Home Entertainment Cinema

ఎస్పీ బాలుకు ఘనంగా స్వర నీరాజనం

శ్రీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే అందరికి తెలియకపోవచ్చు .. కానీ ఎస్పీ బాలు అంటే చాలు.. మధురమైన గీతాలే గుర్తొస్తాయి. ఒక్క తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు బాలు! బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన లేని లోటు ఎప్పటికి తీర్చ లేనిది. జూన్ 4న శుక్రవారం ఆయన 75వ పుట్టినరోజు. ఆయన జయంతి సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు ఘన నివాళులర్పించింది.

‘ఎస్పీ బాలుకు స్వరనీరాజనం’ కార్యక్రమాన్ని డైలాగ్ కింగ్ సాయికుమార్ దీపోత్సవగీతంతో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. జీవితారాజశేఖర్, ఆర్పీపట్నాయక్, కేఎల్ దామోదర్ ప్రసాద్, ఎన్ శంకర్, ప్రసన్నకుమార్, సురేష్ కొండేటి తదిరుతలు బాలుగారి చిత్ర పటానికి దీపారాధన నిర్వహించారు. అనంతరం యువ గాయనీ గాయకులు బాలుకు నివాళులర్పిస్తూ గీతాలాపన చేశారు.

ఈ కార్యక్రమంలో సాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో గాయకుడిగా, గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా 29 నంది అవార్డులు, 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన పాడిన తొలి చిత్రం ‘మర్యాదరామన్న’. అందరూ మాట మీద నిలబడితే ఈ గానగంధర్వుడు పాట మీద నిలబడతారు. ఆంధ్రులు మరచిపోలేనివి ఎన్నో ఉన్నాయి. వాటిలో రెండు నన్నయ్య కంఠం, అన్నయ్య కంఠం. ఆబాలగోపాలాన్ని తన మధుర గాత్రంతో అలరించిన ఆ మహా గాయకుడి 75వ జయంతి సందర్భంగా ఈ రోజును బాలుగారికి అంకితం చేసి చిత్రసీమ స్వరనీరాజనం తెలుపుతోంది.’’ అంటూ మెగాస్టార్ చిరంజీవిని మాట్లాడాలని ఆహ్వానించారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘‘మనందరికీ అభిమాన పాత్రుడైన మన అందరి అన్నయ్య ఎస్పీ బాలుగారి జయంతిని అందరూ కలిసి ఒక వేదికపై ఘనంగా సెలబ్రేట్ చేయలేకపోతున్నామనే బాధగా ఉంది. ఈ 75వ జయంతి సందర్భంగా మీ అందరితో పాటు నేను కూడా ఇలా నివాళులర్పిస్తున్నా. అన్నయ్యతో నాకు 1980 నుంచి సాన్నిహిత్యం ఉంది. కుటుంబ పరంగా, సినిమా పరంగా బాగా దగ్గరగా ఉండేవాళ్లం. నేను బాలుగారు అంటే ఆయనకు నచ్చదు. అన్నయ్య అని పిలవమనేవారు. నా సినిమాలకు పాటలు పాడాలంటే ఆయన ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఆయన గాత్రానికి నా బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేసేందుకు చాలా కష్టపడ్డాను. నా సినిమా జీవితంలో నా సక్సెస్‌కి సగం దోహదపడ్డ బాలుగారికి నేను నివాళుర్పిస్తున్నా. స్టాలిన్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వరకు ఆయన నా సినిమాలకు పాడారు. అందుకే నా సక్సెస్‌లో ఆయనకు సగభాగం ఇస్తా అన్నారు.

ఎస్పీ చరణ్ మాట్లాడుతూ..‘‘ఇంత గొప్ప కార్యక్రమం నాన్నగారు ఉన్నప్పుడు జరిగుంటే ఆయన ఎంతో సంతోషించేవారు. అందరూ ఇలా కలిసి ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో చిరంజీవిగారు పాల్గొన్నందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ చెప్తున్నట్టుగానే నాన్నగారు పై నుంచి మనకు ఆశీర్వాదాలు అందిస్తుంటారు. ’’ అన్నారు. కళాతపస్వి కే విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘‘బాలసుబ్రహ్మణ్యం కారణ జన్ముడు, అమరగాయకుడు. మళ్లీ నేను సినిమా తీస్తే పాటలు ఎవరు పాడుతారు అని అనిపించే లోటును క్రియేట్ చేసిన మహా వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అది జన్మజన్మలకు ఒక రుణానుబంధంగా ఉండిపోతుంది.’’ అన్నారు.

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ..‘‘మామూలుగా పాటకు ప్రాణం పల్లవి అంటారు. కానీ నా దృష్టిలో బాలు గాత్రమే పాటకు, పల్లవికి ప్రాణం. రక్తి గీతమైనా, భక్తి గీతమైనా ఏది పాడాలన్నా బాలు ఒక్కడికే సాధ్యం. అలాంటి బాలు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మా ఇద్దరిదీ 50 ఏళ్ల అనుబంధం. ఎంతో ప్రేమగా రాఘవా అని పిలిచేవాడు. ఇప్పటికీ అతని మాటలు నాకు వినిపిస్తుంటాయి. భక్తి పాటలు పెట్టినప్పుడల్లా అతని గొంతు వినిపిస్తుంటుంది. బాలు ఎప్పటికీ మనతోనే ఉంటాడు. అతని సంగీతం వింటూనే ఉంటాము.’’ అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..‘‘బాలు గారి గురించి మాట్లాడడానికి నాకు వయసు, అనుభవం ఏమీ సరిపోవు. ఆయనతో నాకు ఎక్కువ అనుబంధం లేదు. ఎందుకంటే నేను వచ్చేలోపే ఆయన ట్రాకులు పాడి వెళ్లిపోవడం, లేదా ఆన్‌లైన్‌లో పాడి పంపించడం జరిగేది. ఆయనతో ఎక్కువ కలవలేకపోవడాన్ని రిగ్రెట్‌గా ఫీలవుతున్నా. ‘అతడు’ సినిమాకు నాజర్ క్యారెక్టర్‌కు ఆయనతోనే డబ్బింగ్ చెప్పించా. ఆ టైమ్‌లో కమల్ హాసన్ లాంటి స్టార్లకు మాత్రమే ఆయన చెప్పేవారు. కానీ నాకోసమే ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఎంత సాధించినా చాలా సింపుల్‌గా ఉంటారు. సినిమా క్రాఫ్ట్ మీద ఉన్న అండర్‌స్టాండింగ్‌తో ఆయన అందరికంటే ప్రత్యేకంగా మారారు.

నేను శైలజ అనే సింగర్ ఉన్నానంటే కారణం .. ఆయనే. నేను చిన్నప్పటినుండి ఆయనతోనే పెరిగాను. ఇండస్ట్రీ లో ఎలా నడుచుకోవాలి అన్ని తండ్రిగా చుకున్నారు. ప్రతి విషయంలో ఆయనను చూసే నేర్చుకునేదాన్ని. ఇంతమంది అయన గురించి గొప్పగా మాట్లాడడం నిజంగా ఆనందంగా ఉంది. ఆయనతో నాకు చాలా విషయాలు ఉన్నాయి.. పంచుకున్నవి. అయన పక్కన లేడన్న దిగులు లేదు నాకు … ఎప్పుడు నా పాటలో ఉంటాడు .. నా నోట్స్ లో ఉంటాను.. నా మైక్ లో ఉన్నాడు .. నాలోనూ ఉన్నాడు. తాను ఎప్పుడుఅందరికి స్ఫూర్తిగా ఉంటాడు .. నేను కూడా ఆయనలా స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటాను.. సీనియర్ నటులు మురళీమోహన్ మాట్లాడుతూ .. ఇలాంటి ఒక రోజు వస్తుందని కానీ, ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తామని అనుకోలేదు. ఏంతో బంగారు భవిష్యత్తు ఉన్న బాలుగారు ఇంత త్వరగా వెళ్ళిపోతారని అనుకోలేదు. అయన 75 వ జయంతిలో పాల్గొనటం అన్నది చాలా బాధాకరం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here