Home News

రేవంత్ కి సొంత పార్టీలో కుంపటిలా మారిన సమస్యలివే..!

తెలంగాణ కాగ్రెస్ లో అధిష్టానం వద్ద పరపతి ఉన్న అతికొద్ది మంది నేతల్లో రేవంత్ రెడ్డి ఒకరు. ఢిల్లీ స్థాయిలో మంచి సంబంధాలున్న పాత తరం కాంగ్రెస్ నేతలతోనే రేవంత్ కి సమస్యలొస్తున్నాయి. వీటికి తోడు కులపరమైన గణాంకాలూ పీసీసీ పీఠానికి అడ్డంకిగా మారాయి. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే నేరుగా చంద్రబాబు నాయుడికే పట్టం గట్టినట్లవుతుందని కొందరి వాదన ఇలా రేవంత్ కి సొంతపార్టీలోనే సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.

గతంలో మూడు సార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన హనుమంతరావు అధిష్టానానికి చాలా సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. ప్రజల్లో ఏమాత్రం పలుకుబడి లేకపోయినా నోటితో పెత్తనం చెలాయిస్తుంటారు. స్వయంగా తానే అధ్యక్షుడిని కావాలనే కోరిక ఆయనది. కానీ పీసీసీలో ఎవరూ పట్టించుకోరు. అందుకే పీసీసీ స్థాయి నాయకులపై తన అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు. . రేవంత్ రెడ్డికి దాదాపు ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. కానీ బీసీలు, ఎస్సీలు, తెలంగాణ వాదులు మొత్తం దూరమవుతారనే ఫిర్యాదుతో ఏఐసీసీని వీహెచ్ గందరగోళ పరిచారని కాంగ్రెసు కార్యకర్తలు చెబుతున్నారు.

ఇక రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ మంది అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవనర్ రెడ్డి, జగ్గారెడ్డి తాము అర్హులమని స్వయంగా ప్రకటించుకుంటున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక బీసీల నుంచి మాజీ ఎంపీ మధు యాష్కీ . ఆయన రాహుల్ కు బాగా సన్నిహితుడు. ఇంకోవైపు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ బాబు కూడా ఆశిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే ఎస్సీ వర్గానికి చెందిన శైలజానాధ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అందువల్ల తమకు అవకాశాలు తక్కువని భట్టి విక్రమార్క వంటివారు మౌనం వహిస్తున్నారు.

రేవంత్ రెడ్డి వంటి చురుకైన వ్యక్తి అయితేనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు దీటుగా నిలుస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బీజేపీ చాలా వేగంగా రాష్ట్రంలో విస్తరిస్తోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం ఆకర్షించే పనిలో పడింది. బీజేపీకి చెక్ పెడుతూ టీఆర్ఎస్ పై పోరు సాగించాలంటే రేవంత్ సరైన అభ్యర్థి రాజకీయవిశ్లేషకుల మాట. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ఆయనకున్న సంబంధాలను వెలికితీస్తున్నారు. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తే నేరుగా చంద్రబాబు నాయుడికే పట్టం గట్టినట్లవుతుందని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో కాంగ్రెసు నష్టపోయిందనే వాదన ఉంది. మళ్లీ ఆ ముద్ర వేయించుకున్నట్లవుతుందని కొందరు చెబుతున్నారు.

ఇక వీరందరికంటే ప్రజల్లో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నారు. అధిష్ఠానం సైతం అనేక విడతలుగా నాయకులు, కార్యకర్తల నుంచి సర్వేలు నిర్వహించగా ఆయనవైపే మొగ్గు కనిపించింది. అయితే పోటీలో ఉన్న నాయకులందరికంటే రేవంత్ పార్టీలో జూనియర్. పాప్యులారిటీ కంటే సీనియార్టీకే పెద్ద పీట వేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీని కష్ట కాలంలో విడిచిపెట్టకుండా ఉన్న తమను కాదని రేవంత్ కు పగ్గాలు అప్పగించడం ఎవరికీ ఇష్టం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here