Home News Politics

సిక్కోలులో రూటు మార్చిన సీనియర్ లీడర్…!

రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఆ సీనియర్ లీడర్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారట . ఎప్పుడో ఒకసారి రోడ్డెక్కి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ఆయన ట్రెండ్ మారిస్తేనే ఈసారి విక్టరీ సాధ్యమనుకుంటున్నారట . అందుకే ఓల్డ్ ఫార్ములానే నమ్ముకుని ఎన్నికల వేళ వ్యూహాలను రెఢీ చేసుకుంటున్నారు . ఎక్కడ బలహీనపడ్డారో… అక్కడే బలపడాలనుకుంటున్నారట . సిక్కోలులో పాతరూటే కరెక్ట్ అనుకుంటున్న ఈ సీనియర్ లీడర్ పై స్పెషల్ రిపోర్ట్…

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలు ,నాయకులు తమ వ్యూహాలకు ఇప్పట్నుంచే పదును పెడుతున్నారు . అధికారపార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీకి సైతం ఈఎన్నికలు కీలకం కావడంతో జిల్లాలో ఇప్పుడు చక్రం తిప్పుతున్న నాయకులు…గతంలో ఓ వెలుగు వెలిగిన నేతలు పక్కాగా ప్రణాళికలు రెఢీ చేసుకుంటున్నారు . ముఖ్యంగా సిక్కోలు జిల్లాలో అందరి దృష్టి ఇప్పుడు శ్రీకాకుళం అసెంబ్లీ నియోకవర్గం పైనే ఉందట . అందుకు కారణం మాజీమంత్రి ధర్మాన మరోసారి బరిలో దిగనుండటం.. ఎలాగైనా గుండఫ్యామిలీని ఢీకొట్టి గెలవాలనే పట్టుదలతో ఉండటమే దీనికి కారణం అట.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికల్లోనూ అప్రతిహతంగా దూసుకుపోతున్న సైకిల్ కు 2004లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ధర్మాన ప్రసాదరావు బ్రేక్ వేశారు . ఈ ఎన్నికల్లో ప్రతీ వార్డూ తిరుగుతూ కాలనీ వాసులు, ఉద్యోగులు ఇలా అందరిని తన ప్రచారాస్త్రాలతో ధర్మాన ఆకట్టుకున్నారు . నియోజకవర్గంలో మంచి పట్టున్న గుండ ఫ్యామిలీకి చెక్ పెట్టారు . 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం టౌన్ లోనే ఏకంగా పదివేల ఓట్ల మెజార్టీ ధర్మానకు వచ్చింది . శ్రీకాకుళం రూరల్ , గార మండలాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉన్నా…టౌన్ ఓటర్లు ధర్మానకే పట్టం కట్టడంతో 7227 ఓట్లతో విజయం సాధించారు . ఆతర్వాత వైఎస్ కేబినెట్ లో చోటుదక్కడంతో తనదైన ముద్ర వేసుకునేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు .

ఈక్రమంలోనే 2009లోనూ శ్రీకాకుళం నియోకవర్గం నుంచి ధర్మాన బరిలోకి దిగారు . ఐతే ఈఎన్నికల్లో త్రిముఖ పోటీఉండటంతో గతంలో కంటే మెజారిటీ తగ్గినప్పటికీ 4470 ఓట్లతో గెలిచారు . దీంతో మరోమారు మంత్రి పదవి దక్కింది . ఐతే 2014లో పరిస్థితి మారింది . ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ధర్మాన మరోమారు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచే పోటీచేశారు . కానీ ఈ ఎన్నికల్లో రూరల్ తో పాటు తనకు అనుకూలం అనుకున్న టౌన్ లో కూడా బలం తగ్గిపోయింది . మంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్దికి ఆయన చేసిన కృషికి ప్రత్యేక గుర్తింపు వచ్చినప్పటికీ 2014 ఎన్నికల్లో అవేమీ కలిసిరాలేదు . ధర్మాన హయాంలోనే శ్రీకాకుళం నగరంలో అభివృద్ధి జరిగిందనే టాక్ ప్రజల్లో బలంగా ఉన్నప్పటికీ , అదే సమయంలో అతని అనుచరులు రౌడీయిజం చేస్తున్నారనే ఆరోపణలు అంతే బలంగా ఎన్నికల్లో పని చేశాయి .

ఇక అదే సమయంలో టౌన్ లో మెజారిటీ ఓటు బ్యాంకు కలిగిన కళింగకోమట్లు సైతం ధర్మానను పక్కనపెట్టేశారు . కళింగకోమట్లను బీసీల్లో చేర్చాలన్న ఫైల్ చివరిదశకు వచ్చేసరికి ధర్మాన మంత్రి పదవికి దూరమవ్వడం…పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం….ఆఫైల్ ఆమోదం పొందలేకపోయింది . ధర్మానే కళింగకోమట్లను బీసీల్లో చేర్చకుండా అడ్డుకున్నారంటూ టీడీపీ ప్రచారం చేయడంతో వారంతా గంపగుత్తగా సైకిల్ కు ఓట్లు గుద్దేశారు . దీంతో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ గుండలక్ష్మీదేవి 24వేల భారీ మెజారిటీతో గెలుపొందారు . ఐతే ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు ధర్మాన సిద్ధమవుతున్న వేళ …ఆసారి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లేందుకు పక్కగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు . ఎప్పుడో పార్టీ తరపున కార్యక్రమాలు…అధిష్టానం ఆదేశానుసారం ర్యాలీలు,
నిరసనల్లో పాల్గొనడం తప్ప పెద్దగా రోడ్డెక్కని ధర్మాన ఇప్పుడు ట్రెండ్ మార్చాలని భావిస్తున్నారు.

టీడీపీకి గణనీయమైన ఓటుబ్యాంకు ఉన్న రూరల్ లో పర్యటనలతో నిత్యం కేడర్ కు అందుబాటులో ఉంటున్నారట. ఇక తనకు రెండుసార్లు గెలుపు రుచి చూపించిన శ్రీకాకుళం టౌన్ పై మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించారట . గత రెండు ఎన్నికల్లోనూ టౌన్ లో చేపట్టిన క్యాంపెయినింగ్ తనను గెలిపించిందనే విషయం గుర్తుతెచ్చుకుని పాతూరూటే ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు క్యాడర్ తో టచ్ లో ఉంటూ, సమావేశాలు ,చర్చలతో ఇంటింటికీ ప్రచారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . రోజుకో వార్డు తిరుగుతూ నగర ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట . డోర్ టు డోర్ తిరుగుతూ ఫ్యాన్ పార్టీకి టౌన్ లో జీవం పోయడంతో పాటు గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వర్గాలను కలుపుకుని వ్యూహాత్మకంగా తన వైపు తిప్పుకునేందుకు అడుగులు వేస్తున్నారట.

దీంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పట్నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి . ఎన్నికలు సమీపిస్తున్న వేళ ధర్మాన ఇంటింటికీ ప్రచారం పై జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here