Home News Politics

గాంధీ,భవ్య మధ్య బిగ్ ఫైట్…సెటిలర్స్ అడ్డాలో గెలుపెవరిది…?

రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నియోజకవర్గం.. కోట్లు కుమ్మరించడానికి సైతం వెనకాడని అభ్యర్థులు.. సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతం.. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన సెగ్మెంట్‌ కూడా ఇదే…ఇన్ని స్పెషాలిటీలు ఉన్న ఆ నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఇక్కడ గులాబీ,పసుపు పార్టీల మధ్య హోరాహోరి పోరు నడుస్తుంది. ఒకరికి అధికార పార్టీ అండదండలు ఉంటే మరొకరు చంద్రబాబు చాణక్యం పై ఆధారపడ్డారు. పొత్తుల ఎత్తుల్లో భాగంగా ఇక్కడ హస్తం పార్టీతో సైకిల్ సవారి చేస్తుండగా కారు పార్టీ సింగిల్ గా బరిలో దిగి సవాల్ విసురుతుంది. బిగ్ షాట్స్ మధ్య జరుగుతున్న ఈ సీట్ ఫైట్ పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ రిపోర్ట్….

ఐటీ హబ్‌… ఖరీదైన కాలనీలు.. భిన్న ప్రాంతాలు, వర్గాల ప్రజలుండే విభిన్న నియోజకవర్గం ఇది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు కలిగిన అతిపెద్ద శేరిలింగంపల్లిలో టీఆర్‌ఎస్‌, టీడీపీ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. హైటెక్‌సిటీతో పాటు ఐటీ కారిడార్‌, కొండాపూర్‌, మాదాపూర్‌ వంటి ఖరీదైన ప్రాంతాలున్న శేరిలింగంపల్లిలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన అరెకపూడి గాంధీ 75,904 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సత్తా చాటారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే గాంధీ కారు ఎక్కారు. తమ అభ్యర్థిని గెలిపించేందుకు మాజీ మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగడంతో రాజకీయ వేడి రాజుకుంది.

శేరిలింగంపల్లి నియోజకవర్గం తరపున బరిలో దిగిన అభ్యర్థుల వివరాల్లోకి వెళితే… గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన అరెకపూడి గాంధీ ఓ వైపు… సినీ గ్లామర్‌ నేపథ్యంతో రంగంలోకి దిగిన భవ్య ఆనందప్రసాద్‌ మరోవైపు.. నువ్వా నేనా తేల్చుకుందాం అంటున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే గాంధీ వందల కోట్లకు అధిపతి! రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బిల్డర్ గా,ట్రాన్స్ ఫార్మర్ల కంపెనీ అధినేతగా ఉన్నారు. టీడీపీ తరపున టికెట్ పొందిన వెనిగళ్ల ఆనందప్రసాద్ భవ్య క్రియేషన్స్,భవ్య సిమెంట్ భవ్య రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వేల కోట్లకు పడగలెత్తారు. బీజేపీ తరపున బరిలో దిగిన యోగానంద్ కూడా మైన్స్,ఫైనాన్స్ వ్యాపారాలతో మిలియనీర్ గా ఉన్నారు.

తమ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన గాంధీని ఓడించాలని టీడీపీ పట్టుదలతో ఉంది. సెటిలర్లు మా వెంటే ఉన్నారని నిరూపించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. మొదటిసారి బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి యోగానంద్‌ కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. బీఎల్‌ఎఫ్‌ తరఫున తాండ్ర కుమార్‌ పోటీ పడుతున్నారు. ఇక్కడ అత్యధిక ఓటర్లు సీమాంధ్రులే కావడంతో.. వాళ్లు ఎటువైపు మొగ్గుతారన్న దానిపైనే గెలుపోటములు ఆధారపడ్డాయి. అభ్యర్థులిద్దరూ భారీ ఖర్చుకు వెనుకాడరనే పేరు ఉండడంతో పోటీ హోరాహోరీగా మారింది. ఈ సీటుపై బెట్టింగులు కూడా పెద్దఎత్తున సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీకి దిగింది. ఐటీ కంపెనీలలో పనిచేస్తున్న కొందరు సీమాంధ్ర ఓటర్లపై ఆశ పెట్టుకుంది.

టీడీపీకి బలమైన క్యాడర్‌తో పాటు పార్టీకి అనుకూలమైన సామాజికవర్గం నేతలు అధిక సంఖ్యలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నియోజకవర్గంలో సైబరాబాద్‌, హైటెక్‌సిటీ నిర్మాణం, న్యాక్‌లాంటి ఉపాధి కల్పన సంస్థలు ఏర్పడ్డాయి. రియల్‌రంగం ఉపందుకోవడానికి కూడా అప్పట్లో ఏర్పడిన ఐటీహబ్‌ ఒక కారణం. కాంగ్రెస్‌ పార్టీ అండదండలు ఉండటంతో ఈ పరిణామాలన్నీ టీడీపీకి కలిసొస్తాయని ఆనందప్రసాద్‌ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే మెజార్టీ పార్టీ శ్రేణులను తనవైపు తిప్పుకోవడంలో ఆయన సఫలీకృతులయ్యారు. నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అనే ప్రచారం,క్యాడర్‌, పార్టీ నాయకులతో సమన్వయలోపం గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఓటమి ఆనంద్ ప్రసాద్ కి ప్రతికూలంగా మారాయి.

టీఆర్ఎస్ అభ్యర్ధి అరెకపూడి గాంధీ 4 వేల కోట్లతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తనకు ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొనిపోవడం, కార్పొరేటర్లందరూ టీఆర్‌ఎస్‌వారే కావడం ఇక్కడ గాంధీకి కలిసొచ్చే అంశం. నియోజకవర్గంలో ఉన్న పార్టీ మద్దతుదారుల్లో గాంధీ పట్ల కొంత వ్యతిరేకత టీఆర్‌ఎస్‌ పార్టీకి పటిష్ఠమైన క్యాడర్‌ లేకపోవడం ఇక్కడ మైనస్ గా మారాయి.

నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలను గమనిస్తే ఇక్కడ రెండు పార్టీల్లో టిక్కెట్ కోసం చాలమంది నేతలు పోటీపడ్డారు. సిట్టింగ్ అభ్యర్ధులకే తిరిగి టిక్కెట్లు ఇవ్వడం ద్వారా గాంధీ తిరిగి టిక్కెట్ దక్కించుకోగా సినీహీరో బాలకృష్ణతో ఉన్న సాన్నిహిత్యం ఆనంద్ ప్రసాద్ కి టిక్కెట్ దక్కేలా చేసింది. ఇక్కడ ఈ ఇద్దరు అభ్యర్ధులకు అసంతృప్తులు సహకరించేదాన్ని బట్టి వీరి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రోజు రోజుకి రంగులుమారుతున్న ఇక్కడ రాజకీయం ఎవరిని గట్టేక్కిస్తుందన్నది మరో 10 రోజుల వరకు వేచి చూడాల్సిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here