Home News

ఎవరి స్పీకర్ రమేశ్ కుమార్‌…కన్నడ సంక్షోభం ఎందాక…?

గత రెండు వారాలుగా మొత్తం దేశం కర్ణాటక వైపే చూస్తోంది.. క్షణానికో మలుపు.. రోజుకో ట్విస్ట్‌తో కన్నడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి… సభ వాయిదా పడటంతో ఆ సంక్షోభానికి ఎండ్‌ కార్డ్‌ ఇంకా పడలేదు.. అంత టెన్షన్‌లోనూ అందరి దృష్టి ఒక్కిరపైనే ఉంది.. ఆయనే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ .. ఆయన స్కూలే డిఫరెంట్‌ … రూల్స్‌ పేరుతో అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు .. గవర్నర్‌ సూచనలకంటే నిబంధనలే ముఖ్యమంటూ సభాపర్వం కొనసాగిస్తున్న రమేష్‌ కుమార్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ అవుతున్నారు..

కె. రామప్ప రమేశ్ కుమార్‌ …. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ .. ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు .. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది .. స్పీకర్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టారు.. అన్నిటికంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆయనకు నటనా అనుభవం కూడా ఉందండోయ్‌ .. సిల్వర్‌ స్క్రీన్‌తో పాటు బుల్లితెరపై కూడా ఆయన హావభావాలు ప్రదర్శించారు ..

సినీ నటుడిగా కూడా రమేష్‌ కుమార్‌కు కన్నడ ప్రజల్లో ఎంతో పేరుంది … ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు… దీంతో రాజకీయాలకు కొంత విరామమిచ్చి.. సినీ రంగ ప్రవేశం చేశారు… తొలుత సీరియళ్లలో నటించిన ఆయన.. కొన్ని సినిమాల్లోనూ కన్పించారు… ఒక సూపర్‌ హిట్‌ సీరియల్‌లో న్యాయమూర్తిగా నటించి తన హావభావాలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించారు…

యూత్‌ కాంగ్రెస్‌ సభ్యుడిగా కాంగ్రెస్‌ పార్టీలో చేరి .. అనతి కాలంలోనే యువ నాయకుడిగా ఎదిగిన కెఆర్‌ రమేష్‌కుమార్‌ దూకుడు చూసి.. 1978లో అప్పటి ముఖ్యమంత్రి దేవరాజ ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో శ్రీనివాసపూర్‌ నియోజకవర్గం నుంచి గెలిచి తన 29ఏళ్ల వయసులోనే తొలిసారిగా శాసనసభకు అడుగుపెట్టారు… ఆ తర్వాత 1985లో రమేష్‌ జనతాదళ్‌ పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందారు.

2004లో తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరిన రమేష్‌ అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. శ్రీనివాసపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన రమేష్‌కుమార్‌ను ఆ నియోజకవర్గ ప్రజలు ‘స్వాములు’ అని అభిమానంగా పిలుచుకుంటారు… 1994-99 మధ్య రమేష్‌ తొలిసారిగా స్పీకర్‌ బాధ్యతలు చేపట్టారు… ప్రస్తుతం కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో మరోసారి స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు…

తాజాగా కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది… సీఎం కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది… అయితే రోజులు గడుస్తున్నా విశ్వాస పరీక్ష ఎటూ తేలకపోవడంతో గవర్నర్‌ జోక్యం చేసుకుని రెండు సార్లు గడువిచ్చారు. అయితే ఆ గడువును పట్టించుకోకుండా రమేష్‌ కుమార్‌ సభను వాయిదా వేస్తూ‌ వస్తున్నారు. గవర్నర్‌ ఆదేశించినా సరే సభా నిబంధనలు మార్చుకోలేనని కరాఖండిగా చెప్పి సంచలనం సృష్టిస్తున్నారు…

తాజా సంక్షోభంలో ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించకపోవడం.. గవర్నర్‌ సూచనలు చేసినా బలపరీక్ష పెట్టకపోవడం, నిబంధనలే ముఖ్యమంటూ దూసుకెళ్లడంతో ఇటీవల రమేశ్ కుమార్‌ పేరు మార్మోగిపోయింది… టివి సీరియల్లో న్యాయమూర్తిగా యాక్ట్‌ చేసిన ఎఫెక్టో ఏమో.. నేను చెప్పిందే ఫైనల్ అంటున్నారాయాన .. స్పీకర్‌ పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ ప్రతిపక్షం ఆయనపై ఆరోపణలు చేస్తున్నా.. తనను ఒత్తిడి చేసే వ్యక్తే ఇంతవరకూ పుట్టలేదంటూ పంచ్‌ డైలాగ్‌లు వినిపిస్తున్నారు ..

అయితే వివాదాలు ఆయనకు కొత్తేం కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆడియో టేపుల ఎపిసోడ్‌ కర్ణాటకలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే… ఆపరేషన్‌ కమలంకు సంబంధించిన ఆడియో టేపులను ముఖ్యమంత్రి కుమారస్వామి అసెంబ్లీలో విడుదల చేశారు. వీటి గురించి మీడియా రమేశ్ కుమార్‌ను పశ్నించగా.. తన పరిస్థితి అత్యాచార బాధితురాలికంటే దారుణంగా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు… ఆ తర్వాత పార్టీ ఒత్తిడితో క్షమాపణ చెప్పారనుకోండి..

ఇది జరిగిన కొద్ది రోజులకు అప్పటి కాంగ్రెస్‌ ఎంపీ మునియప్పతో రమేష్‌కుమార్‌కు ఉన్న అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి … మునియప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న కోలార్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోనే రమేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్‌ కూడా ఉంది… వీరి మధ్య చాలా కాలంగా గొడవలున్నాయి… దీని గురించి మీడియా అడిగిన ప్రశ్నకు మునియప్ప బదులిస్తూ.. ‘రమేశ్‌కు నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దం భార్యాభర్తల్లాంటి వాళ్లం’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలకు రమేశ్‌..’నేను మగాళ్లతో పడుకోను. నాకు ఓ భార్య ఉంది’ అని సినిమా స్టైల్లో రియాక్ట్‌ అయ్యారు .. ఇప్పుడు సంక్షోభ సమయంలో .. అంతా నా ఇష్టం అన్నట్లు దూసుకుపోతున్నారు .. చూడాలి యాక్టింగ్‌ అనుభవం అపారంగా ఉన్న కర్ణాటక స్పీకర్‌ ఈ సంక్షోభాన్ని ఏ మలుపు తిప్పుతారో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here