కాంగ్రెస్‌లో గ్రూప్ పాలిటిక్స్ పీక్‌కి చేరుకున్నాయి. పీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడో క్లారిటీ లేదు. ఎవరు ఎప్పుడు.. ఏ పక్షాన ఉంటారో అర్థం కావడం లేదు. నిన్న మొన్నటి వరకు చెట్టపట్టాలేసుకు తిరిగిన నేతలు ఇప్పుడు ఎవరికి పట్టనట్లు విడిపోయారు. వాయిదాలపై వాయిదా పడుతూ వస్తోన్న పీసీసీ చీఫ్ వ్యవహారం ఇప్పుడు మరిన్ని ట్విస్టులకు వేదికైంది. ఒక సమయంలో టీపీసీసీ చీఫ్ గా చర్చకు వచ్చిన జీవన్ రెడ్డి రాజకీయం పై ఇప్పుడు రేవంత్ వర్గం భగ్గుమంటుంది. అసలు జీవన్ రెడ్డి ఏంచేశారు..రేవంత్ వర్గం ఆయన పై ఏ విషయంలో ఫైర్ అవుతున్నారన్నదిఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ముందు సాగిన పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియలో హైకమాండ్ అభిప్రాయం ఎలా ఉన్నాకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. ఆయన సారథ్యానికి మేడమ్ సోనియాగాంధీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరిగింది కూడా. హైకమాండ్ నుంచి ఆయనకు ఇండికేషన్ వచ్చేసిందని అనుకున్నారు. ఇంతలో మాజీ మంత్రి జానారెడ్డి రంగంలోకి దిగి..సాగర్ ఉపఎన్నికయ్యే వరకు పీసీసీ చీఫ్ ఎంపిక ఆపాలని కోరడంతో బ్రేక్ పడింది. జీవన్‌రెడ్డిని నాడు పార్టీ సీనియర్ నాయకులు వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్టు టాక్. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆ వ్యూహం వెనక ఉన్నట్టు కొందరు అనుమానిస్తున్నారు. జీవన్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా.. ప్రచార కమిటీకి ఛైర్మన్‌గా రేవంత్‌రెడ్డి ఉంటే ఇబ్బంది ఉండబోదని చర్చ జరిగింది.
అదే సమయంలో జీవన్‌రెడ్డికి రేవంత్ వర్గంతోపాటు.. రేవంత్ వ్యతిరేక వర్గం కూడా కలిసి రావడంతో ఇబ్బంది లేకుండాపోయిందని చెబుతారు. అయితే ఆ ప్రక్రియ కొలిక్కి వచ్చే సమయంలో పీసీసీ చీఫ్‌పై అధికారిక ప్రకటన ఆగిపోయింది. సాగర్ ఎన్నికల తర్వాత ఢిల్లీ స్థాయిలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకుంది. అధిష్ఠానం అడక్క పోయినా అనేకమంది మళ్లీ తమ అభిప్రాయాలు పంపించారు. మాజీ ఎంపీలలో కొందరు రేవంత్‌కు అనుకూలంగా లేఖ రాశారట. ఆ విషయం తెలియగానే.. సీఎల్పీలోని కొందరు సభ్యులు భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య లెటర్ హెడ్‌పై శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి లాంటి వారు రేవంత్‌కు వ్యతిరేకంగా.. జీవన్‌రెడ్డికి అనుకూలంగా లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి రేవంత్ వర్గం గుర్రుగా ఉందట. మొన్నటి వరకు జీవన్‌రెడ్డి న్యూట్రల్ అని అనుకునన్న రేవంత్ వర్గం లేఖ పై ఓ స్థాయిలో ఫైర్ అవుతుందట.
ఈ విషయం బయటకు పొక్కడంతో కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జీవన్ రెడ్డి కొందరివాడే అన్న ప్రచారాన్ని ఆయన వ్యతిరేక శిబిరం బలంగా తెరమీదకు తెస్తోంది. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరి గ్రూపులు వారివే. మద్దతిచ్చినవారు మనవాళ్లు కానివాళ్లు వ్యతిరేకులు. ఇక నల్లగొండ జిల్లాకు చెందిన కోమటి రెడ్డి సైతం మాజీ ఎంపీలకు కాల్ చేసి.. మీరంతా అలా ఎలా లేఖ రాస్తారని ఫైర్ అయ్యారట. నాయకుల మధ్య మరింత విభేదాలు పెంచుతున్న పీసీసీ నియామకం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న చర్చ పార్టీ కేడర్ లో నడుస్తుంది.