Home News

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్…రాయపాటి ఫిక్స్…!

టీడీపీ నుంచి బీజేపీకి జరుగుతున్న వలసల్లో ఇప్పుడు రాయపాటి సాంబశివరావు వంతు వచ్చిందా? పార్టీలో చేరాలని బీజేపీ నేతల నుంచి… వద్దు టీడీపీలోనే కొనసాగాలని ఆయనపై ఒత్తిడి వస్తోందా? ఈ గుంటూరు రాజీకీయ దిగ్గజం ఇప్పుడు ఏం చేయబోతోంది? పార్టీ మారే విషయమై ఆయన వేసుకుంటున్న లెక్కలేంటి?… ఒకవేళ రాయపాటి కాషాయ కండువా కప్పుకుంటే .. ఆయన రాజకీయ బద్దశత్రువైన కన్నాలక్ష్మినారాయణ పరిస్థితి ఏంటి?

ఏపీలో ఇప్పుడు వలసల రాజకీయం నడుస్తోంది… రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్న నేతలు పక్క పార్టీలలోకి జంప్ అవుతున్నారు … ప్రస్తుతానికి ఈ ఎఫెక్ట్ ఎక్కువగా టిడిపి మీద పడుతోంది… ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేతలు సుజనా, సిఎం. రమేష్‌ వంటి వారు బిజెపి తీర్థం పుచ్చుకోగా… నెక్ట్స్ ఎవరు? అన్న చర్చ జరుగుతోంది…ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత, గుంటూరు రాజకీయ ఉద్దండుడు రాయపాటి సాంబశివరావు వంతు వచ్చినట్లు కనిపిస్తోంది … ఆయన్ను బీజేపీలోకి లాగేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది… నాలుగు రోజుల కిందట గుంటూరు లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాంమాధవ్… రాయపాటి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు… పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. రాం మాధవ్ ఆహ్వానంపై తేల్చి చెప్పని రాయపాటి చేరితే ఏంటి ? చేరకుంటే ఏంటి? అన్న లెక్కలు వేసుకుంటున్నారు.

రాయపాటికి బీజేపీ గాలం వేస్తున్న సంగతి తెలుసుకున్న చంద్రబాబు… గత ఆదివారం ఆయనతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు… పార్టీ మారవద్దని ఏవైనా సమస్యలు ఉంటే తాను చూసుకుంటానని హామీ ఇచ్చారట… సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కోడెల శివప్రసాద్‌ను తప్పించి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు రాయపాటి కుమారుడు రంగారావుకు అప్పగించడానికి కూడా చంద్రబాబు అంగీకరించారట…. గత ఎన్నికల్లోనే రంగారావును సత్తెనపల్లి నుంచి పోటీ చేయించడానికి రాయపాటి తీవ్రంగా ప్రయత్నించారు… అయితే సత్తెనపల్లి వదలడానికి కోడెల ససేమిరా అనడంతో రాయపాటి కొడుక్కి అక్కడ సీటు ఇవ్వడం అప్పుడు వీలుపడలేదు.

ఇక ప్రస్తుతం పోలవరం పనులు చేస్తున్న నవయుగ నుంచి రాయపాటికి రావాల్సిన వంద కోట్ల రూపాయలను కూడా ఇప్పిస్తానని చంద్రబాబు రాయపాటికి హామీ ఇచ్చారట… ఆ డబ్బు కోసమే అయితే బీజేపీలో చేరడం ఎందుకన్న చంద్రబాబు … ఆ సంగతి తనకు వదిలేసి సత్తెనపల్లి నియోజకవర్గాన్ని చూసుకోవాలని సలహా ఇచ్చారట. ఇటు చంద్రబాబు హామీ… అటు అన్నీ తాము చూసుకుంటామంటున్న కమలనాథుల హామీలో దేన్ని నమ్మాలో అర్ధం కాక తలపట్టుకుంటున్నారట రాయపాటి… ఇప్పుడు ఆయన సమస్యంతా కొడుక్కి రాజకీయ ఉపాధి కల్పించడమే… తాను ఎలాగూ వయోభారంతో ఉన్నందున… కొడుక్కి ఓ నియోజకవర్గం.. అదీ గెలిచేది చూపిస్తే బాగుంటుందన్నది రాయపాటి ఆలోచన.. దీనికి బీజేపీ బెస్టా? టీడీపీనే కరెక్టా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు రాయపాటి సాంబశివరావు.

బీజేపీలో చేరడానికి రాయపాటికి మరో ప్రాబ్లమ్ కూడా ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణతో రాయపాటికి తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ నేతలు ఒకప్పుడు కాంగ్రెస్ నేతలే అయినా… పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో గొడవలు అండేవి. జిల్లా రాజకీయాల విషయంలో ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఫిర్మాదు చేసుకునే వారు కూడా. ఈ ఇద్దరి పంచాయితీ తీర్చలేక పార్టీ కూడా చేతులు ఎత్తేసింది. రాయపాటి-కన్నా అనేకసార్లు… బహిరంగంగానే తిట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఆ తర్వాత ఇద్దరూ చేరో పార్టీలో చేరిపోవడంతో ఆ ఆధిపత్య పోరు అంతటితో ఆగింది. మరి అంతటి విభేదాలు పెట్టుకుని ఇప్పుడు కన్నా అధ్యక్షతన రాయపాటి పని చేస్తారా? అందుకు ఆయన కేడర్ అంగీకరిస్తారా? ఒకవేళ రాయపాటి ఒకే అనుకున్నా…. కన్నా ఏమంటారోనన్న ప్రశ్నలు జిల్లాలో వినిపిస్తున్నాయి. తన వద్దకు రాయబారంగా వచ్చిన బీజేపీ అగ్రనేతలతో ఇదే విషయాన్ని రాయపాటి ప్రస్తావించినట్టు చెబుతున్నారు. కన్నాతో ఎటువంటి సమస్య రాదని.. సీనియర్ గా మీ స్వతంత్ర ప్రతిపక్తి మీకు ఉంటుందని…. నిరభ్యంతరంగా పార్టీలో చేరిపోవచ్చని ఆఫర్ ఇచ్చారట కమలనాథులు. కన్నాతో సంబంధంలేకున్నా… ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే ఏ సమస్యా ఉండదు కదా? అన్న ధోరణిని రాయపాటి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు బీజేపీ ఢిల్లీ నేతల నుంచి రాయపాటిపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఒకట్రెండు రోజుల్లో రాయపాటి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ తో రాయపాటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏదేమైనా ఢిల్లీ పర్యటనలో రాయపాటి పార్టీ మారేది లేనిది క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here