తెలంగాణ రాష్ట్రాన్ని ఒంటిచేత్తో సాధించిందన్న క్రెడిట్ మొన్నటిదాకా ఆ పార్టీకే. ఉద్యమం సకలజనులదయినా ముందుండి నడిపిన పార్టీగా అధికారం టీఆర్ఎస్దే. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ఏవయినా, సెంటర్ ఏదయినా తొడగొట్టి గెలుస్తూ వచ్చిన టీఆర్ఎస్కి మొదటిసారి పెద్ద షాక్ తగిలింది. దుబ్బాక ఓటమి తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పటికీ కలగానే ఉంది. విపక్షపార్టీల ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన పాలేరు, హుజూర్నగర్ స్థానాలను కూడా తనదైన రాజకీయ చాణక్యంతో అలవోకగా గెలిచేసిన టీఆర్ఎస్, సిట్టింగ్ సీటు చేజారటాన్ని జీర్ణించుకోలేకపోతోంది. పైగా టీఆర్ఎస్ ఇప్పటివరకు ఏమాత్రం సీరియస్గా తీసుకోని బీజేపీ…దుబ్బాకలో పాగా వేయడం టీఆర్ఎస్కు అస్సలు మింగుడుపడని విషయం. దుబ్బాకలో గెలిచింది బీజేపీనే అయినా, ఆ విజయం కేంద్ర నాయకత్వానికి కూడా కిక్ ఇచ్చినానూటికి నూరుశాతం విజేత మాత్రం రఘునందన్ రావే.

అవును…దుబ్బాక గెలుపు ముమ్మాటికీ రఘునందన్ రావే. దేశంలో మిగిలిన రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలకంటే దుబ్బాక ఫలితం భిన్నమైంది. డిపాజిట్లే దక్కవని అధికారపార్టీ ఎద్దేవా చేసిన చోట.. బీజేపీ ఏకంగా విజయాన్ని నమోదు చేసుకోవడం చిన్నవిషయమేమీ కాదు. మోడీకున్న క్రేజ్ తోనో, కమలానికి వచ్చిన ఊపుతోనో రాలేదీ విజయం. పార్టీ అభ్యర్థిగా రఘునందన్ రావు కష్టం ఫలించింది. రెండుసార్లు ఓడినా….అందుబాటులో ఉంటే ప్రజలు ఎప్పటికయినా ఆదరిస్తారన్న ఆయన నమ్మకం గెలిచింది. అధికారపార్టీ కోసం అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహం…అంతిమంగా కలిసొచ్చింద.రఘునందన్ రావు. బీజేపీకి తెలంగాణ రాష్ట్ర అధికారప్రతినిధి. టీవీ డిబేట్ లలో పార్టీ వాయిస్ బలంగా వినిపించిన వాగ్దాటి ఉన్న నాయకుడు. అన్నింటికీ మించి క్షేత్రస్థాయిపరిస్థితులను బాగా ఆకళింపు చేసుకున్న నాయకుడు. గాడ్ ఫాదర్ బ్యాక్ గ్రౌండ్ తోనో, ఎవరో ఒకరి ప్రాపకంతోనో ఎదగలేదు రఘునందన్ రావు.
జర్నలిస్ట్ నుంచి రాజకీయ నాయకుడిదాకా ఒక్కో మెట్టూ ఎదుగుతూ వచ్చారు. పైగా న్యాయవాది. ఏపాయింట్ మీదయినా గట్టిగా తన వాదన వినిపించగలిగే గొంతు రఘునందన్ కి అదనపు అర్హతయ్యింది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి హఠాన్మరణం తర్వాత దుబ్బాక ప్రజలు ప్రత్యామ్నాయ శక్తిగా కనిపించారు రఘునందన్ రావు. సెంటిమెంట్ ని కూడా దెబ్బతీసేటంతగా తన ప్రభావాన్ని చూపించారు. దుబ్బాక ఉప ఎన్నికను ప్రకటించగానే బీజేపీ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రఘునందన్ రావుని అభ్యర్థిగా ప్రకటించింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు రఘునందన్ రావు. ఊరూవాడా ప్రచారం చేశారు. ప్రతీ గడపనీ టచ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక అంశాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
సిద్దిపేట ఘటన రఘునందన్ రావుకి కలిసొచ్చింది. ఆయన మామ ఇంటిపై పోలీసుల దాడి మరికొంత సానుభూతిని తెచ్చిపెట్టింది. పోలీసులే డబ్బు తీసుకొచ్చి పెట్టి, రఘునందన్ ని ఇరికించే ప్రయత్నం చేశారనే బీజేపీ వాదనని ప్రజలు విశ్వసించారు. దుబ్బాకబరిలో ఏకు మేకులా మారటంతో…బీజేపీని కట్టడి చేయాలనుకున్న అధికారపార్టీ ప్రయత్నం బూమరాంగ్ అయింది. అడుగడుగునా ప్రచారంలో ఆటంకాలు సృష్టించినా, వాహనాలు సీజ్ చేసినా ఎక్కడా వెనుకంజ వేయలేదు రఘునందన్ రావు. తన రాజకీయ జీవితానికి కీలకమైన టర్నింగ్ అవుతాయనుకున్న ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. ప్రజల మనసులు గెలిచారు. చివరికి వెయ్యి డెబ్భై తొమ్మిది ఓట్ల మెజారిటీనే అయినా…అధికారపార్టీకి ఓటమి రుచిచూపించారు.
90లలో ఓ ప్రముఖ దినపత్రిక స్ట్రింగర్ గా మొదలైంది రఘునందన్ రావు ప్రస్థానం. జర్నలిస్టుగా చిన్నప్పటినుంచే రాజకీయాలపై అవగాహన ఉంది. ప్రజల సమస్యలు తెలుసుకునే క్రమంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, దుబ్బాక స్థితిగతులు అన్నీ ఆయనకు తెలుసు. తర్వాత న్యాయవాదిగా ఉన్నా రాజకీయాలనుంచి ఏనాడూ దూరం జరగలేదు. తన టైం వచ్చేదాకా వెయిట్ చేశారు. అదను చూసి అధికారపార్టీని ఇప్పట్లో కోలుకోలేనంత దెబ్బకొట్టారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఇది బీజేపీ విజయం కంటే… రఘు వ్యక్తిగత విజయంగా చెబుతున్నారంటే…దుబ్బాకపై ఆయన ఎలాంటి ముద్రవేశారో అర్ధంచేసుకోవచ్చు.
ఎవరో విశ్లేషించి చెప్పాల్సిన పనిలేదు. తన విజయానికి కలిసొచ్చిన పరిస్థితులేంటో పరిణితి చెందిన నాయకుడిగా, మాజీ జర్నలిస్టుగా రఘునందన్ రావుకి తెలుసు. అందుకే విజయోత్సవ ర్యాలీలోనే దుబ్బాక ప్రజలతో పాటు సిద్దిపేట ఎస్పీకి, పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు రఘునందన్. సిద్దిపేటలో పోలీసుల తనిఖీలు, ప్రచారంలో వాళ్లు సృష్టించిన అడ్డంకులు తనకు పరోక్షంగా కలిసొచ్చాయని ఆయన చెప్పకనే చెప్పారు. అందుకే సెటైరికల్.గా తన విజయాన్ని పోలీసులకు కూడా అంకితమిచ్చారు. అక్కడితోనే ఆగలేదు రఘునందన్ రావు. గురువు ఆశీస్సులు కూడా ఉంటే బావుంటుందని కామెంట్ చేశారు. ఆయన చెప్పిన గురువు మరెవరో కాదు కేసీఆర్. విజయం సాధించాక తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించాక రఘునందన్ రావు వదిలిన మరో సెటైర్ అది. విద్య నేర్పిన గురువుతోనే పోటీపడితే బాగుంటుందన్న రఘునందన్, తాను గురువుగా భావించిన కేసీఆర్ ఆశీస్సులు లభిస్తాయని ఆశిస్తున్నానని కామెంట్ చేశారు.
సాధారణ ఎన్నికల్లో అందరితో పాటే అసెంబ్లీలోకి అడుగుపెడితే ఇంత జోష్ ఉండేదే కాదు. ఆరున్నరేళ్లుగా అధికారంలో ఉండి.. తెలంగాణలో విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవన్న ధీమాతో ఉన్న గులాబీపార్టీ నమ్మకాన్ని గురిచూసి కొట్టి…శాసనసభలో అడుగుపెడుతున్నారు రఘునందన్ రావు. పార్టీ గెలుపులో అభ్యర్థి ప్రొఫైల్ ఎంత కీలకమో చెప్పేందుకు రఘునంద్ బెస్ట్ ఎగ్జాంపుల్.