Home News

నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ గెలుపు..జానా ఓటమికి కారణాలివే !

నాగార్జున సాగర్‌లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కాంగ్రెస్ అభ్యర్ది జానారెడ్డి పై 18,449 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. ప్రతిరౌండ్ లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోయింది. దుబ్బాక ఉపఎన్నిక ఓటమితో సిట్టింగ్ సీటు కోల్పోయిన టీఆర్ఎస్ కు ఈ విజయం గొప్ప రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి.

తొలి నుంచి నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే పోటీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్నికల వ్యూహాన్ని కూడా కేసీఆర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక్కడ బీజేపీ నుంచి టిక్కెట్ దక్కని వారికి కూడా కేసీఆర్ కండువా కప్పేశారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ నాయకులంతా సమిష్టిగా పనిచేశారు. ప్రతి మండాలనికి ఒక మంత్రిని ఇన్ ఛార్జిగా నియమించారు. ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేను పర్యవేక్షకుడిగా నియమించారు.

ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు నోముల నరసింహయ్య మరణంతో సానుభూతి కూడా టీఆర్ఎస్ గెలుపులో కీలకపాత్ర వహించింది. ఇక సీనియర్ నేత జానారెడ్డి ఓటమికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించు కోలేకపోతుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శక్తివంచన లేకుండా కృషి చేసింది. జానారెడ్డి అసలు పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు. తన కుమారుడిని బరిలోకి దింపాలని భావించారు. కానీ పార్టీ హైకమాండ్ పట్టు బట్టి మరీ జానారెడ్డిని బరిలోకి దించింది.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జానారెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కూడా నేతలు తమ ప్రచారంలో హైప్ ని ఇచ్చారు. అయినా ప్రజలు మాత్రం జానారెడ్డిని పట్టించుకోలేదు. జానారెడ్డి ఈ ఎన్నికలే తన చివరి ఎన్నికలని చెప్పారు అదే జానారెడ్డి కొంపముంచిందంటున్నారు. జానారెడ్డిని గెలిపించినా తమ ప్రాంతం ఈ మూడేళ్లలో అభివృద్ధి చెందలేదని, ఆయన గెలిచినా మళ్లీ హైదరాబాద్ కే పరిమితమవుతారని ప్రజలు భావించినట్లుంది. జానారెడ్డి ఏ రౌండ్ లోనూ ఆధిక్యత కనపర్చలేదు. పదో రౌండ్ తన సొంత ప్రాంతం అనుములలో మాత్రం వెయ్యిలోపు ఆధిక్యత సంపాదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here