Home News Stories

అన్నీ వివాదాలే…ఎందుకిలా?


తెలియక చేస్తే పొరపాటు. తెలిసి చేస్తే గ్రహపాటు. ఏపీలో ఆధ్మాత్మిక వ్యవహారాల్లో పదేపదే వివాదాలు తలెత్తుతున్నా…తల తీసుకెళ్లి రోకట్లో పెడుతోంది వైసీపీ ప్రభుత్వం. నెల్లూరు నుంచి అంతర్వేది దాకా, వెంకన్న సన్నిధి నుంచి దుర్గమ్మ గుడిదాకా గడచిన ఏడాది కాలంలో ఏదో ఒక వివాదం ఎప్పుడూ నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. సున్నితమైన వ్యవహారంలో ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే…మరోసారి తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. కానీ అలవాటులో పొరపాటులో ఏపీలో మాత్రం ఏదో ఒక ఇష్యూ అవుతూనే ఉంది. మనం కొత్తగా సంప్రదాయాలు సృష్టించాల్సిన పన్లేదు. ఆనవాయితీగా తరాలుగా వస్తున్న పూజాపునస్కారాలు, ఆచారా వ్యవహారాల్లో లోటుపాట్లు తలెత్తుకుండా జాగ్రత్తపడితే చాలు. ఎక్కడ ఏ పద్ధతి మార్చినా, కొత్తగా మరో సంప్రదాయాన్ని తెచ్చి రుద్దాలని చూసినా…అనవసరంగా తేనెతుట్టెని కదిపినట్లే. ఏపీలో ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని…కోరి వివాదాలు కొని తెచ్చుకుంటున్నట్లే ఉంటున్నాయి. శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది ఏపీ సర్కారు.

ఇప్పుడిదో వివాదమై కూర్చుంది. రాష్ట్రంలోని ఆలయాల్నివ్యక్తి పూజలకు నిలయాలుగా మార్చేలా సర్కారు ఆదేశాలున్నాయనే నిరసన మొదలైంది. అసలే మన దేశంలో బోలెడన్ని మఠాలు. పీఠాలున్నాయి. మఠాధిపతులు, పీఠాధిపతుల్లో ఎవరు గొప్ప, ఎవరు పెద్దనే పోలికే రాకూడదు. ఎవరి ప్రాధాన్యం వాళ్లది. ఎవరి ప్రవచన విధానం వారిది. అందరినీ సమానంగా గౌరవించాల్సిందే. సమానదూరం పాటించాల్సిందే. కాదూ కూడదని ఎవరికైనా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తే…కచ్చితంగా వివాదానికి ఆజ్యం పోసినట్లే. ఏపీలో అదే జరుగుతోందన్న విమర్శలకు తావిచ్చేలా ఉన్నాయి ప్రభుత్వ ఆదేశాలు.

శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయాలని…ఏపీలోని అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఆదేశాలు జారీ చేశారు దేవాదాయ కమిషనర్. ఇటీవల స్వరూపానంద, పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్రలకు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్వయంగా స్వాగతం పలికి తిరుమల తీసుకువెళ్లారు. ఓ పీఠాధిపతికి అధికారిక స్వాగతంపై విమర్శలొచ్చాయి.

ఆ వివాదం చల్లారకముందే .. స్వరూపానంద విషయంలో మరో వివాదానికి తెరలేచింది. గతంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు… అలిపిరికి వెళ్లి మరీ స్వాగతం పలకడంపైనా విమర్శలొచ్చాయి. పీఠాధిపతి అయినా, ముఖ్యమంత్రి, ప్రధాని, రాష్ట్రపతిలాంటి ప్రముఖులకైనా తిరుమలలోనే అధికారులు స్వాగతం పలకడం ఆనవాయితీ. దాన్ని అతిక్రమించి అత్యుత్సాహం చూపుతుండటమే కొత్త వివాదాలకు కారణమవుతోంది.

పీఠాధిపతి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయాలంటూ ఆదేశాలిచ్చి కొరివితో తలగోక్కుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పరమత ప్రచారం, ఆలయ సంప్రదాయాల్లో లోపం వంటి వివాదాలతో తిరుమల పుణ్యకేత్రం తరచూ వార్తల్లో కనిపిస్తోంది. పృథ్వీరాజ్ నుంచి మొన్నటి ఎస్వీబీసీ వీడియోల గొడవల దాకా….ఏడుకొండలమీద ఎప్పుడూ లేనన్న వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతీ అడుగూ అప్రమత్తంగా వేయాల్సిన ప్రభుత్వం…శారదా పీఠాధీపతి జన్మదినంపై ఎందుకింత అత్యుత్సాహం ప్రదర్శించిందనే విమర్శలు మొదలయ్యాయి.

ఇటు జగన్.కి, అటు కేసీఆర్.కి విశాఖ శారదాపీఠాధిపతి మీద నమ్మకం ఉంది. తప్పేం లేదు. దర్శించుకోవచ్చు. ఆశీర్వచనం తీసుకోవచ్చు. ఆ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోవచ్చు. కానీ తనకు నమ్మకం ఉన్న పీఠాధిపతి జన్మదినని అధికారిక వేడుకలా జరపాలనుకోవడాన్నే చాలామంది ఆక్షేపిస్తున్నారు. సీఎం తలుచుకోవడమే తరువాయి.. స్వామివారికి ఆలయమర్యాదలు చేయాలంటూ 23 ప్రముఖ దేవాలయాలకు ఆదేశాలు జారీచేసింది ఏపీ దేవాదాయశాఖ. సీఎం తెలిసి చేస్తున్నారో ,తెలియక చేస్తున్నారో… లేదా ఆయన మెప్పుకోసం చుట్టూ ఉన్నవారు ఇలా జరిపించేస్తున్నారోగానీ…ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాలకు విరుద్ధంగా వెళ్లడం ఇబ్బందికరమే కాదు…ఎప్పుడైనా ప్రమాదకరమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here