కరోనాతో పోటీపడి తెలంగాణ మినీ మున్సిపోల్స్‌లో ప్రచారం చేశాయి ప్రధాన పార్టీలు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ముగియడంతో.. వ్యక్తిగతంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు అభ్యర్థులు, నాయకులు. ఓ పక్క రేపు పోలింగ్ కి ఏర్పాట్లు జరుగుతుండగా ప్రత్యర్థులను విమర్శించడానికి, గెలిస్తే తామేం చేయబోతున్నామో చెప్పడానికి సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు అభ్యర్థులు. ఇక సిద్దిపేటలో బీజేపీ సోషల్ టీం మంత్రి హరీశ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

సోషల్ మీడియా యుద్ధం సిద్ధిపేటలో ఓ రేంజ్లో జరుగుతోంది. టీఆర్ఎస్ కీలకమంత్రి హరీశ్ రావుకు కంచుకోటలాంటి సిద్దిపేటలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య సోషల్ ఫైట్ శ్రుతి మించుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. సిద్ధిపేట పరిధిలోని ఓటర్లలో దాదాపు 38 శాతం మంది యువతే. అలాంటి వారిని గుర్తించి.. ప్రతి పది మంది యువ ఓటర్లకు ఒక ఇంఛార్జ్‌ను పెట్టుకున్నాయట పార్టీలు. ఈ సందర్భంగా ఓటర్లను కొన్ని విభాగాలుగా విభజించారట. ఖచ్చితంగా తమకే ఓటు వేస్తారు అని అనుకున్న వాళ్లను పక్కన పెట్టేశారట. న్యూట్రల్‌గా ఉన్నవారిపై గట్టిగా వర్కవుట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మనకు ఓటేయారు అనుకున్నవాళ్లను దృష్టిలో పెట్టుకుని కౌంటర్ అటాక్ చేస్తున్నారట.
హామీలు అమలు చేయలేకపోతే మళ్లీ ఓటు అడగబోనని సోషల్ మీడియా వేదికగానే హామీ ఇస్తున్నారట కొందరు అభ్యర్థులు. అయితే సోషల్ మీడియా ఫ్లాట్ ఫారంపై ఓటర్లు కూడా అప్డేట్ అయ్యారని చెబుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి.. ఎవరేం చేస్తారో ఇప్పుడే చెప్పేయండి అని చాకిరేవు పెడుతున్నారట. ఇందులో అడుగుతున్న ప్రశ్నలకు అభ్యర్థుల్లో కొందరు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు సమాచారం. మొత్తానికి పోలింగ్‌కు ముందు ఈ కొత్త స్ట్రాటజీ కొందరికి వర్కవుట్ అవుతుంటే.. ఇంకొందరికి చుక్కలు చూపిస్తోందట. అయితే ఈ సోషల్ మీడియా వార్ ఎన్నికల వరకు పరిమితమైతే ఫర్వాలేదని.. వ్యక్తిగతంగా తీసుకుని.. ఫలితాల తర్వాత ఇంకోలా టర్న్ తీసుకుంటే ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.