Home News

టీఆర్ఎస్ vs బీజేపీ రాజకీయాన్ని రేవంత్ మారుస్తాడా ?

రేవంత్ రెడ్డి చేతికి పీసీసీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సాగర్ ఎన్నికల్లో గెలుపుతో తిరిగి పుంజుకోవాలనుకున్న జానారెడ్డి బరిలో ఉన్నప్పటికీ ఓటమితో కుదేలైంది. మాజీ మంత్రిఈటల పరిణామాల తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఇప్పుడు బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ అన్నట్లుగానే ప్రజలు చూస్తున్నారు. ఆ రకమైన దూకుడు బీజేపీ నాయకత్వం కనబరుస్తోంది. కాంగ్రెసు పార్టీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏఐసీసీ అధినాయకత్వమే అయోమయంలో ఉంది. ఈ పరిణామాలను బీజేపీ చక్కగా సొమ్ము చేసుకుంటోంది. తాజాగా రేవంత్ నియామకం తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ మారుస్తుందా అన్న చర్చ మొదలైంది.

బీజేపీ ఒక్కరోజులో తెలంగాణలో బలపడలేదు. టీఆర్ఎస్ ను ,కాంగ్రెసును వ్యతిరేకించే శక్తులు తెలంగాణ లో ఎక్కువగానే ఉన్నాయి. ఒకనాడు కాంగ్రెసు, ప్రస్తుతం టీఆర్ఎస్ మైనారిటీలకు అనుకూలమైన విధానాలతో సంతృప్తీకరణ చర్యలతో ఉన్నాయని ఒక వర్గం ప్రజల విశ్వాసం. ఆయా వర్గాలు గతంలో తెలుగుదేశం పార్టీతో ఉంటుండేవి. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం చాప చుట్టేసింది. ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బీసీ సామాజిక వర్గాలు తమ రాజకీయ ఆశలు నెరవేర్చుకోవడానికి బీజేపీని ఒక వేదికగా వినియోగించుకునే వాతావరణం ఏర్పడుతోంది. వారి ఆలోచనలకు మతపరమైన అజెండా కూడా తోడుగా నిలుస్తోంది. మతము, కులము బలమైన రాజకీయ కాంబినేషన్ కు ఉపయోగపడతాయి. వాటినే అస్త్రాలుగా టీఆర్ఎస్ పై పోరాటం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

కాంగ్రెస్ పార్టీ లోపాల పై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవల తరచూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాంగ్రెసు సన్నాసులతో కష్టమొచ్చి పడిందే అంటూ కేబినెట్ సమావేశంలోనే వ్యాఖ్యానించారనేది సమాచారం. బీజేపీ కంటే కాంగ్రెసు పార్టీ ప్రత్యర్థిగా ఉంటే పోరాటం చేయడం సులభం. కానీ కాంగ్రెసు పార్టీ మూలాలు క్రమేపీ కరిగిపోతున్నాయి. దుబ్బాక, జీహెచ్ ఎంసీలో బీజేపీ హవా కొనసాగించడానికి హస్తం పార్టీ బలహీన పడటమే కారణం. బీజేపీ, కాంగ్రెసు రెండూ కూడా ప్రభావం చూపగల స్థాయిలో ఉంటే టీఆర్ఎస్ దే పైచేయి అవుతుంది. కానీ జాతీయ పార్టీలు రెండింటిలో ఒకటి నామమాత్రమైపోతే టీఆర్ఎస్ గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది.

కమలం పార్టీ ఎదగకుండా కాంగ్రెసు పెరగడం కేసీఆర్ కు కూడా ఇష్టమే. కానీ రేవంత్ సారథ్యంలో దీటుగా మారడం మాత్రం నచ్చే ప్రసక్తే లేదు. ఆ సంగతి పక్కన పెడితే హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ కు తక్షణ సమస్యగా కనిపిస్తోంది. ఈ ఉపఎన్నికలో రేవంత్ మ్యాజిక్ పని చేస్తుందా..కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి రేవంత్ సారధ్యంలో ఏ మేరకు పోరాడతారు అన్నది చూడాల్సి ఉంది. పోరు ముఖాముఖిగా మారితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక తగ్గిపోతోంది. తాజాగా హుజూరాబాద్ విషయంలోనూ అదే పరిస్థితి ఏర్పడుతుందేమోనని కేసీఆర్ తల పట్టుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here