Home News Politics

సనత్ నగర్ లో కారుతో సైకిల్ సవారీ…!

హైదరాబాద్‌లో కీలకమైన నియోజకవర్గం. సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, మంత్రుల్ని అందించిన సెగ్మెంట్. ఒకప్పుడు రాజకీయ చైతన్యానికి, ఉద్యమ స్ఫూర్తికి కేంద్రం. మారుతున్న నగరంతో పాటే రాజకీయ, సామాజిక పరిస్థితులు ఇక్కడ మారాయి. ఇప్పుడు అధికార పార్టీ- ప్రజా కూటమి అభ్యర్థులు హోరాహోరి పోటీ నెలకొంది. ఒకప్పుడు వన్ సైడ్ అనుకున్న పరిస్థితి కాస్తా… ఇప్పుడు మారుతోందా?. మంత్రిగా పని చేసిన తలసాని పరీక్ష పెడుతోందా ?. సనత్ నగర్ రాజకీయ ముఖచిత్రం పై తెలుగు పాపులర్ టీవీ స్పెషల్ రిపోర్ట్….

సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే సనత్‌ నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌….1969 లో ఏర్పడింది. ఇక్కడ 5సార్లు కాంగ్రెస్‌, 3సార్లు టీడీపీ గెలిచాయి. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, ఆయన కుమారుడు శశిధర్‌రెడ్డి సనత్‌నగర్ నుంచే ప్రాతినిధ్యం వహించారు. 2లక్షల 20వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది స్థానికేతరులే. బేగంపేట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌ వంటి వాణిజ్య ప్రాంతాలు, సనత్‌నగర్‌, బల్కంపేట లాంటి పారిశ్రామిక ప్రాంతాలు ఈ పరిధిలోకే వస్తాయి. అటు క్లాస్‌, ఇటు మాస్‌…. అటు వ్యాపారం, ఇటు పరిశ్రమలు…. ఇలా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ.

నియోజకవర్గంలో మొత్తం దాదాపు రెండు లక్షల 20వేల,969 ఓట్లు ఉన్నాయి. వీటిలో బీసీ ఓటర్లు లక్ష మంది ఉన్నారు. సీమాంధ్ర ఓటర్లు 80వేల మంది ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలో సీమాంధ్ర ఓటు బ్యాంక్ కీలకం కానుంది. ముదిరాజ్ వర్గీయులూ 12వేల మంది, గౌడ, యాదవులు 40వేల ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సాలిడ్‌గా పదివేల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఎన్నికల ప్రకటన నాటికి ప్రస్తుతానికి పరిస్థితులు మారాయి. సనత్‌నగర్‌లో రాజకీయం రోజు రోజుకీ మారుతోంది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తలసాని శ్రీనివాస యాదవ్ గెలిచారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో టీఆర్ఎస్‌లో చేరారు. మంత్రి పదవి చేపట్టారు. తలసాని మంత్రి పదవి చేపట్టిన తర్వాత.. సనత్‌నగర్‌తోపాటు నగరంలో పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో… రెండోసారి మంత్రి అయిన తరవాత నగర రాజకీయాల్లో దూసుకుపోయారు. తలసాని టీఆర్ఎస్‌లో చేరడం, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం విమర్శలకు దారి తీశాయి. టీడీపీకి రాజీనామా చేశానని ఆయన ప్రకటించినా.. సనత్‌నగర్‌లో ఉప ఎన్నిక రాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయనే పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయనే ధీమాతోఉన్నారాయన…

2014 ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. మర్రి శశిధర్ రెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కీలక పదవులు చేపట్టారు. అయితే గత ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు టీడీపీని ఆదరించారు. టీడీపీ తరపున పోటీ చేసిన తలసాని 56 వేల ఓట్లు సాధించి 27 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన దండె విఠల్ 29 వేల ఓట్లతో రెండో స్థానంలో, కాంగ్రెస్ నుంచి పోటీచేసిన మర్రి శశిధర్ రెడ్డి 23 వేల ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కూన వెంకటేష్ గౌడ్‌ను ఈసారి టీడీపీ అభ్యర్థిగా సనత్ నగర్ నుంచి బరిలోకి దించింది పార్టీ నాయకత్వం. సనత్‌ నగర్‌ లో కూనకు మంచి పట్టుండటం ఆయనకు ప్లస్ పాయింట్..

సనత్ నగర్ నియోజకవర్గం విషయంలో ప్రజా కూటమి తరపున హై డ్రామా నడిచింది. కూటమి పొత్తుల్లో బాగంగా…ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు వెళుందని కాసేపు, టీడీపీకి వెళుతుందనే చర్చ జరిగింది. కాంగ్రెస్ తరపున తానే పోటీ చేస్తానని మర్రి శశిధర్ రెడ్డి ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో… ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో రెబల్‌గా బరిలోకి దిగుతానని హెచ్చరించారు. అయితే హైకమాండ్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. క్షేత్ర స్థాయిలో టీడీపీ- కాంగ్రెస్ కేడర్ కలుస్తాయా లేదా అనే దానిపై టీడీపీ అభ్యర్థి భవిష్యత్ ఆధారపడి ఉంది.


టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో మంచి మార్కులే వేయించుకున్నారు. ఇక్కడి బస్తీల్లో ఆయనకు సానుకూలత కనిపిస్తోంది. అయితే, సెటిలర్ల ఓట్లు ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపించబోతున్నాయి. టీడీపీతో కాంగ్రెస్ కి పొత్తు ఉన్నందున సెటిలర్లు మహాకూటమి వైపు ఉంటే మాత్రం గట్టి పోటీ జరగనుంది. కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వీరి ఓట్లు ఏకపక్షంగా టీఆర్ఎస్ కే పడ్డాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితులు…. కూన వెంకటేష్ గౌడ్ టీడీపీ తరపున పోటీ చేయడం, సీమాంధ్రుల ఓటు బ్యాంక్ బలంగా ఉండటం, కాంగ్రెస్ ఆయనకు మద్దతిస్తూ ఉండటంతో.. సనత్‌నగర్‌లో ఫలితం ఏకపక్షం అని చెప్పడానికి వీల్లేకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here