ఆ దృశ్యం చూసి అందరి కళ్లూ చెమర్చాయి. నటనకు ఆకాశమే హద్దుగా చిత్రపరిశ్రమను ఏలిన శ్రీదేవి దుబాయ్ దుర్ఘటనలో కన్నుమూశాక తల్లి జ్ఞాపకాల్లోనే బతుకుతున్న కూతుళ్లు…ఆమెకొచ్చిన అవార్డును అందుకోవడం చూసి అక్కడున్న అందరి గుండెలూ బరువెక్కాయి. తల్లి ప్రతిభకు మెచ్చి ఇచ్చిన అవార్డును తండ్రితో కలిసి స్వీకరించారు దివికేగిన అందాల తార శ్రీదేవి కూతుళ్లు.
తన సవతి కూతురిని ఓ మహిళ ప్రమాదంనుంచి తప్పించిన కథాంశంతో తెరకెక్కిన మామ్ చిత్రంలో అత్యుత్తమ అభినయాన్ని ప్రదర్శించింది శ్రీదేవి. ఈ చిత్రంలో శ్రీదేవి నటన ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఈ సిన్మాలో ఆమె నటకు జాతీయ అవార్డు వరించింది. కానీ దాన్ని అందుకోవడానికి శ్రీదేవి బతికిలేదు. ఓ తల్లిగా వెండితెరపై పాత్రలోనే కాకుండా, నిజజీవితంలోనూ ఎంతో సంఘర్షణపడ్డ శ్రీదేవికి వచ్చిన అవార్డును అందుకున్నారు కూతుళ్లు జాన్వీకపూర్, ఖుషీకపూర్లతో కలిసి బోనీకపూర్.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీదుగా అవార్డును అందుకునేందుకు శ్రీదేవి ధరించిన చీరలో వచ్చింది జాన్వీకపూర్. వేదికపై చీరకట్టుతో అచ్చం తల్లిని గుర్తుచేసింది. తల్లి ఉండి ఉంటే ఓ తల్లిపాత్రకు దక్కిన ఈ అవార్డుకు ఎంత సంతోషించి ఉండేదోనని కూతుళ్లు తలచుకున్నారు.