవా నడిచింది … జిల్లా అంతటా వైసీపీ నేతలు ఎమ్మెల్యేలుగా ఉంటే…ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం ప్రతిపక్షపార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉండటం అధికార పార్టీ నేతలకు ఇబ్బందిగా మారింది …

ముఖ్యంగా టెక్కలి నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కావడంతో అటు వైసీపీ నేతలకు ..ఇటు ఎమ్మెల్యేకు మధ్య అధికారులు అడకత్తెరలో పోకచెక్కల్లా మారిపోతున్నారట … కరవమంటే కప్పకు కోపం …విడమంటే పాముకు కోపం అన్నట్లు తయారైందట టెక్కలిలో పరిస్థితి . .. ఎన్నికల ముందువరకూ టెక్కలి నియోజకవర్గానికి పేరాడ తిలక్ సమన్వయకర్తగా వ్యవహరించేవారు … అయితే ఎన్నికల తర్వాత టెక్కలి వైసీపీకి ఇన్‌ఛార్జ్‌ అంటూ ఎవరూ లేరు . అచ్చెన్నాయుడు ఉన్న నియోజకవర్గంలో పార్టీని ధీటుగా నడిపించాలంటే బలమైన ఇన్‌ఛార్జ్‌ ఉండాలి … దీంతో ఇప్పుడు నియోజకవర్గాన్ని సమన్వయపరిచే ఇన్‌ఛార్జ్‌ పోస్టు కోసం ఒక్కసారిగా పోటీ పెరిగింది … గతంలో ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన పేరాడ తిలక్ కు పోటీగా దువ్వాడ శ్రీనివాస్ , ప్రస్తుత శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి క్యూలైన్లో ఉన్నట్లు తెలుస్తోంది .

ఆ క్రమంలో టెక్కలి నియోజకవర్గంలో ఉన్న ముఖ్యనేతలైన పేరాడ తిలక్ , దువ్వాడ శ్రీను , కిల్లి కృపారాణిలు ఎవరికి వారే తమ సిఫార్సులను ప్రభుత్వ శాఖలకు పంపిస్తున్నారట … తమ ప్రాంతంలో తమకు అనుకూలంగా ఉన్న వారికి పోస్టింగ్ లు ఇప్పించుకోవడానికి … తలా ఒకరిని సిఫార్సు చేస్తుండటంతో ఎవరికి ఫేవర్ చేయాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారంట. పోలీస్ , ఎక్సైజ్ శాఖలో పోస్టింగుల విషయంలో కనీసం తమకు తెలియకుండా బదిలీలు జరిగాయని … పేరాడ తిలక్ హర్ట్ అయ్యారట … ప్రస్తుతం రెవిన్యూ అధికారుల బదిలీలను జరుగుతుండటంతో … ఈ ముగ్గురు నేతల్లో ఎవరి సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వాలో అర్ధంకాక అధికారులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు . వీరికి తోడు ఎమ్మెల్యే సిఫార్సులు కూడా తోడవుతుండటంతో అధికారుల్లో అయోమయం నెలకొందట .

అదలాఉంటే టెక్కలి నియోజకవర్గానికి కొత్త ఇన్‌ఛార్జ్‌ని పార్టీ నియమించకపోవడంతో… ఆ పోస్టు కోసం ఈ ముగ్గురు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట … ఆ పదవి దక్కితే…అటు పార్టీతో పాటు .. ఇటు పోస్టింగ్ లు , బదిలీలు వంటి వ్యవహారాలన్నింటినీ తమ కనుసన్నల్లోనే నడుస్తాయనేది వారి ఫీలింగట … మరోవైపు తొమ్మిదేళ్లు అధికారం కోసం ఎదురుచూసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినా … సెగ్మెంట్లో తమకు న్యాయం చేసేవారెవరో తెలియక పార్టీ శ్రేణులు బెంగపెట్టుకుంటున్నారట …. గ్రామవాలంటీర్ పోస్టయినా దక్కించుకుంటే దాని ద్వారా ఉపాధి పొందాలని ఆశపడుతున్న కార్యకర్తలకు ఈ ముగ్గురు నేతల మధ్య పోటీ కారణంగా నిరాశే ఎదురవుతుందట . తాజాగా సంతబొమ్మాళి పంచాయతీలో ఖాళీ అయిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ పడింది .. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కకపోవడంతో తిలక్ దగ్గర మొరపెట్టుకున్నా..ఏపీ చేయలేని స్థితిలో ఉండిపోయారట … ఏదేమైనా నియోజకవర్గంలో కార్యకర్తలకు బాసటగా నిలవాలన్నా….పట్టు సాధించాలన్నా… ఇన్‌ఛార్జ్‌ పదవి ఒక్కటే కీలకం అని భావిస్తున్నారట ఈ ముగ్గురు నేతలు .

పార్టీకోసం పనిచేసి అచ్చెన్నాయుడికి గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయిన తనకే ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పజెప్పాలని పేరాడ తిలక్ గట్టిగా ప్రయత్నిస్తున్నారట … దువ్వాడ శ్రీను సైతం స్వల్ప మెజార్టీతో చేతికొచ్చిన అవకాశం చేజారిపోయిందని … పార్టీని నమ్ముకున్నందున తనకు ఇన్‌ఛార్జిగా అవకాశం ఇవ్వాలని అధిష్టానం ముందు మొరపెట్టుకున్నారట … అటు కిల్లి కృపారాణి కూడా.. నియోజకర్గం సమన్వయకర్తగా తానైతేనే సమర్ధవంతంగా అందర్నీ సమన్వయం చేయగలనని … తన వల్లే టెక్కలిలో టీడీపీకి గట్టిపోటీ ఇవ్వగలిగామని వాదిస్తున్నారంట .. మొత్తమ్మీద ఇన్‌ఛార్జ్‌ పదవి సంగతేమో కాని ..ప్రస్తుతం ఈ ముగ్గురు నేతల మధ్య అటు కార్యకర్తలు ..ఇటు అధికారులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారట … పార్టీ అధిష్టానం తొందరగా ఎవరో ఒకరిని ఇన్‌ఛార్జ్‌గా నియమించకపోతే … స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికిలపడటం ఖాయమని పార్టీ శ్రేణులు బహిరంగంగానే అంటున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here