వయసు పెరుగుతున్న కొద్దీ తెలియకుండానే మనలో ఓ రకమైన చాదస్తం కూడా పెరుగుతుంది అంటారు. చెప్పిందే చెప్పడం.. లేదంటే తమకు తెలియకుంనే కొన్ని విషయాలు ఆసక్తి ఆపుకోలేక బయట పెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈయనలో కూడా తెలియని ఆ ఆసక్తి కనిపిస్తుంది. ప్రతీసారి ఏదైనా సినిమా వేడుకకు వచ్చినపుడు ఆసక్తి ఆపుకోలేక కథ మొత్తం చెప్పేస్తున్నాడు మెగాస్టార్. లేదంటే ఆ సినిమా విశేషాలను బయట పెడుతున్నాడు. ఇప్పుడు కూడా బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా నటిస్తున్న ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన మెగాస్టార్.. తన 152 వ సినిమా టైటిల్ బయటపెట్టి ఆశ్చర్యపరిచాడు. కొరటాల శివతో చేస్తున్న ఆచార్య సినిమా అంటూ నోరు కరుచుకున్నాడు మెగాస్టార్. ఇప్పటివరకు కొరటాల శివ సినిమా పేరు ఏంటి అంటూ సోషల్ మీడియాలో చాలా హంగామా జరుగుతుంది.

గోవిందా హరి గోవిందా, గోవింద ఆచార్య, ఆచార్య ఇలా మూడు నాలుగు పేర్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో చిరంజీవి నోరు జారాడు. ఎంతో గ్రాండ్ గా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి అందులో అనౌన్స్ చేద్దాం అనుకున్న టైటిల్ కాస్త ఇప్పుడు చాలా సింపుల్ గా తన నోటితోనే చెప్పేసాడు చిరంజీవి. దాంతో కొరటాల సినిమాకు ఆచార్య టైటిల్ కన్ఫర్మ్ చేశారని అర్థమైపోయింది. తాను నోరు జారానని అర్థం అయిన తర్వాత కొరటాల శివకు క్షమాపణ చెప్పాడు మెగాస్టార్. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చిరంజీవి ఇలా ఫంక్షన్లలో నోరు జారడం ఇదే తొలిసారి కాదు. అప్పట్లో గీత గోవిందం సక్సెస్ మీట్ కు వచ్చిన మెగాస్టార్.. కేవలం విడుదలైన ఐదు రోజులకే కథ మొత్తం చెప్పేశాడు. సినిమాలో ఉన్న మెయిన్ ట్విస్ట్ తో సహా సక్సెస్ మీట్ లో అందరికీ చెప్పేసాడు చిరంజీవి.
అప్పుడు మెగాస్టార్ మాట్లాడుతుంటే అక్కడే ఉన్నా హీరో విజయ్ దేవరకొండ కంగారు పడుతూ కనిపించాడు. ఏంటి సర్ ఇది అన్నట్లు అక్కడే ఉన్న అల్లు అరవింద్ వైపు చూస్తే.. ఆయనేదో సర్ది చెప్పాడు. మూడేళ్ల కింద రంగస్థలం ఆడియో వేడుకలో ఏకంగా విడుదలకు ముందే ఆది చనిపోతాడు క్లైమాక్స్ లో అంటూ లీక్ చేసాడు. తెలిసి తెలియక చేస్తోన్న చిరంజీవి చేస్తోన్న ఈ చిన్న పొరపాట్లు సినిమాలపై ప్రభావం చూపించకపోతే చాలు..! ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా కూడా గౌరవంతో తిరిగి ఒక్కమాట కూడా అడగరు. అది చిరునే తెలుసుకుని ఈ సారి ఏదైనా వేడుకకు వస్తే ఆ ఉత్సాహాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిదేమో మరి..? ఇప్పుడు కూడా ఎంతో వైభవంగా తన సినిమా టైటిల్ అనౌన్స్ చేద్దాం అని ప్లాన్ చేసుకుంటున్న రామ్ చరణ్ కు చిరంజీవి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.