తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తిస్థాయిలో పాలకమండలి ఏర్పాటవుతుందని భావిస్తుంటే స్పెసిఫైడ్ అథారిటీ నియమించి సడన్ ట్విస్ట్ ఇచ్చింది జగన్ సర్కార్. టీటీడీలో పదవి కోసం పైరవీలు సాగించిన వారికి ఆ నిర్ణయం నిరాశపర్చింది. అయితే కొత్త బోర్డు ఏర్పాటుకు మరింత సమయం పడుతుందన్న సంకేతాలను పంపింది ప్రభుత్వం. ఇంతకీ టీటీడీ బోర్డు పై జగన్ మనసులో ఏముంది..ఈ కీలక పదవి ఏ నేతను వరించనుంది అన్నది తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేశారు సీఎం జగన్. సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఛైర్మన్‌గా నియమించారు. ఆ తర్వాత 3 నెలలకు పూర్తిస్థాయిలో పాలకమండలి సభ్యులను ప్రకటించారు. ఆ కమిటీ గడువు ఈ నెల 21తో ముగిసింది. మరోసారి అంతే వేగంగా కొత్త బోర్డు ఏర్పాటవుతుందని భావించారు. కానీ.. అలా ఆశించిన వారి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈవో జవహర్‌రెడ్డి ఛైర్మన్‌గా.. అదనపు ఈవో ధర్మారెడ్డిని కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పట్లో పాలకమండలి ఏర్పాటు లేనట్టేనని ఈ చర్యతో స్పష్టం చేసింది .
టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డికి మరోఛాన్స్ లభిస్తుందని భావించారు. పాలకమండలిలో సభ్యులుగా ఉన్న 10 మందికి మరో అవకాశం ఇస్తారని.. మిగిలిన పదవులకు కొత్తవారిని ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారమే పాలకమండలి నియామకానికి బ్రేక్‌లు వేసిందట. ఛైర్మన్ విషయంలో క్లారిటీతో ఉన్నా.. సభ్యుల దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వంపై ఒత్తిళ్లు ఓ రేంజ్లో ఉన్నాయట. ప్రధానంగా తమిళనాడు, తెలంగాణ కోటాలో క్లారిటీ లేదట. ఢిల్లీ స్థాయిలో పాలకమండలి సభ్యత్వం కోసం ఒత్తిడి ఎక్కువగా ఉందట. అందుకే మధ్యే మార్గంగా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసిందట ప్రభుత్వం.
మరో రెండు నెలల వరకు కొత్త బోర్డు ఏర్పాటు చేయరని అనుకుంటున్నారు. సాధారణంగా టీటీడీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే పాలకమండలి అవసరం. వారం క్రితం జరిగిన చివరి బోర్డు మీటింగ్‌లో అనేక విధానపరమైన నిర్ణయాలు తీసేసుకున్నారు. వీటిని అమలు చేయడానికి మరో సంవత్సరం పట్టే అవకాశం ఉంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి పాలకమండలి భేటీ జరిగాలనే సంప్రదాయం ఉన్నా.. కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. గత కమిటీ ఫిబ్రవరిలో సమావేశమైన తర్వాత ఏప్రిల్‌లో భేటీ కావాలని నిర్ణయించినా కరోనా కారణంగా జూన్‌కు వాయిదా పడింది. దీంతో నాలుగు నెలల తర్వాత సమావేశం జరిగింది.
ఈ విధమైన వెసులుబాటు ఉన్న సమయంలో స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయడం.. ఆశావహులలో అనేక అనుమానాలకు అవకాశం ఇస్తోంది. స్పెసిఫైడ్ అథారిటీలో సాధారణంగా దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిని లేదా రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. కానీ టీటీడీ ఈవో..అదనపు ఈవోలతో స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయడంతో ఇది తాత్కాలిక ఏర్పాటుగా కొందరు భావిస్తున్నారు. మరోపక్క ఇంకో సందేహాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. నెలా రెండు నెలలు కాలానికి అయితే స్పెసిఫైడ్ అథారిటీ అవసరం లేదని.. నాలుగు నెలలపాటు పాలకమండలి సమావేశం లేకుండానే.. టీటీడీ పరిపాలన సాగడంతో.. ఇప్పట్లో కొత్త బోర్డు ఏర్పాటు ఉండదని అనుమానిస్తున్నారట.
రాష్ట్రంలోని మిగిలిన నామినేటెడ్ పదవుల పందేరం పూర్తయిన తర్వాతే టీటీడీ పాలకమండలి నియామకం ఉంటుందన్న వాదన కూడా ఉంది. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు దక్కని వారికి టీటీడీ బోర్డులో చోటు కల్పించి.. సంతృప్తి పర్చాలన్న యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది.