Home Entertainment Cinema

దివి నుంచి భువికెగిసిన గాన గంధర్వుడి జయంతి

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన గొంతులో మేజిక్‌ ఉంటుంది. బాలు ఏ భాషలో పాడినా.. ఎంతో మధురంగా ఉంటుంది. మాయ చేస్తుంది..! అందుకే అలసిపోని ఆయన గొంతు.. చివరి శ్వాస వరకు పాడుతూనే ఉంది. ప్రేక్షకులను అలరించింది. తెలుగు, తమిళం, కన్నడ భాషలే కాదు.. హిందీలోనూ బాలు పాట గానామృతంలా సాగింది. ఆయా భాషలో ఏకంగా 40 వేలకు పాటలు పడిన గాయకుడు ఎస్పీ బాలు. ఆయనకు ఎట్టకేలకు కేంద్రం దేశ రెండో అత్యుతన్న పురస్కారం పద్మ విభూషణ్‌ అవార్డుతో గౌరవించింది.

బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4న నెల్లూరులో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. ఇంజనీరింగ్‌ చదవాలని అనుకున్నా.. అక్కడి వాతావరణం నచ్చక మధ్యలోనే వదిలేశారు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరారు. ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా జీవితం ప్రారంభించారు. 1969 నుంచి బాలుకి గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు వచ్చాయి. ఆయన పాటలు అప్పటి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

పాడటమే కాదు.. సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ఒక అరుదయిన రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో 29 సార్లు నంది పురస్కారాన్ని అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసారు.

కేంద్ర ప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు నంది ప్రత్యేక బహుమతి లభించింది. వెండి తెరతో పాటు బుల్లి తెరపై అలరిస్తోన్న బాలును కరోనా మింగేసింది. మహమ్మారి నుంచి బయటపడ్డా.. అప్పటికే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సెప్టెంబర్‌ 25న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికంగా వెళ్లిపోయినా.. ఆయన పాట మాత్రం అందరి మధ్యే ఉంది.. అన్ని వర్గాల వారిని అలరిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here