చిన్న సినిమాలా.. బూతు సినిమాలా.. టాలీవుడ్ లో బూతు ట్రెండ్..
సినిమాలు తీసే పద్ధతి మారిపోయింది. మంచి మంచి సినిమాలతో పాటు బూతు సినిమాలు కూడా అలాగే వస్తున్నాయి ఇప్పుడు. తాజాగా డిగ్రీ కాలేజ్ సినిమా విషయంలో జరుగుతున్న రచ్చ అందరికీ తెలుసు. బూతు పోస్టర్ లతో హైదరాబాద్ అంతా పబ్లిసిటీ చేసుకున్నారు దర్శక నిర్మాతలు. అది చూసి జిహెచ్ఎంసితో పాటు మహిళా సంఘాలు కూడా నానా రచ్చ చేస్తున్నాయి. ఒకప్పుడు చిన్న సినిమా అంటే మంచి కాన్సెప్టులు.. కొత్త కథలు అనే అంచనాలు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం చిన్న సినిమా అంటే కేర్ ఆఫ్ ముద్దులు అనిపిస్తుంది. అప్పుడప్పుడూ పెళ్లిచూపులు.. చిలసౌ.. కేరాఫ్ కంచెరపాలెం లాంటి క్లీన్ సినిమాలు వస్తున్నాయిన కానీ ఇప్పుడు చిన్న సినిమా అంటే ఎక్కువగా గుర్తొస్తున్నది మాత్రం ఆర్ఎక్స్ 100.. అర్జున్ రెడ్డి.. డిగ్రీ కాలేజ్.. ఏడు చేపల కథలే. ప్రతీ సినిమాలోనూ ముద్దుల వర్షం కురుస్తుంది. 2018లో వచ్చిన ఆర్ఎక్స్ 100 అయితే కేవలం హాట్ సీన్స్ తోనే హిట్ అయిందంటే అతిశయోక్తి కాదు. ఇక మొన్న ఏడు చేపల కథ అని మరో సినిమా వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఎంతగా ఎదిగిందో అర్థమవుతుంది. అసలు ఈ చిత్రాన్ని టాలీవుడ్ అని కాదు.. హాలీవుడ్ కూడా కాదు..

పోర్న్ సినిమా అనేయాల్సిందే. అంతగా చిన్న సినిమా ముసుగులో ముద్దులు, హాట్ సీన్స్ గుప్పించేసారు దర్శక నిర్మాతలు. ప్రతీ చిన్న విషయాన్ని కూడా ముద్దులతోనే చూపిస్తున్నారు దర్శకులు. అదేంటంటే.. మాటల్లో చెప్పలేని భావాలన్నీ ముద్దులో కనిపిస్తాయి చూడండి అంటున్నారు. ప్రమోషన్ కోసం కేవలం ముద్దులనే వాడుకుంటూ బిజినెస్ చేసుకుంటున్నారు. ఏడు చేపల కథలో అయితే మొత్తం హాట్ సన్నివేశాలు వీరవిహారం చేసాయి. ఇక ఇప్పుడు డిగ్రీ కాలేజ్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది.
జాతీయ అవార్డు గెలుచుకున్న నరసింహ నంది ఈ సినిమాని తెరకెక్కించాడు. అడిగితే మంచి కథను కాస్త బోల్డ్ గా చెప్పాను అని చెబుతున్నాడు కానీ సినిమాలో మాత్రం మొత్తం బూతు తాండవిస్తోంది. ఈ ట్రైలర్ తోనే బిజినెస్ అంతా పూర్తి చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ అసలు ఇది విడుదలవుతుందా అనే దగ్గర నుంచి ఎన్నో కట్స్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ మధ్య వర్మ సాయంతో వచ్చిన భైరవగీత.. మరో సినిమా నాటకం లాంటి వాటిల్లో కూడా ఎక్కువగా కనిపించింది ముద్దులు, హాట్ సీన్సే. ప్రతీ సినిమాలోనూ ఇలా ముద్దుల గోలతో సినిమాలు బాగానే ప్రమోషన్ చేసుకుంటున్నారు. అయితే ఇలా బరితెగిస్తుంటే అది మరో తీరుకు దారి తీస్తుంది అని ఆలోచించుకోవాలి. అంతేకానీ ట్రెండ్ పేరు చెప్పి ఉన్న పేరు చెడగొట్టకూడదు కదా..!