Home News Stories

రమణమ్మ జీతం ముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు బలాదూరే…!

పేరు..కోల వెంకట రమణమ్మ. హోదా.. స్వీపర్‌ కమ్‌ గార్డెనర్‌. ఉద్యోగం…శాఖలో ఈస్టర్న్‌ పవర్‌ డిస్కమ్‌, రాజమహేంద్రవరం. జీతం… రూ.1,47,722.
అవును మరి మీరు విన్నది అక్షరాలా… నిజమే! ఆమె జీతం లక్షన్నర. సాఫ్ట్ వేర్ ఉద్యొగులకు సైతం ఔరా అనిపించేలా భారీ వేతనం పొందుతుంది రమణమ్మ.

అవును మరి ఉన్నతొద్యోగులను తలదన్నే రీతిలో శాలరీ డ్రా చేస్తున్న రమణమ్మ  రాజమండ్రి డిస్కమ్‌లో 40 ఏళ్లుగా స్వీపర్‌గా ఉద్యోగం చేస్తుంది….ఇటీవల వాట్సాప్‌లో తెగ షేర్‌ అయిన పే స్లిప్‌ ఇది! ‘వ్వా…ట్‌! స్వీపర్‌కు లక్షన్నరజీతమా! ఇదేదో ఫేక్‌ అయి ఉంటుంది!’ అని అనుకున్నారు. కానీ… ఇది అక్షరాలా నిజం! ఆమె మొత్తం జీతం 1,47,722 రూపాయలు! ఆమె మాత్రమే కాదు… ఇలా లక్షకు పైబడి జీతం తీసుకునే నాలుగో తరగతి ఉద్యోగులు డిస్కమ్‌లలో చాలామందే ఉన్నారు. విద్యుత్తు శాఖలో ఉద్యోగం అంటే… వేతనాల వరం పొందినట్లే. ఇదంతా సంస్కరణల ఫలం! మొదట్లో విద్యుత్తు శాఖను ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ర్టిసిటీ బోర్డు అని పిలిచేవారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు విద్యుత్తుశాఖలో సంస్కరణలకు తెరలేపారు. బోర్డు పోయింది. ‘కంపెనీ’లు వచ్చాయి. విద్యుత్తు ఉత్పత్తికి.. జెన్‌కో! సరఫరాకు.. ట్రాన్స్‌కో ఏర్పడ్డాయి. ట్రాన్స్‌కోలో మళ్లీ ప్రాంతాల వారీగా డిస్కమ్‌లను ఏర్పాటు చేశారు.


పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ రాకపోవడంతో ఉద్యోగుల్లో భరోసా నింపేందుకు అప్పటి ప్రభుత్వం భారీ ఎత్తున వేతనాలు పెంచింది. ఇంక్రిమెంట్లు కూడా అదే స్థాయిలో నిర్ణయించింది. అన్ని హోదాల ఉద్యోగులూ మంచి వేతనాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వీసు బాగా ఉన్న స్వీపర్‌, అంటెండర్ల జీతం ఐదంకెలను దాటి ఆరు అంకెల్లోకి చేరింది. ట్రాన్స్‌కో సీఎండీకంటే 30 ఏళ్ల సర్వీసు ఉన్న చీఫ్‌ ఇంజనీర్‌ జీత భత్యమే ఎక్కువకావడం విశేషం!


రాజమహేంద్రవరం తాడితోట ప్రాంతానికి చెందిన కోల వెంకటరమణమ్మ 1978లో 16వ ఏటనే విద్యుత్తు శాఖలో రోజువారీ ఉద్యోగిగా చేరారు. ఆమె తల్లి కూడా అక్కడే స్వీపర్‌గా పని చేసేవారు. 1981 ఏప్రిల్‌ 1న రమణమ్మ పర్మినెంట్‌ ఎంప్లాయ్‌ అయ్యారు. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయంలోని విద్యుత్‌ చౌర్య నిరోధక విభాగంలోనే పని చేస్తున్నారు. ఇప్పటికే ఆమె సర్వీసు 40 ఏళ్లు దాటింది. రిటైర్‌మెంట్‌కు మరో నాలుగేళ్లు ఉంది. వెరసి… సుదీర్ఘ సర్వీసు కావడంతో జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. రమణమ్మ ఉదయం 8 గంటలకు భోజనం డబ్బాతో వచ్చి… రాత్రి 8 గంటలకు ఇంటికి వెళతారు.

రమణమ్మ అంటే అందరికీ గౌరవం. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేయడం ఆమె నైజం. రమణమ్మకు ఇద్దరు కుమారులు. రైల్వేలో చేసే భర్త వీరభద్రరావు చనిపోవడంతో ఆయన ఉద్యోగం ఒక కుమారుడికి వచ్చింది. మరో కొడుకు గుండె జబ్బు, ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఇటీవల ఇల్లు కట్టుకోవడం కోసం లోన్‌ తీసుకున్నట్లు రమణమ్మ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఆమె ఏమీ చదువుకోలేదు. కనీసం సంతకం పెట్టడం నేర్చుకోవాలన్న ప్రభుత్వ నిబంధనలతో పట్టుదలతో సంతకం పెట్టడం మాత్రం నేర్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here