Home News Stories

సెగలు రేపుతున్న సిక్కోలు ఎంపీ ఫైట్…!

ఈసారి ఎలక్షన్స్ అధికారపార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీకి సైతం ఎంతో కీలకం . ఎక్కడ ఏ చిన్న సమీకరణాలు మారినా …మొత్తం సీటుకే ఎసరొస్తుంది . దీంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే తమ దైన శైలిలో ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి అధికార,విపక్ష పార్టీలు…తండ్రి వారసత్వం నుంచి రాజకీయ తెరపైకి వచ్చినా..2019 ఎన్నికల్లో సొంత ఇమేజ్ తోనే బరిలోకి నిలుస్తానని తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టిన యువ ఎంపీ ధీమా వ్యక్తం చేస్తుంటే… డబ్బుతో సంబంధం లేకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి టిక్కెట్ ఇచ్చిన నాయకుడిని గెలుపించుకుంటామని తొలిసారి ఎంపీ బరిలో నిలుస్తున్న ప్రతిపక్షపార్టీ అభ్యర్ధి స్పష్టం చేస్తున్నారు . ఇక మార్పు మాతోనే సాధ్యమని మరొకరు … విభజనతో జరిగిన నష్టాన్ని పూడుస్తామాని ఇంకొకరు ఇలా బోల్డన్ని ఈక్వేషన్స్ లెక్కలేసుకుని మరీ బరిలోకి దిగుతున్నాయి సిక్కోలు పార్లమెంట్ పరిధిలో రాజకీయ పార్టీలు . అసలు సిక్కోలు పార్లమెంట్ సీట్ ను దక్కించుకునే అవకాశాలున్నవారెవరు…

పార్లమెంట్ , అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఏపీలోని ప్రధాన రాజకీయపార్టీలు గెలుపు గుర్రాలనే బరిలోకి దించుతున్నాయి . ముఖ్యంగా అధికారపార్టీ చాలాచోట్ల సిట్టింగ్ లకే మరోసారి అవకాశం కల్పిస్తూ అభ్యర్ధులను ప్రకటించింది . ఈక్రమంలోనే శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ అభ్యర్ధిగా రెండవసారి బరిలోకి దిగుతున్నారు కింజరాపు ఎర్రన్నాయుడి కుమారుడు…సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు . మరోవైపు ప్రతిపక్షపార్టీ సైతం బోల్డన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని దువ్వాడ శ్రీనివాస్ ను ఎంపీగా బరిలోకి దించింది. ఇక జనసేన, కాంగ్రెస్ ,బీజేపీలు సైతం తమ పార్టీల అభ్యర్ధులను ప్రకటించి పోటీలో నిలుపుతున్నాయి. కానీ సిక్కోలులో మాత్రం ప్రధాన పోటీ టీడీపీ అభ్యర్ధి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనుల మధ్యే ఉంటుందన్నది టాక్ .

కేంద్ర మంత్రి పదవి నుంచి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎదిగారు . 2012లో ఆయన హఠాన్మరణం అనంతరం ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు అనుకోని పరిస్థితుల్లో తండ్రి స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది . కనీసం రాజకీయ అనుభం లేని రామ్మోహన్ నాయుడు తండ్రి మరణంతో వచ్చిన సానుభూతి.. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలను అందిపుచ్చుకున్నారు . ఎర్రన్న పై ఉన్న అభిమానానికి తోడు అన్నీ కలిసిరావడంతో రామ్మోహన్ నాయుడినికి సిక్కోలు ఎంపీ కుర్చీ దక్కింది . 2014 ఎన్నికల బరిలో పిన్న వయస్కుడిగా ఎంపీ స్థానానికి పోటీ చేసి ఘన విజయం సాధించారు . కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, వైసీపీ నుంచి రెడ్డిశాంతిలు బరిలోకి దిగినప్పటికీ జిల్లావాసుల ఓటు రామ్మోహన్ కే దక్కింది . ఈఎన్నికల్లో 127,572 ఓట్ల భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు . దీంతో మరోమారు 2019 లోక్ సభ ఎన్నికల బరిలో టీడీపీ తరపున అభ్యర్ధిగా పోటీకి దిగుతున్నారు .

ఇక వైసీపీ తరపున దువ్వాడ శ్రీను ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు . సుమారు 18 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న దువ్వాడ 2006 లో టెక్కలి జడ్పీటీసీ సభ్యునిగా కాంగ్రెసు తరఫున గెలిచి.. జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షునిగానూ ఎన్నికయ్యారు . 2007లో జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో శాసనమండలికి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన గొర్లె హరిబాబు నాయుడికి మద్దతిచ్చి పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు . కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ వేటు పడటంతో ప్రజారాజ్యంలో చేరారు . టెక్కలి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు . 2014 ఎన్నికల్లో టెక్కలిలో నుంచి కింజరాపు అచ్చెన్నాయుడి పై పోటీచేసి 8వేల పైచిలుకు ఓట్లతో పరాజయం పాలయ్యారు . దీంతో కొద్ది రోజులు స్తబ్ధుగా ఉండిపోయిన దువ్వాడను పక్కనపెట్టేసిన వైసీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయ కర్తగా పేరాడ తిలక్ ను నియమించింది . ఐతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధిష్టానం దువ్వాడను శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించింది . జగన్ దువ్వాడ శ్రీనును శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించుతున్నారు . దీంతో రామ్మోహన్ నాయుడు వర్సెస్ దువ్వాడల మధ్య పోటీ ఎలాంటి ఎలా ఉంటుందన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది .

శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శ్రీకాకుళం , ఆమదాలవలస , పాతపట్నం , నరసన్నపేట , టెక్కలి , పలాస , ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి . దీంతో ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్ధులను గెలిపించుకోవడంతో పాటు తన సీటును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంపీ అభ్యర్ధుల పై ఉంది . ఈక్రమంలోనే ఎంపీ బరిలో నిలుస్తున్న టీడీపీ , వైసీపీ అభ్యర్ధులు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తాము గెలవాలంటే ఎమ్మెల్యేలనూ గెలిపించాలంటూ ఎప్పట్నుంచో ప్రచారం చేసుకుంటున్నారు . ఇక ఇదే సమయంలో అధికారపార్టీ టీడీపీ ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో పలాస మినహా సిట్టింగ్ లకే టిక్కెట్లను కట్టబెట్టింది . పలాసలో ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ పోటీ నుంచి తప్పుకుని తన స్థానంలో కుమార్తె గౌతు శిరీషను తెరపైకి తెచ్చారు . అధిష్టానం కూడా శిరీషకే టిక్కెట్టు ఖరారు చేసింది . ఇక వైసీపీ పలాస , టెక్కలి ,పాతపట్నం , ఇచ్ఛాపురం నియోజకవర్గాల నుంచి కొత్తవారిని బరిలోకి దించుతోంది . దీంతో ఇరు పార్టీల అభ్యర్ధుల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది .

ఇదే సమయంలో అధికారపార్టీతరపున బరిలోకి దిగుతున్న రామ్మోహన్ నాయుడు పనితనం పై జిల్లాలో కొంత చర్చనడుస్తోంది . తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న వాగ్ధాటితో రామ్మోహన్ నాయుడు జిల్లాలో తన దైన గుర్తింపు సాధించారు . ఎర్రన్న కొడుకుగా…తమ ఇంట్లో మనిషిగా జిల్లావాసులు ఆదరించేంత పేరు తెచ్చుకున్నాడు. విభజన హామీల సాధన ,రైల్వేజోన్ , ప్రత్యేకహోదా అంశాల పై పార్లమెంట్ సాక్షిగా చేసిన పోరాటాల్లో రామ్మోహన్ నాయుడు తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ ప్రాంతాలకు పార్లమెంట్ అభ్యర్ధిగా ఏంచేశారనే చర్చను వైసీపీ పార్టీ తెరపైకి తెస్తోంది . ఢిల్లీలో గళం వినిపించారు సరే …గత ఐదేళ్లలో ఈప్రాంతానికి ఏంచేశారని ప్రశ్నిస్తున్నారు. రైల్వే స్టాండింగ్ కమిటీకి సభ్యుడిగా మారడం ఆనందమే ఐనా..శ్రీకాకుళం రైల్వేస్టేషన్ లో ఎన్ని ట్రైన్లు ఆపించగలిగారు…. తిత్లీ తుఫాన్ దెబ్బకు అతలాకుతలం అయిన పలాస రైల్వేస్టేషన్ ను ఎందుకు పట్టించుకోలేదు అంటుంది.

సామాజిక వర్గ సమీకరణాలను బలంగా నమ్ముకున్న వైసీపీ అభ్యర్ధి అదే స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లోని కాళింగులను ఓవైపు చేర్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు . మంత్రి అచ్చెన్నాయుడు ఆర్ధికంగా తన మూలాలపై దెబ్బకొట్టాడని…అష్టదిగ్భంధనం చేశాడని….ఆర్ధికంగా చితికిపోయిన తనలాంటి వారికి టిక్కెట్టిచ్చిన జగన్ కు రుణపడి ఉంటానంటూ పలాస ఎన్నికల ప్రచారసభలో జగన్ సమక్షంలో కన్నీళ్లు పెట్టుకున్నారు దువ్వాడ . ఇవన్నీ సామాజికవర్గపరంగా ఎన్ని ఓట్లు కురిపిస్తాయో తెలియాల్సి ఉంది. ఇక జనసేన, కాంగ్రెస్ పార్టీలు సైతం తమ అభ్యర్ధులను బరిలోకి దించుతున్నాయి. కాంగ్రెస్ తరపున డోల జగన్ ….జనసేన తరపున విద్యావంతుడైన మెట్ట రామారావును పోటీలో నిలబెడుతున్నారు . మత్స్యకార సామాజివర్గం,యువత , ఉద్యోగులు , మహిళలు ఓట్ల తమకే పడతాయనే ధీమాలో ఉన్నారు ఈరెండు పార్టీల నాయకులు . ఐతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గట్టి పోటీ మాత్రం రామ్మోహన్ నాయుడు ,దువ్వాడల మధ్యే ఉంటుందనే చర్చ నడుస్తోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here