Home Entertainment Cinema

వాడుకుని వ‌దిలేయ‌డంలేదుగా..

స‌రోజ్‌ఖాన్ నోట సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

క్యాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌ల‌తో టాలీవుడ్ షేక్ అవుతున్న వేళ…పెద్ద పెద్ద న‌టులే ఈ గొడ‌వ మ‌న‌కెందుక‌నో..మ‌నం ఆ రొంపికి దూరంగా ఉన్నామ‌నో ఎవ‌రికి వారు మౌనంగా ఉన్న స‌మ‌యంలో మ‌హిళై ఉండీ ధైర్యంగా ముందుకొచ్చింది జీవితా రాజ‌శేఖ‌ర్‌. నానాయాగీ చేస్తున్న శ్రీరెడ్డి మొహంమీద కొట్టేలా స‌మాధానం ఇవ్వ‌డ‌మే కాదు..ఈ క్యాస్ట్ కౌచింగ్‌కి ఏ రంగం మిన‌హాయింపంటూ సూటిగా ప్ర‌శ్నించింది. నిజ‌మే…పాలిటిక్స్ నుంచి ఫిల్మ్ ఇండ‌స్ట్రీదాకా సూక్ష్మ ప‌రిశోధ‌న మొద‌లుపెడితే గొంగ‌ట్లో వెంట్రుక‌లేరుకున్న‌ట్లే. ఆ మాట‌కొస్తే చిన్న పాయింట్ దొరికితే చించి చేట‌చేసే మీడియాని కూడా మిన‌హాయించ‌లేం.
మంచికో..చెడుకో శ్రీశ‌క్తిన‌ని చెప్పుకునే శ్రీరెడ్డి మొద‌లుపెట్టిన వివాదం టాలీవుడ్‌కే ప‌రిమితం కాలేదు. అన్ని ఉడ్‌ల‌లో దీనిపై చ‌ర్చ మొద‌లైంది. ఆమ‌ధ్య శాండిల్ ఉడ్‌(క‌న్న‌డ ఇండ‌స్ట్రీ)లో భావ‌న అనే హీరోయిన్‌ని కిడ్నాప్‌చేసి అఘాయిత్యానికి పాల్ప‌డటం, దీనివెనుక ఓ హీరో కుట్ర ఉండ‌టం సంచ‌ల‌నం రేపింది. అదృష్ట‌వ‌శాత్తూ మ‌న టాలీవుడ్ ఆ స్థాయికింకా వెళ్లలేదు. డేటింగ్‌లే సాధార‌ణ విష‌యంగా మారిపోయిన ఈరోజుల్లో ఛాన్స్ ఇస్తే నాకేంట‌నో, అవ‌కాశ‌మిస్తే కాద‌న‌న‌నో ప‌ర‌స్ప‌ర అంగీకారంతో కొన్ని జ‌రిగిపోతే దానిమీద ఎంత అర‌చిగోలపెట్టినా ఏం లాభం?

టాలీవుడ్‌లో మొద‌లైన క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం బాలీవుడ్‌లోనూ బ్రేకింగ్‌న్యూసే. అక్క‌డ ఇలాంటి వ్య‌వ‌హారాల‌తోనో కొంద‌రు హీరోలు, హీరోయిన్ల సంసారాలు విడాకులదాకా కూడా వ‌చ్చాయి. అలాంటి ఇండ‌స్ట్రీలో పాపుల‌ర్ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్‌ఖాన్ క్యాస్టింగ్ కౌచ్ మీద పెద‌వి విప్ప‌టం, ఇండ‌స్ట్రీలో స‌ర్వ‌సాధార‌ణ‌మేన‌నీ, త‌ప్పుప‌ట్టాల్సిన ప‌న్లేద‌ని స‌మ‌ర్ధించ‌డం సంచ‌ల‌నం కాక మ‌రేంటి. వాడుకుని వ‌దిలేయ‌డం లేదుగా…సిన్మా ఇండ‌స్ట్రీ క‌నీసం ఉపాధి క‌ల్పిస్తోందని బోల్డ్‌గా మాట్లాడేసింది స‌రోజ్‌ఖాన్‌. స‌హ‌జంగానే గ్లామ‌ర్ ఫీల్డ్‌లో అంద‌మైన అమ్మాయిని కొంద‌రు వ‌శ‌ప‌రుచుకోవాల‌ని చూస్తారు. వెళ్లాలో లేదో వారిష్ట‌మ‌ని సీనియ‌ర్ మోస్ట్ కొరియోగ్రాఫ‌ర్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది.

వృద్ధ‌నారీ ప‌తివ్ర‌త‌నే మాట వాడ‌టం బాగోదుగానీ..69 ఏళ్ల స‌రోజ్‌ఖాన్ త‌న అనుభ‌వంలో ఎన్ని వేల‌మంది న‌టీన‌టుల్ని ఇండ‌స్ట్రీలో చూసుంటుంది. తెర‌వెనుక ఎవ‌రు ఎలా ఉంటారో, ఎప్పుడు ఏమేంచేస్తుంటారో ఏళ్లుగా చూసీచూసీ ఆమె త‌ల‌పండిపోయింది. జీర్ణించుకోవ‌డం క‌ష్ట‌మే అయినా స‌రోజ్‌ఖాన్ మాట నూటికి నూరుపాళ్లు నిజం. ఉద్యోగాలు ఇప్పిస్తామ‌నీ..ఉపాధి చూపిస్తామ‌నీ..ప్ర‌మోష‌న్లు ఇస్తామ‌నీ ప్ర‌భుత్వంలో ఉన్న‌వాళ్లూ ఇదే ప‌నిచేస్తున్నార‌న్న స‌రోజ్‌ఖాన్ సిన్మా ఇండ‌స్ట్రీ క‌నీసం ఉపాధి అయినా క‌ల్పిస్తోంద‌ని…న‌మ్ముకున్న‌వారిని వంచించ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. స‌రోజ్‌ఖాన్ వ్యాఖ్య‌ల‌తో ఆమెమీద గౌరవం పోయిందంటోంది శ్రీరెడ్డి. మ‌రి జీవితా రాజ‌శేఖ‌ర్ ప్ర‌శ్న‌ల‌కు త‌ను జ‌వాబు చెప్పాలిక‌దా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here