Home Health corona

కరోనాతో మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ మృతి

మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ కరోనాతో కన్నుమూశారు. దేశంలో అత్యంత ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరిగా సోరాబ్జీ గుర్తింపు తెచ్చుకున్నారు. రెండుసార్లు అటార్నీ జనరల్‌గా సేవలందించిన సోరాబ్జీ, మానవహక్కుల లాయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కొవిడ్‌ మహమ్మారితో ప్రఖ్యాత న్యాయనిపుణుడు, మాజీ అటార్నీ జనరల్‌ సోలీ జహంగీర్‌ సోరాబ్జీ మరణించారు. ఢిల్లీలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

1930లో ముంబయిలో జన్మించిన సోరాబ్జీ 1953లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. 1971లో సుప్రీంకోర్టు ఆయన్ను సీనియర్‌ అడ్వకేట్‌గా గుర్తించింది. 1989-90, 1998-2004 మధ్య భారత అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సోరాబ్జీ మానవ హక్కులపై విశేష కృషి చేశారు. 1997లో నైజీరియాలో మానవ హక్కుల పరిస్థితిపై అధ్యయనం కోసం ఐక్యరాజ్య సమితి ఆయనను ప్రతినిధిగా పంపింది. యూఎన్‌ వో ప్రమోషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఉప సంఘానికి ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించారు.

వాక్‌ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన పలు కీలక కేసుల్లో సొరాబ్జీ తన వాదనలు వినిపించారు. అందులో భాగంగా అనేక ప్రచురణలపై నిషేధాన్ని ఎత్తివేయించారు. దీనిపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేసిన ఆయన లా ఆఫ్‌ ప్రెస్‌ సెన్సార్‌షిప్‌ ఇన్‌ ఇండియా, ద ఎమర్జెన్సీ, సెన్సార్‌షిప్‌ అండ్‌ ది ప్రెస్‌ ఇన్‌ ఇండియా వంటి పుస్తకాలను రచించారు. మనేకా గాంధీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, బీపీ సింఘాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా వంటి ల్యాండ్‌మార్క్‌ కేసుల్లో సోరాబ్జీ తన వాదనలు వినిపించారు. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here