ఆయనేమో ఎప్పుడో భార్యను వదిలేసి ఏకాకిలా బతుకుతున్న పెళ్లయిన బ్రహ్మచారి. ఈయనేమో ఫార్టీ ఫైవ్ ప్లస్సయినా ఇంకా ఎవరి మెళ్లోనూ మూడుముళ్లేయని ది మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారి. ఒకరు మిన్ను మిరిగి మీదపడుతున్నా రొమ్ము విరుచుకునే ఉంటాననే ది గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్రమోడీ. మరొకరమో తల్లి కళ్లలో ఆనందం చూసేందుకు ఎప్పటికైనా ప్రధాని సీట్లో కూర్చోవాలని కలలు కంటూనే ఉన్న వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆ ఇద్దరి మధ్యా మాటలయుద్ధం ఎలా ఉన్నా…పార్లమెంట్ సాక్షిగా ఆ సీన్ మాత్రం కలకాలంం గుర్తుండిపోతుంది.
మోడీకి కడుపుమండిందంటే కొరకొరా చూస్తారు. ఆయన మొహంలోనే అసహనం, ఆగ్రహం బయటపడతాయి. కానీ అంతా ముద్దుగా పప్పూ అని పిలుచుకునే రాహుల్‌గాంధీ ఎవరిని ఎన్ని అన్నా మొహం మాత్రం నోట్లో వేలుపెడితే కొరకలేని స్వాతిముత్యంలాగే ఉంటుంది. టీడీపీ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తనవంతు వచ్చినప్పుడు సోనియా ముద్దుల తనయుడు ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. రాఫెల్ ఒప్పందం నుంచి దేశంలో నోట్లరద్దు, జీఎస్టీ, తదితర నిర్ణయాల తలెత్తిన దుష్పరిణామాలదాకా వేటినీ వదల్లేదు.
ప్రసంగం తర్వాత కాంగ్రెస్ యువరాజావారి చర్యే అందరినీ ఆశ్చర్యపరిచింది. మోడీపై తన విమర్శలు పెదవులనుంచి వచ్చినవే తప్ప గుండెల్లోంచి కాదని చెప్పదలుచుకున్నాడో..లేదంటే సైద్ధాంతిక విభేదాలే తప్ప వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా ద్వేషం లేదని చాటి చెప్పాలనుకున్నాడోగానీ ప్రధాని మోడీ దగ్గరికి వెళ్లిపోయాడు రాహుల్. ఓ షేక్‌హ్యాండ్‌తో సరిపెట్టేసుంటే కుర్రోడికి మెచ్యూరిటీ లెవల్స్ పెరిగాయని అంతా అనుకునేవారేమో. కానీ మోడీ మీద పడి మరీ కౌగిలించేసుకుంటే కాసేపు ఎవరికీ ఏం అర్ధంకాలేదు.
మోడీ నిలబడి ఉంటే కరచాలనంతో పాటు చిన్న హగ్ ఇచ్చుంటే ఇంత సంచలనమయ్యేది కాదేమో. మోడీ తలకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని తన సీట్లో కూర్చోనే ఉన్నారు. రాహుల్మాత్రం ఆయనమీద పడిపోయి మరి వన్‌సైడ్ హగ్ ఇచ్చేశారు. పోనీలే పిల్లోడని మొదట బీజేపీ కూడా లైట్‌గా తీసుకున్నా తర్వాత రాహుల్ చర్యని తప్పుపట్టింది. హగ్ ఇచ్చి వచ్చి కామ్‌గా కూర్చున్నాడా అంటే అదీ లేదు. బాగా ఇచ్చానా…అన్నట్లు పక్కనున్న సభ్యులకు రాహుల్ కొంటెగా కన్నుగీటటంతో చాలామందికి చిర్రెత్తుకొచ్చింది. అందుకే అల్లరిచేసే పిల్లాడికి టీచర్ క్లాస్ పీకినట్లు..స్పీకర్ సుమత్రా మహాజన్ రాహుల్‌కి సుద్దులు చెప్పాల్సి వచ్చింది.
ఇక రాహుల్ మోడీని కౌగిలించుకున్న క్షణంనుంచీ సోషల్‌మీడియాలో ఇదో వైరల్ అయిపోయింది. కన్నుకొట్టి నేషనల్ వైడ్ పాపులర్ అయిన కేరళ కుట్టి ప్రియాప్రకాశ్ వారియర్ ఫొటోతో కలిపి తెగ షేర్లు చేసేశారు. ఇద్దరిలో ఎవరు బాగా కన్నుకొట్టారు? రాహుల్ మున్నాభాయ్‌ను గుర్తుచేశాడు’ ‘పప్పుకీఝప్పీ (పప్పు కౌగిలింత)’‘హగ్‌ప్లొమసీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో వేల ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. పనిలోపనిగా.. విదేశీ పర్యటనల్లో ఆయా దేశాల నేతల్ని కౌగిలించుకునే ప్రధాని మోడీకి హగ్ రుచి ఎలా ఉంటుందో రాహుల్ చూపించారని ఇంకొందరి చురకలు. మొత్తానికి సీరియస్ సెషన్లో పెద్ద కామెడీ చేసేశాడు కాంగ్రెస్ అధ్యక్షుడు.