Home News Politics

రాజమండ్రి ఎంపీ పై సైకిల్ పార్టీ సందిగ్దం…!

అధిష్ఠానం మదిలో ఎవరి పేరుందో గాని రాజమహేంద్రవరం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం సిట్టింగ్‌ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ కోడలు మాగంటి రూప పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా జనసేన అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేరు మాత్రమే ఖరారైంది. వైసీపీ అభ్యర్థిగా మార్గాని భరత్‌ పేరు వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక టీడీపీ అభ్యర్థిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు నలుగురు టిక్కెట్లు ఆశించారు. కాని సైకిల్ పార్టీ నిర్ణయం పై సందిగ్దత నెలకొంది….

రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో గన్ని కృష్ణ, బొడ్డు భాస్కరరామారావు, ముళ్లపూడి రేణుక పేర్లు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. అధిష్ఠానం మనసులో ఏముందో అనేది సుమారు నాలుగైదు రోజులుగా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. రూప పేరు వినిపిస్తోంది. ఆమె కాని పక్షంలో మహిళా కోటా కింద ముళ్లపూడి రేణుక పేరు ఖరారయ్యే అవకాశం ఉంది.
తాను కోరనప్పటికీ తన పేరును ఇక్కడ పెద్దలే తెరమీదకు తెచ్చి మళ్లీ అడ్డుతగిలారని గన్ని కృష్ణ అలక పూనినట్టు సమాచారం. ఆయనకు సీటు ఇవ్వాలని పలువురు నాయకులు కార్పొరేటర్లు అమరావతి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎలా బుజ్జగిస్తారో అనేది కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. చట్టసభలోకి వెళ్లాలనేది గన్ని చిరకాల కోరిక.


రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, అనపర్తి, రాజానగరం, గోపాలపురం, కొవ్వూరు అభ్యర్థులు ఖరారయ్యారు. నిడదవోలు సీటుకు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కానీ కొవ్వూరులో మంత్రికి జవహర్‌కు స్థానచలనం తప్పలేదు. ఆయనకు స్థానిక ఒకవర్గంతో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో కృష్ణా జిల్లా తిరువూరు పంపించారు. పాయకరావుపేటకు చెందిన వంగలపూడి అనితను కొవ్వూరు అభ్యర్థిగా పోటీలో పెట్టారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా కానేటి వనిత పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. జనసేన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. గోపాలపురం స్థానానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేరు ఖరారైంది. వైసీపీ, జనసేన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నిడదవోలు సీటు ఇంకా ఖరారు కాలేదు. అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఆయన సోదరుడు, శశి విద్యా సంస్థల అధినేత గోపాలకృష్ణ, ప్రముఖ ఇసుక కాంట్రాక్టర్‌ కుందుల సత్యనారాయణ తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా జీఎస్‌ రావు తనయుడిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

జనసేన అభ్యర్థిని తేల్చాల్సి ఉంది. రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థిత్వం ఆదిరెడ్డి భవానీకి దక్కిన సంగతి తెలిసిందే. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. కానీ ఇటీవల పార్టీలో చేరిన ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నారు. కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జనసేన అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తిరిగి పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి టిక్కెట్టు ఆశించిన గంగుమళ్ల సత్యనారాయణ, ఆర్‌ఎస్‌ఆర్‌ మౌనం దాల్చినట్టు సమాచారం. గంగుమళ్ల ఇంటికి ఎమ్మెల్యే గోరంట్ల స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ పేరు ఖరారైంది. ఇక్కడ వైసీపీ నుంచి ప్రచారంలో ఉన్న ఆకుల వీర్రాజు అభ్యర్థిత్వం ఊగిసలాడుతోంది. ఇతర నేతలకు వైసీపీ వల వేస్తోంది.

అనపర్తిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సీటు ఖరారైంది. వైసీపీ నుంచి డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి పేరు ఒకే కానుంది. జనసేన బీసీ వర్గానికి చెందిన రేలంగి నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించింది. రాజానగరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ తిరిగి టిక్కెట్‌ దక్కించుకున్నారు. ఇక్కడ వైసీపీ అఽభ్యర్థిగా జక్కంపూడి రాజా, విజయలక్ష్మి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జనసేన అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. అమలాపురం రిజర్వుడు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో టీడీపీ కసరత్తు తుది దశకు చేరుకుంది. రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిత్వాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీకి పోటీ చేస్తారనుకున్న దివంగత బాలయోగి తనయుడు హరీష్‌మాధుర్‌ లోక్‌సభ స్థానానికి బరిలో దిగే అవకాశాలు దాదాపు ఖరారయ్యాయి. అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఇద్దరి ముగ్గురి పేర్లను పరిశీలనలోకి తీసుకున్న అధిష్ఠానం పార్టీ నేతల మెజారిటీ అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం వెలువరించనున్నారు.


ఉత్కంఠ రేపిన అమలాపురం లోక్‌సభ అభ్యర్థిత్వం చివరకు గంటి హరీష్‌మాధుర్‌కు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యి. ఈ స్థానం కోసం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నక్కా బాలయోగి పేర్లు అనూహ్యంగా తెరపైకి వచ్చినప్పటికీ చంద్రబాబు తన కీలక అభిప్రాయాన్ని నియోజకవర్గ నేతల ముందుంచినట్టు సమాచారం. బాలయోగి తనయుడు హరీష్‌ మాధుర్‌ను ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయడానికి తాను నిర్ణయించుకున్నానని, అసెంబ్లీ అభ్యర్థి పేరును పార్టీ నాయకులు చెప్పాలని కోరినట్టు సమాచారం. దీంతో నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమలాపురం అసెంబ్లీ టీడీపీ సీటుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, నాయకుడు పరమట శ్యామ్‌తో పాటు ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయి. అయితే నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు, సమన్వయకర్తలు మాత్రం అనివార్య పరిస్థితుల్లో పరమట శ్యామ్‌కు టిక్కెట్‌ ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. అయితే కొన్నిరోజులుగా అమరావతిలోనే మకాం వేసి వున్న గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌ మెట్ల రమణబాబు వర్గీయులు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆనందరావు పేరును మాత్రమే ఖరారు చేయాలని పట్టుబడుతున్నారు. ఏకాభిప్రాయం విషయంలో మెట్ల వర్గం మినహా మిగిలిన వారు పరమట శ్యామ్‌ వైపు మొగ్గుచూపడంతో పాటు అనూహ్యంగా అధికారిక లాబీలో తెరపైకి వచ్చిన బూరిగ ఆశీర్వాదం టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here