Home News Updates

వందసార్లు చెబితే ఒక్కసారి చెప్పినట్లు..

రీల్‌ లైఫ్‌ కీ రియల్‌ లైఫ్‌ కీ చాలా తేడా ఉంటుంది. సిన్మాల్లో పుట్టలో చేయిపెట్టి బుసలు కొట్టే పామును బయటికి తీసినంత తేలికకాదు రాజకీయాలంటే. సీటుకు కత్తిగుచ్చి తీస్తే సంధి, తీయకపోతే సమరం అన్నంత ఈజీ కాదు..పార్టీ పెట్టి నడపడమంటే. సిన్మాల్లో బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు. కానీ నిజజీవితంలో తలైవాబాషా మాత్రం వందసార్లు చెప్పినా ఒక్కసారి చెప్పినట్లు కూడా లేదు. సార్‌.కి స్టయిల్‌ ఉంది. కానీ ఫ్లో లేదు. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కానీ దుమ్ము రేపడానికి దమ్ము సరిపోవడం లేదు. ఎస్‌…మనం మాట్లాడుకునేది కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ తలైవా గురించి.

రజినీకాంత్‌ రాజకీయాలగురించి. రజినీకాంత్‌ రాజకీయ ప్రవేశం గురించి ఎల్‌ కే జీ టైంలో మొదలైన డిస్కషన్‌ డిగ్రీకొచ్చేదాకా కంటిన్యూగా సాగుతోంది. మొగిలి రేకులు సీరియల్‌ అయినా అయిపోయిందేమోగానీ రజినీకాంత్‌ పార్టీ గురించిన ప్రచారం మాత్రం సాగుతూనే ఉంది. ఇంకెన్నేళ్లయినా సాగుతూనే ఉంటుందేమో అన్న డౌటొచ్చేస్తోంది. ఈలోపు ఎన్నికలొస్తుంటాయి, పోతుంటాయి. కానీ రజినీకాంత్‌ పార్టీ గురించిన చర్చ మాత్రం సాగిపోతూనే ఉంటుంది.

రజినీకాంత్‌ పార్టీ ప్రచారం ఇప్పటిది కాదు. ఏళ్లుగా ఉంది. ఒకప్పుడు తమిళనాట రాజకీయాల్లో ఉద్దండులైన జయలలిత, కరుణానిధి మధ్య దశాబ్ధాల ఫైట్‌ నడిచింది. దున్నపోతుల మధ్య లేగదూడలా ఎక్కడ నలిగిపోతానో అనుకున్నాడో ఏమో…వాళ్లిద్దరూ ఉండగా డేర్‌ చేసి స్టెప్ వేయలేకపోయాడు తలైవా. ఫ్యాన్సుతో మీటింగ్‌ పెట్టడం, తమ అభిమాన హీరో రాజకీయాల్లోకొచ్చే మూడ్‌.లో ఉన్నాడనే ఆలోచన కలిగించడం, మళ్లీ సైలెంట్‌.గా ఉండిపోవడం. ఏళ్లుగా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చేస్తున్నది ఇదే. మధ్యమధ్యలో ఏవేవో జరిగిపోతుంటాయి.

బీజేపీ నేతలు రజినీకాంత్‌ మావాడంటారు. స్వయానా మోడీనే సూపర్‌ స్టార్‌ ని కలుస్తారు. అయినా తనకు ఏ పార్టీతో సంబంధం లేదని రజినీకాంత్ డైలాగ్ వదులుతారు. జయలలిత, కరుణానిధిల మరణాల తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడిన తర్వాత కూడా రజినీకాంత్ మీనమేషాలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఎస్‌ ఆర్ నో… ఏదో ఒకటి చెప్పేస్తారా అంటే అదీ లేదు. జీవితంలో రాజకీయాల జోలికెళ్లననే మాటన్నా చెబితే…అభిమానులకో క్లారిటీ అన్నా వస్తుంది. అది కూడా జరగదు.

ఎక్కడ రజినీకాంత్‌ పార్టీ పెట్టేస్తాడో, తమ కొంప ముంచేస్తాడోనని రాజకీయపార్టీలు కంగారుపడటం తప్ప…సూపర్‌ స్టార్‌ అడుగుబయటపెట్టడు. ఆయన లెక్కేంటో, అసలాయన ఆలోచనేంటో దండలేసి పొర్లుదండాలు పెట్టే ఫ్యాన్స్‌.కే అర్ధంకాదు. వాస్తవానికి దిగ్గజ నేతలమరణం తర్వాత తమిళనాట రజినీకాంత్‌ పార్టీ ప్రకటించి ఉంటే ఈపాటికి అదో రేంజ్.లో ఉండి ఉండేదేమో. కమల్‌ హాసన్‌ అయినా ఎక్కువ నాన్చకుండా వెంటనే పార్టీ పెట్టేశాడు.

వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటామన్న సంకేతాలిచ్చేశాడు. కానీ ఏడాదిలోపే ఎన్నికలున్నా రజినీకాంత్‌.కి మాత్రం మూడ్‌ రావడం లేదు. అలాగని ఆసక్తి లేదనుకోవడానికీ లేదు. ఆయనకలా అలవాటైపోయిందంతే. మరోవైపేమో ఆయన తుమ్మినా దగ్గినా, గొంతులో కిచ్‌ కిచ్‌ మన్నా…కీలక ప్రకటనేమన్నావస్తుందేమోనని అభిమానులు ఆరాటపడటం తప్ప ఏ సౌండూ లేదు. పాపం ఎన్నాళ్లని వాళ్లు మాత్రం వెయిట్‌ చేస్తారు. అందుకే కడుపులో ఉంది కక్కేశారు. తమ మనసులో ఏముందో పోస్టర్లకి ఎక్కించేశారు.

సారూ…వణక్కం అంటూ తమిళనాట పోస్టర్లు వేశారు రజినీకాంత్‌ అభిమానులు. పోస్టర్లు, కటౌట్లు కొత్త కాకపోయినా కంటెంట్‌ ఈసారి కాస్త మారింది. రజినీకాంత్‌.కి జై కొడుతూనే ఆయన పార్టీ పెట్టాలని కోరుకున్నారు ఫ్యాన్స్‌. రజినీకాంత్‌పార్టీ పెడితేనే ఓట్లేస్తామని తేల్చి చెబుతున్నాయి ఆయన అభిమానసంఘాలు. వేరే పార్టీలకు రజినీకాంత్‌ మద్దతు ఇవ్వకూడదని మనసులో మాట చెప్పేశారు అభిమానులు. ఒకవేళ ఆయన ఎవరికైనా మద్దతిచ్చినా ఆ పార్టీకి ఓట్లేసేది లేదని తెగేసి చెప్పేశారు. రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రాకుంటే తామసలు ఎన్నికల్లో ఓట్లే వేయమంటూ..ఎమోషనల్‌ బ్లాక్ మెయిలింగ్‌ చేశారు. మరి రజినీకాంత్‌ ఇప్పటికయినా పార్టీ పెడతాడో, లేదంటో తాను తటస్థంగానే ఉంటానని చెబుతాడో, అదీ కాకుంటే మీకు నచ్చిన వాళ్లకి వేసుకోమంటాడో చూడాలి. ఎందుకంటే ఆయన దారి…వేరే దారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here