Home News Politics

సిక్కోలులో వార్ ఎవరి పక్షం…?

శ్రీకాకుళం జిల్లాలోని పదినియోజకవర్గాలను కలుపుకుని 2019 లెక్కల ప్రకారం 20,64,330 ఓటర్లున్నారు . కేవలం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ల వరకూ లెక్కేస్తే…1,457,096 ఓటర్లున్నారు . దీంతో భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ఇరు పార్టీల అభ్యర్ధులు పావులు కదుపుతున్నారు . టీడీపీ అభ్యర్ధులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం , అభివృద్ధి పథకాలనే ప్రచారాస్త్రాలుగా బరిలోకి దిగుతుంటే…ప్రత్యర్ధి పార్టీ వైసీపీ మాత్రం సామాజిక సమీకరణాల పై ప్రత్యేక దృష్టి పెట్టింది . దీంతో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితులు కీలకంగా మారాయి .

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో 2,33,278 మంది ఓటర్లున్న ఈనియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టిడిపి అభ్యర్ధిగా మరోమారు బరిలోకి దిగుతున్నారు . వైసీపీ తరపున ధర్మాన ప్రసాదరావు పోటీలో ఉన్నారు . రెండు పార్టీల అభ్యర్ధులకు ఈ ఎన్నికలు కీలకం …కచ్చితంగా గెలవాలన్న పట్టుదలలో ధర్మాన…మరోసారి విజయం సాధించాలనే ఆలోచనలో గుండలక్ష్మీదేవి ఉన్నారు . సామాజిక వర్గాల పరంగా వెలమ సామాజిక వర్గం మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో కలింగ వైశ్యులు, మూడు,నాలుగు,ఐదు స్థానాల్లో కాళింగ,మత్స్యకారులు,శిష్టకరణాలు ఉన్నారు . గుండలక్ష్మీదేవి , ధర్మాన ఇద్దరూ వెలమసామజివర్గానికే చెందినవారే కావడంతో…వెలమలు ఇద్దరికీ అండగా నిలిచి సామాజిక న్యాయంచేస్తున్నారు . ఇక మత్స్యకారుల్లో ఎక్కువ శాతం ఓట్లు టీడీపీకే అనుకూలంగా పడుతూ వస్తున్నాయి . కళింగ వైశ్యులు ( కళింగ కోమట్ల ) ఓట్లు ప్రతీ ఎన్నికల్లోనూ కీలకంగా మారుతున్నాయి . గతంలో రెండు సార్లు ధర్మాన గెలిచినా…మొన్న లక్ష్మీదేవి విజయం సాధించినా…వీరి ఓట్లే ప్రధాన భూమిక పోషించాయి . కానీ ఈసారి ఎన్నికల్లో పరిస్థితుల వేరేలా ఉన్నాయి. 2014లో ధర్మానకు దూరమైన కళింగకోమట్లు ఇప్పుడు ఆయనకు దగ్గరయ్యారు . టీడీపీకి పట్టున్న రూరల్ ప్రాంతంలో వైసీపీ బలంపెంచుకుంటోంది.

ఆముదాలవలస నియోజకవర్గంలో 1,74,350 మంది ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరపున బరిలోకి దిగిన కూన రవికుమార్ , వైసీపీ అభ్యర్ధి సీనియర్ నాయకులు , సొంత మేనమామ తమ్మినేని సీతారాం పై 5,449 ఓట్ల మెజారిటీతో గెలిచారు…ఇప్పుడు మరోమారు ఆమదాలవలస బరిలో మామా ,అల్లుళ్లు పోటీకి సై అంటున్నారు. మెజారిటీ వాటా ఉన్న కాళింగుల ఓట్లే ఇక్కడ కీలకం . ఐతే సామాజికసమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఓట్లను కొల్లగొట్టేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఇక్కడ కొంత ఫలిస్తాయనే చెప్పొచ్చు . టీడీపీ హయాంలో కాళింగులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు….వైసీపీ ఒక ఎంపీ …మూడు ఎమ్మెల్యే టిక్కెట్లిచ్చిందన్న ప్రచారాన్ని ఈ నియోజవర్గ కాళింగుల చెవికి ఎక్కించేందుకు వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది . అదే సమయంలో కాళింగులందరూ ఏకమైతే…నాఓటు నాకు వేయండి..ఎంపీ ఓటు మీఇష్టం అని కూనరవికుమార్…తన దారి తాను చూసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్న టాక్ ఇక్కడ వినిపిస్తోంది .

గత ఎన్నికల్లో సంచలనాలకు కేంద్రబిందువైన నరసన్నపేట నియోజకవర్గంలో కింజరాపు కుటుంబానికి మంచి పేరుంది . ఈ నియోజకవర్గంలో 1,97,200 ఓటర్లు ఉన్నారు . అత్యధికంగా వెలమ సామాజిక వర్గం ఉన్న ఈ నియోజకవర్గంలో రెండవ స్థానంలో కాళింగ, మూడవ స్థానంలో కాపు సామాజిక వర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పై తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బగ్గు రమణమూర్తి విజయం సాధించారు . 2014 ఎన్నికల తర్వాత కూడా నరసన్నపేట పై కింజరాపు కుటుంబం ప్రత్యేక శ్రద్ధ చూపించింది . ప్రభుత్వం పరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే , ఎంపీ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లగలిగారు . దీంతో మొదట్లో బగ్గురమణమూర్తి పై వ్యతిరేకత ఉన్నా…ప్రస్తుతం ప్రత్యర్ధి పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్ధిగా నిలిచారు . ధర్మాన కుటుంబానికి కంచుకోటగా భావించే నరసన్నపేటలో టీడీపీ అభ్యర్ధి బగ్గురమణమూర్తికి …ధర్మాన కృష్ణదాస్ పోటీ ఇచ్చినా… ఎంపీ ఓటు కింజరాపు కుటుంబం వైపే ఉండే అవకాశం కనిపిస్తోందిక్కడ .

ఇక కింజరాపు ఫ్యామిలీకి కంచుకోట టెక్కలి. స్వస్థలం…ఉత్తరాంధ్ర పెద్దన్న ఎర్రన్నాయుడు వేసిన పునాదులు బలంగా ఉన్న ప్రాంతం టెక్కలి . టెక్కలి,సంతబొమ్మాళి,కోటబొమ్మాళి, నందిగాం మొత్తం నాలుగు మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో 2,06,876 మంది ఓటర్లున్నారు . జనాభా పరంగా కాళింగ సామాజిక వర్గం మొదటిస్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానాల్లో మత్సకార,వెలమ సామజిక వర్గాలు ఉన్నాయి . ఓవైపు బాబాయ్ అచ్చెన్నాయుడు మంత్రిగా …ఎంపీగా రామ్మోహన్ నాయుడు టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో బెటర్ పొజిషన్ లోనే ఉంచారు . ఐతే వైసీపీ సామాజికవర్గ సమీకరణాలు ఇక్కడ ఎంతవరకూ వర్కవుట్ అవుతాయన్నది తేలాల్సి ఉంది . మంత్రి అచ్చెన్నాయుడితో పాటు రామ్మోహన్ నాయుడికి కూడా ఒకే సారి చెక్ పెట్టాలనే దిశగా క్యాస్ట్ పాలిటిక్స్ కు పెద్ద పీట వేస్తున్న వైసీపీ టెక్కలిలో కాళింగ సామాజికవర్గంలోని కీలక నేతలందరినీ ఏకం చేయగలిగింది . ఈమధ్యనే వైసీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షురాలి పదవిని కట్టబెట్టింది .

పాతపట్నం నియోజకవర్గం కలమట కుటుంబానికి కంచుకోట . ఈనియోజకవర్గంలో 1,94,449 ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన కలమట వెంకటరమణ మూర్తి ..గెలిచిన అనంతరం సైకిల్ ఎక్కేశారు . ఐతే కలమట రాకను స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ పార్టీ అధిష్టానం నిర్ణయానికి పాతపట్నం తమ్ముళ్లు కట్టుబడి ఉన్నారు . కానీ నేటికీ పాతపట్నం సైకిల్ పార్టీలో సఖ్యత రాలేదు . కలమట పై అటు ప్రజల్లోనూ ,ఇటు పార్టీ క్యాడర్ , నాయకుల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది . దీంతో పాతపట్నం బాధ్యతను బాబాయ్ అచ్చెన్నాయుడు , అబ్బాయ్ రామ్మోహన్ నాయుడు భుజానికి ఎత్తుకున్నారు .తాజాగా అభ్యర్ధుల జాబితాలోనూ తప్పని సరి పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం కలమటకే పాతపట్నం టిక్కెట్ ఖరారు చేసింది. టీడీపీ నుంచి పెరుగుతున్న వలస కారణంగా ఓటు బ్యాంకు పెరగాలే కానీ … ఫ్యాన్ పార్టీ పటిష్టంగా ఐతే లేదు . ఇక్కడ వైసీపీ నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసిన రెడ్డి శాంతి అభ్యర్ధిగా ఉన్నారు.

పలాస నియోజకవర్గంలో 1,92,367 మంది ఓటర్లున్నారు . జనాభా పరంగా మత్సకార సామాజిక వర్గం మొదటిస్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానాల్లో కాళింగ, యాదవ సామాజిక వర్గాలు ఉన్నాయి. శ్రీ శయన సామాజిక వర్గానికి చెందిన గౌతు శ్యామ సుందర శివాజీకు సామాజిక వర్గ పరంగా పెద్ద బలం లేనప్పటికీ స్వాతంత్ర్య సమరయోధులుగా తన తండ్రి గౌతు లచ్చన్న కు ఉన్న ఛరిస్మా ఆ కుటుంబాన్ని తిరుగులేని నాయకులుగా తీర్చిదిద్దింది . దీంతో ఈసారి ఇక్కడ శివాజీ కుమార్తె గౌతు శిరీష ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తోంది . జిల్లాపార్టీ అధ్యక్షురాలిగా పార్టీని సమర్ధవంతంగా నడిపిస్తున్న శిరీష పలాసలో తండ్రి వెంటే ఉంటే…నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు . ఐతే ఈ నియోజకవర్గంలో బలమైన మత్స్యకార , కాళింగ సామాజికవర్గాలకు గాలం వేసేందుకు పలాస వైసీపీ అభ్యర్ధిగా మత్స్యకారుడైన డా.సీదిరి అప్పలరాజును , పార్లమెంట్ కు దువ్వాడ ఎలాగూ ఉండటంతో ఫ్యాన్ పార్టీ ధీమాగా ఉంది . కాళింగుల ఓట్లెలాగూ తమకే వస్తాయి…ఇక మత్స్యకారుల ఓట్లు అప్పలరాజు రూపంలో ఫ్యాన్ ఖాతాలో పడతాయనే భావనలో ఉన్నారు .

తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఇచ్ఛాపురం… పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఎనిమిది సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుసార్లు టీడీపీ గెలిచింది . అలాంటి ఈ నియోజకవర్గంలో 2,28,529 మంది ఓటర్లున్నారు . జనాభా పరంగా రెడ్డిక, యాదవ, మత్సకార సామాజిక వర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన బెందాళం అశోక్ మరోమారు ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కాళింగ సామాజికవర్గానికి చెందిన అశోక్ పై అదే సామాజికవర్గానికి చెందిన పిరియాసాయిరాజ్ ను వైసీపీ పోటీకి దించుతోంది . కులసమీకరణాలే ప్రధాన లక్ష్యంగా ప్రత్యర్ధి పార్టీ పావులు కదుపుతున్నప్పటికీ ఇచ్ఛాపురంలో తనకున్న క్రేజ్ తన ఓటు బ్యాంకుతో పాటు ఎమ్మెల్యేకు ఎసెట్ అవుతుందనే ధీమాలో ఉన్నారు రామ్మోహన్ నాయడు .

ఇక జనసేన, కాంగ్రెస్ పార్టీలు సైతం తమ అభ్యర్ధులను పార్లమెంట్ బరిలోకి దించుతున్నాయి. కాంగ్రెస్ తరపున డోల జగన్ ….జనసేన తరపున విద్యావంతుడైన మెట్ట రామారావును పోటీలో నిలబెడుతున్నారు . మత్స్యకార సామాజివర్గం,యువత , ఉద్యోగులు , మహిళలు ఓట్ల తమకే పడతాయనే ధీమాలో ఉన్నారు ఈరెండు పార్టీల నాయకులు . ఐతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గట్టి పోటీ మాత్రం రామ్మోహన్ నాయుడు ,దువ్వాడల మధ్యే ఉంటుందనే చర్చ నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here