సమంత అక్కినేని.. ఈ పేరుకు తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా ఈ స్థాయిలో స్టార్ డమ్ మెయింటేన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. కానీ సమంత చాలా ఈజీగా చేస్తుంది ఇది. ఇప్పుడు కూడా వరస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం జాను సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఈ సందర్భంగానే ఆమె కెరీర్ ను మార్చేసిన 14 సినిమాలు ఓ సారి చూద్దాం..
- ఏ మాయ చేసావే
ఈ రోజు ఇండస్ట్రీలో సమంత ఈ స్థాయిలో ఉందంటే కారణం ఏ మాయ చేసావే. పదేళ్ల కింద గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ చెన్నై సుందరి. భర్త నాగచైతన్యతో కలిసి నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా జెస్సీ, కార్తిక్ కారెక్టర్స్ ను తెలుగులో ఎప్పటికీ నిలిచిపోయేలా చేసాయి. ఈ ఒక్క సినిమాతోనే సమంత పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.
2 దూకుడు
ఏ మాయ చేసావే తర్వాత స్టార్ హీరోయిన్ గా అడుగులు వేయడానికి.. కెరీర్ లో మరో స్టెప్ ముందుకు వేయడానికి సాయపడిన సినిమా దూకుడు. మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో కమర్షియల్ హీరోయిన్ గా కూడా మారిపోయింది సమంత. అంతేకాదు గ్లామర్ షోలో కూడా తనకెలాంటి అభ్యంతరాలు లేవని దూకుడు సినిమాతోనే నిరూపించింది ఈ ముద్దుగుమ్మ.
3ఈగ
సమంత కెరీర్ కొత్తలో ఎక్కువగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలే చేసింది. అలాంటి పాత్రల్లో ఈగ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంలో ఆమె చేసిన ఇందు కారెక్టర్ కు చాలా మంది పేరు వచ్చింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో నానితో కలిసి రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈగ కూడా సమంత కెరీర్ ను మార్చేసిన సినిమాల్లో ఒకటి.
4. ఎటో వెళ్లిపోయింది మనసు
కొన్ని సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించకపోయినా కూడా ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. సమంత కెరీర్ లో అలా నిలిచిపోయిన సినిమా ఎటో వెళ్లిపోయింది మనసు. ఈ చిత్రానికి నంది అవార్డు కూడా అందుకుంది సమంత. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నానితో సమంత కెమిస్ట్రీ అదిరిపోయింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా సమంత కెరీర్ మాత్రం ఈ సినిమాతో మరో మెట్టు పైకి ఎక్కింది.
5.అత్తారింటికి దారేది
కమర్షియల్ సినిమాల్లో కూడా సమంతకు తిరుగులేదు. పవన్ కళ్యాణ్ తో తొలిసారి నటించిన అత్తారింటికి దారేది సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా అప్పటి వరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తుడిచేసి కొత్త రికార్డులకు తెరతీసింది అత్తారింటికి దారేది. ఈ చిత్రంతో సమంత మరోసారి నెంబర్ వన్ అని నిరూపించుకుంది.
6.మనం
సమంత కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే ప్రత్యేకమైన చిత్రం మనం. అక్కినేని కుటుంబం అంతా కలిసి ఈ సినిమాలో నటించింది. అప్పటికి అక్కినేని కోడలు కాకపోయినా ఆ తర్వాత మాత్రం అదే ఇంటికి కోడలిగా వెళ్లింది ఈ భామ. దాంతో మనం సినిమా ఈమెకు ఎప్పటికీ ప్రత్యేకమే. పైగా ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది సమంత.
7.కత్తి
తెలుగులో ఖైదీ నెం 150గా రీమేక్ అయింది ఈ చిత్రం. చిరంజీవి హీరోగా వచ్చిన ఈ చిత్రానికి మాతృక కత్తి. విజయ్ కు జోడీగా ఇందులో స్యామ్ నటించింది. అప్పటి వరకు తమిళనాట సరైన విజయం లేని సమంత కెరీర్ ను ఒక్కసారిగా టాప్ కు తీసుకెళ్లిన సినిమా కత్తి. 2014లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా తమిళనాట కూడా సమంత రేంజ్ పెంచేసింది.
8.అ..ఆ
త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఒక్కసారి హీరోయిన్ నచ్చిందంటే అంత ఈజీగా వదలడు. సమంతను కూడా అంతే. ఈయన కూడా సమంతకు వరస సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. అత్తారింటికి దారేది తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి కూడా కలిసి పనిచేసారు ఈజోడీ. ఇక అ..ఆ సినిమా అయితే పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ అయిపోయింది. అందులో నితిన్ హీరోగా నటించినా కూడా సమంత వల్లే సినిమాకు అంత క్రేజ్ వచ్చింది.
9.మెర్సల్
విజయ్ తో మూడోసారి నటించిన సినిమా ఇది. అప్పటికే కత్తి, తెరీతో సూపర్ హిట్స్ కొట్టిన ఈ జోడీ.. మెర్సల్ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా తమిళనాట సమంత ఇమేజ్ మరింత పెంచేసింది. ఇదే సినిమా తెలుగులో అదిరింది అంటూ వచ్చి ఇక్కడ కూడా అద్భుతమైన విజయం సాధించింది.
10.రంగస్థలం
పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడం.. స్టార్ హీరోయిన్లుగా కొనసాగడం తెలుగు ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు. బాలీవుడ్ లో ఇవన్నీ నడుస్తాయి కానీ ఇక్కడ కష్టమే. కానీ సమంతకు మాత్రం ఇది మినహాయింపు. పెళ్లి తర్వాత కూడా అద్భుతమైన పాత్రలు చేస్తుంది సమంత. అందులో ఒకటి రంగస్థలం. రామలక్ష్మిగా ఈమె నటన ఇందులో అద్భుతమే. సినిమా విజయంలో సమంత పాత్ర కూడా ఎంతో ఉంది. పైగా ఈ చిత్రంతో సమంత ఇమేజ్ మరింత పెరిగిపోయింది.
11.మహానటి
మహానటితో కీర్తిసురేష్ హీరోయిన్ అయినా కూడా కథను ముందుకు నడిపించడంలో సమంతది కూడా అంతే కీలకమైన పాత్ర. ఈ చిత్రంలో మధురవాణి పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు సావిత్రి పాత్ర గురించి చెబుతూనే మరోవైపు తన ప్రేమకథను కూడా చూపిస్తుంది సమంత. ఈ సినిమా విజయం సాధించడంలో సమంతతో పాటు విజయ్ దేవరకొండ పాత్ర కూడా కీలకమే.
12.యు టర్న్
అప్పటి వరకు కేవలం హీరోలతో కలిసి నటిస్తూ వచ్చిన సమంత.. తొలిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. అదే యూ టర్న్. పవన్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్లాప్ అయినా కూడా సమంత నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల ప్రశంసలు అందుకుంది యూ టర్న్.
13.మజిలీ
పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటించిన తొలి సినిమా ఇది. నిన్నుకోరి లాంటి ఎమోషనల్ ఎంటర్ టైనర్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాపై ముందు నుంచి కూడా భారీ అంచనాలున్నాయి. వాటిని నిలబెడుతూ సినిమా సంచలన విజయం సాధించింది. 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది సమంత అక్కినేని. ఈ చిత్రం జులై 5న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో సమంత ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.
14.ఓ బేబీ..
నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన సినిమా ఓ బేబీ. కొరియాలో సూపర్ హిట్ అయిన మిస్ గ్రానీ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. దాంతోపాటు సమంత నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు జాను సినిమాతో మరోసారి మాయ చేయడానికి వస్తుంది సమంత.