Home News Politics

సాగర తీరానా సీనియర్ల పోరు….!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గల 12 అసెంబ్లీ స్థానాల్లో కీలక నియోజకవర్గం నాగర్జునసాగర్. ఇక్కడ కాకలు తీరిన సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో హస్తం పార్టీలో కీలక నేతగా ఉన్న జానారెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం క్యాండెట్ లిస్ట్ లో ముందుండే వ్యక్తి జానా. ఇక అధికార టీఆర్ ఎస్ పార్టీ నుంచి నోముల నర్సింహయ్య బరిలో దిగారు. సీపీఎంలో సీనియర్ మోస్ట్ లీడర్ నోముల గత ఎన్నికల సమయంలో గులాబీ పార్టీలో చేరి సాగర్ సీటు దక్కించుకున్నారు….ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు సీనియార్ల మధ్య సీరియస్ వార్ జరుగనుంది.

గతంలో రద్దైన చలకుర్తి నియోజకవర్గం స్థానంలో ఏర్పడ్డ నాగర్జున సాగర్ నియోజకవర్గం నుంచి జనారెడ్డి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికలలో తన సమీప అభ్యర్థి నోముల నర్సింహయ్య పై 16,558 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నియోజకవర్గ మొత్తం ఓటర్ల సంఖ్య 2,04,545. అనుముల, పెద్దవూర, నిడమనూరు, గుర్రంపోడు, త్రిపురారంలతో పాటు కొత్తగా ఏర్పడిన తిరుమలగిరి(సాగర్‌) మండలాలు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.

1962లో ఏర్పడిన నాగార్జున సాగర్ నియోజకవర్గం పార్టీ కంచుకోట అనే కంటే… వ్యక్తిగా జానారెడ్డి కంచుకోట అని చెప్పొచ్చేమో. 1983 అసెంబ్లీ ఎన్నికల నుంచి పరిశీలిస్తే… 2010 వరకు ఎనిమిది పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డి ఒక పర్యాయం 1994 మినహా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించారు.

దాదాపు 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న జానా… ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి గెలుపొంది మంత్రిమండలిలో కీలకమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కీలక నాయకుడిగా ఉండడంతో నియోజకవర్గంలో ప్రత్యర్థిని ఎదగకుండా చేయడంతో ప్రతి ఎన్నికల్లోనూ ఆయనకు విజయం నల్లేరుమీద నడకగా మారింది. మరి ఈసారి ఎన్నికల్లో కూడా తన విజయ పరంపరను కొనసాగిస్తారా? అన్నది చూడాల్సిందే. మరోవైపు అధికార పార్టీ నుంచి సీపీఎం నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన నోముల నర్సింహయ్యను బరిలోకి దింపారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని నోముల ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటం నోములకు ప్లస్ కాగా స్ఠానికేతరుడు కావడం మైనస్. ఇక్కడ మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం 1999 ఎన్నికల్లో రామ్మూర్తియాదవ్ టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి యాదవ సామాజిక వర్గ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తరుపున చివరి వరకు టిక్కెట్ కోసం ప్రయత్నించిన మరో నేత ఎంసీ కోటిరెడ్డి నోములకు సమస్యగా మారారు. అయితే కొటిరెడ్డిని అధిష్టానం బుజ్జగించి ఒప్పించిన ఆయన సహకారం ఎంతవరకు అన్నది చూడాలి. నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే మాత్రం కాంగ్రెస్ నేత జానారెడ్డికే మొగ్గు కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here